ఉన్నత విద్యావంతుల కొలువు | Higher education in the state new cabinet | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యావంతుల కొలువు

Published Sun, Jun 9 2019 4:14 AM | Last Updated on Sun, Jun 9 2019 4:14 AM

Higher education in the state new cabinet - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఉన్నత విద్యావంతులున్నారు. చాలామంది మంత్రులు గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లే కావడం విశేషం. ఇద్దరు డాక్టరేట్లు పొందిన మంత్రులయ్యారు. ఒక డెంటల్‌ డాక్టరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ, పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ హోదాలో ఉన్నారు. విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆదిమూలం సురేష్‌ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ పొందడం విశేషం.

నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బీడీఎస్‌(దంత వైద్యం) కోర్సు చేశారు. పాముల పుష్ప శ్రీవాణి, విశ్వరూప్‌ బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత బీఈడీ చేశారు. కురసాల కన్నబాబు డబుల్‌ ఎంఏ (రాజనీతి శాస్త్రం, జర్నలిజం) చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా ఇంజనీరింగ్‌ పట్టభద్రుడు. శంకరనారాయణ బీకాం చేసిన తర్వాత ఎల్‌ఎల్‌బీ చేశారు. మంత్రుల్లో నలుగురు ఎస్సెస్సీ చదివిన వారు ఉండగా, మిగిలిన వారంతా గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, డాక్టరేట్లు సాధించిన వారు కావడం గమనార్హం.  

తండ్రి, తనయుడి మంత్రివర్గాల్లో ఆరుగురు
రాష్ట్ర మంత్రివర్గం పాత, కొత్తల మేలుకలయికగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణారావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డిలకు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వీరంతా వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. తండ్రి (వైఎస్‌ రాజశేఖరరెడ్డి) మంత్రివర్గంలో, తనయుడి (వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి) మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకుని, అరుదైన రికార్డును వీరు సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. శనివారం ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం 25 మందిలో 19 మంది తొలిసారి మంత్రులయ్యారు. వీరిలో బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌ హోదాలో మంత్రులకున్నంత అనుభవం గడించారు.  

అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు
మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని వెంకటరామయ్యకు(నాని) జగన్‌ మంత్రివర్గంలో చోటు దక్కింది. నాని తండ్రి, దివంగత కృష్ణమూర్తి ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ మంత్రివర్గాల్లో పని చేశారు.

మహిళలకు హోం శాఖ ఇచ్చింది వైఎస్‌ కుటుంబమే
ఉమ్మడి ఏపీలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ 2009లో రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలోనే ఓ మహిళకు హోం మంత్రిత్వ శాఖను కట్టబెట్టి ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పటివరకూ కేంద్రంలో గానీ, రాష్ట్రాల్లో గానీ హోం శాఖను మహిళలు నిర్వహించిన దాఖలాలు లేవు. అలాంటిది తొలుత వైఎస్‌ ఆ శాఖను సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. çపదేళ్ల తరువాత మళ్లీ ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో ఓ మహిళకు.. అందులోనూ దళిత మహిళ మేకతోటి సుచరితకు హోం శాఖను కేటాయించి చరిత్ర సృష్టించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement