మరిన్ని ఎన్నికల హామీలను అమల్లోకి తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.