
మీడియాతో మాట్లాడుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ సచివాలయంలో లీకేజీలు మరోసారి బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు లేటెస్ట్ టెక్నాలజీతో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించినట్టు గొప్పలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఛాంబర్‌లో నీళ్లు లీక్ అయితే నానా మాటలు అన్నారని.. కానీ ఇప్పుడు మంత్రుల ఛాంబర్లలో అదే పరిస్ధితి నెలకొందన్నారు. సచివాలయాన్ని మంత్రి లోకేశ్ టెక్నాలజీతో నిర్మించారని ఎద్దేవా చేశారు. మంత్రులు, అధికారులు సచివాలయంలోకి వెళ్లడానికి భయపడుతున్నారని అన్నారు.
వేల కోట్లు ఖర్చుపెట్టి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన చంద్రబాబు, లోకేశ్‌లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా వరద వస్తే సచివాలయం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి పరిస్థితిపై వైఎస్ జగన్ ముందుగానే హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విజయవాడలో డ్రైన్లు పొంగిపొర్లుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నా స్పందించడం లేదని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఇంధ్రభవనం కట్టుకుని.. సచివాలయాన్ని మాత్రం లీక్‌ల భవనంగా మార్చారని విమర్శించారు. కాగా, వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన సచివాలయంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చదవండి; ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు
Comments
Please login to add a commentAdd a comment