సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. సచివాలయం గేటు వద్ద మంగళవారం ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయ సిబ్బంది వారిని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. యువతుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం తమకు ఇప్పించాలని కర్నూలు జ్లిలా నంద్యాలకు చెందిన షాకీరా(25), ఫాతిమాలు తమ కుటుంబ సభ్యులతో సచివాలయానికి వచ్చారు.
అయితే అధికారులు వారిని లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన అక్కాచెల్లెళ్లు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కాగా, ఏపీ సెక్రటేరియట్ వద్ద ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో బాధితులు ఆత్మహత్యకు యత్నించడం ఇది నాలుగోసారి.
ఇరవై ఏళ్లుగా తిరుగుతున్నాం
కర్నూలు జిల్లా కోయిలకుంట్లకు చెందిన మహబూబ్ ఫిరా అగ్రికల్చర్ వీఈవోగా పని చేస్తూ ఇరవై ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి అతని భార్య, ముగ్గురు పిల్లలు అధికారుల చుట్టూ, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్న నష్ట పరిహారం గానీ, ఆ కుటుంబంలో మరో వ్యక్తికి ఉద్యోగం కానీ రాలేదు. ' ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాను.. ఒక అమ్మాయి మైనర్ అవ్వడం వల్ల ఉద్యోగం ఇవ్వటం కుదరదని అప్పట్లో అధికారులు చెప్పారు. ఇప్పుడు మా అమ్మాయి షాకిరాకు 19 ఏళ్లు వచ్చినా ఉద్యోగం ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిని కలవడానికి సచివాలయానికి పది సార్లు సచివాలయం వచ్చాము. సెక్యూరిటీ సిబ్బంది లోపలకు పంపించడం లేదు. తిరిగి తిరిగి విరక్తి చెంది షకీరా, ఫాతిమా పురుగు మందు తాగారు' అని పీరా భార్య తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment