ఏపీ సచివాలయం అదనపు పనుల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్
- రూ.350 కోట్ల విలువైన వసతుల టెండర్లూ ఆ రెండు కంపెనీలకే
- మళ్లీ ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీకే ఖరారు
సాక్షి, విజయవాడ బ్యూరో: వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయానికి సంబంధించిన రూ.350 కోట్ల విలువైన అదనపు పనులను ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు కుమ్మక్కై సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు సీఆర్‌డీఏ టెండర్లు ఖరారు ప్రక్రియను గోప్యంగా ఉంచి.. ఆ రెండు సంస్థలకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడంతో వాటి పని సులభమైంది. మొత్తం ఐదు ప్యాకేజీల్లో మూడింటిని ఎల్ అండ్ టీ సొంతం చేసుకోగా, రెండింటిని షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది.
వెలగపూడిలో ఆరు భవనాలకు గాను రెండింటిని షాపూర్‌జీ పల్లోంజీ, నాలుగింటిని ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అవే భవనాల్లో అంతర్గత పనులను మూడు ప్యాకేజీలుగా, సముదాయంలో అంతర్గత రోడ్లు, అనుసంధాన రహదారి, మురుగునీటి శుద్ధి కేంద్రం, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి 20 రోజుల క్రితం సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. సుమారు రూ.350 కోట్ల విలువైన ఈ ఐదు ప్యా కేజీలకు దాఖలైన టెండర్లను శుక్రవారం తెరిచారు. అయితే వీటన్నింటికీ షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
వాటి ప్రైస్ బిడ్లను శనివారం విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో తెరిచి తక్కువ కోట్ చేసిన కంపెనీకి టెండర్లు ఖరారు చేశారు. ఇప్పటికే వెలగపూడిలో ఏ కంపెనీ ఏ బ్లాకును నిర్మిస్తుందో అదే కంపెనీ అదే బ్లాకుకు సంబంధించిన అంతర్గత పనులను దక్కించుకోవడం గమనార్హం. దీన్నిబట్టి రెండు కంపెనీలు ముందే లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని తమకు కావాల్సిన మొత్తాలకు టెండర్లు కోట్ చేశాయనేది విదితమవుతోంది. షాపూర్‌జీ పల్లోంజీ ప్రస్తుతం తాను నిర్మిస్తున్న రెండు భవనాలకు.. నిబంధనల మేరకు టెండర్లు దాఖలు చేయగా, అవే భవనాలకు ఎల్ అండ్ టీ ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేసింది. దీంతో ఆ రెండు టెండర్లు షాపూర్‌జీకి దక్కాయి. ఇలాగే ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగు భవనాలకు ఆ కంపెనీ కచ్చితంగా వచ్చేలా టెండర్లు వేయగా.. షాపూర్‌జీ కంపెనీ ఎక్సెస్‌కు టెండర్లు వేసింది. దీంతో ఎల్ అండ్ టీ టెండర్లు ఖరారయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం ఐదు ప్యాకేజీలకు ఐదు శాతం ఎక్సెస్‌కు టెండర్లు వేయగా వాటిని ఆమోదించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీఆర్‌డీఏ మీడియా సహా ఎవరికీ తెలియకుండా నిర్వహించింది.
గతంలోనూ 12 శాతం ఎక్సెస్‌కు ఆమోదం..
ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు ఇప్పటికే నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాల టెండర్లను మూడు నెలలక్రితం రూ.202 కోట్లకు దక్కించుకున్నాయి. అప్పట్లోనూ 12 శాతం ఎక్సెస్‌కు కోట్ చేసినా కేబినెట్ ఆమోదంతో వాటిని ఖరారు చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని పెంచి రూ.240 కోట్లకు ఆరు భవనాల నిర్మాణ పనులను రెండు కంపెనీలకు అప్పగించారు. తాజాగా అదనపు పనులు, అంతర్గత పనులన్నీ కలిపి రూ.350 కోట్ల విలువైన టెండర్లను మళ్లీ వాటికే అప్పగించారు. దీంతో రూ.590 కోట్ల పనులను ఆ రెండు సంస్థలకు అప్పగించినట్లయింది. ఈ నెల 27వ తేదీకల్లా హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు రావాలని అల్టిమేటం ఇచ్చిన ప్రభుత్వం మౌలిక వసతుల పనులను మాత్రం శనివారం ఖరారు చేయడం గమనించాల్సిన అంశం. నిబంధనల ప్రకారం ఈ పనులను మూడు నెలల్లోపు పూర్తి చేసే అవకాశాన్ని ఆ కంపెనీలకిచ్చారు. కానీ అనధికారికంగా పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.