మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి, చిత్రంలో గిరిజాశంకర్, ఉన్నతాధికారులు
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటీవల ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీస్, దేవదాయ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వెలంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు.
పూర్తి హంగులతో ఆలయం ఆధునికీకరణ
ఎటువంటి వసతులు లేని రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆలయ డిజైన్లు ప్రాథమికంగా తయారు చేయించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో విగ్రహ పునఃప్రతిష్ఠ తేదీలను ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను సైతం తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.
ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి
రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
అది టీడీపీ కార్మిక సంఘం కట్టుకున్న గుడి
విజయవాడ బస్టాండ్‌లో ఘటన జరిగిన ఆలయం టీడీపీ అనుబంధ కార్మిక సంఘం సభ్యులు కట్టుకున్నదని.. అందులో మట్టి విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారని మంత్రి వివరించారు. ఆ ఆలయానికి, దేవదాయ శాఖకు, ప్రభుత్వానికి సంబంధం లేదని.. గుడి భద్రతను పట్టించుకోవాల్సిన టీడీపీ దానిని ఎందుకు పట్టించుకోలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ధ్వంసంపైనా సీఐడీ విచారణకు ఆదేశించామని.. ఆ ఆలయం కూడా టీడీపీ నేత గన్ని కృష్ణ నిర్వహణలో ఉందని అన్నారు.
నిందితులకు శిక్షలు పడ్డాయ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవదాయ శాఖకు సంబంధించి 8 ఆలయాల్లో దుశ్చర్యలు చోటు చేసుకున్నాయని.. వాటిలో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉండే వాటితో కలిపి మొత్తం 31 ఆలయాలపై దాడులు జరిగాయని, గుప్త నిధుల కోసం తవ్వకాలు, హుండీ చోరీలు వంటి వాటితో కలిపి పోలీసులు 88 కేసులు నమోదు చేశారని వివరించారు. ఆ కేసుల్లో 159 మందిని అరెస్ట్ చేశారని, వారిలో కొందరికి రెండేళ్ల శిక్ష పడిందని, మరికొందరు రిమాండ్‌లో ఉన్నారని వివరించారు.
ప్రైవేట్ ఆలయాల్లో భద్రతపైనా దృష్టి
గడచిన రెండేళ్లలో రాష్ట్రంలోని 31 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు దేవదాయ శాఖ గుర్తించింది. వీటిలో 23 ఆలయాలు ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉన్నట్టు తేల్చారు. దేవదాయ శాఖ పరిధిలోని 8 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో మారుమూల ఉండే ప్రైవేట్ ఆలయాల భద్రతపై దేవదాయ శాఖ, పోలీసులు శాఖ దృష్టి పెట్టాయి. ప్రైవేట్ ఆలయాల భద్రత విషయంలో ఆలయ నిర్వహక కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసు స్టేషన్ల వారీగా ప్రైవేట్ ఆలయాల నిర్వహకులను పిలిపించి మాట్లాడే ప్రక్రియను పోలీసులు మొదలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment