సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఉదయం గ్రీవెన్స్ హాల్‌లో ఉద్యోగులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దుపై ఆదివారం జరిగే మంత్రవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతామని ప్రకటన చేశారు. 27 శాతం మధ్యంతర భృతి ఇస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం నుంచి పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం కావాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారని, గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నవాళ్లను తాను తప్పుపట్టనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
చదవండి...మీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది : సీఎం జగన్
అంతకు ముందు సచివాలయంలో ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు అన్ని శాఖల ముఖ్య అధికారులు, ప్రిన్స్‌పల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారని, మీరు (అధికారులు) పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారంలేని పారదర్శక పాలన అందించడానికి తాను దృఢసంకల్పంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలని కోరారు. అనవసర వ్యయాన్ని తగ్గించాలన్నారు. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానని తెలిపారు. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment