హైదరాబాద్‌లో నేడే చివరి రోజు
- వెలగపూడికి తరలిపోతున్న ఏపీ సచివాలయం
- 3వ తేదీ నుంచి అక్కడి నుంచే పాలన
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు వెలగపూడి సచివాలయానికి శాశ్వతంగా తరలివెళ్లేందుకు ఫైళ్లు సర్దుకున్నారు. ఒకటీ రెండు మినహా దాదాపుగా అన్ని విభాగాల్లోనూ కంప్యూటర్లు, ఫైళ్ల ప్యాకింగ్ ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. హెదరాబాద్ సచివాలయంలో శనివారమే చివరి పనిరోజు. ఏపీ సచివాలయం 3వ తేదీ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా అక్టోబర్ 11 నుంచి వెలగపూడి నుంచే పనిచేయనుంది. నూతన రాజధానికి సచివాలయం తరలింపు నేపథ్యంలో పాలన వ్యవహారాలు సుమారు పక్షం రోజుల పాటు స్తంభించనున్నాయి. తరలింపులో భాగంగా ఫైళ్లు, కంప్యూటర్లను ప్యాక్ చేయడంతో శుక్రవారం అన్ని శాఖలు కలిపి కేవలం తొమ్మిది జీవోలు మాత్రమే జారీ చేశాయి. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల తరలింపునకు మ రో నెల రోజులు సమయం తీసుకోనున్నారు. సంక్షేమ శాఖల ఉద్యోగుల తరలింపును దసరా తరువాత చేపట్టనున్నారు.