
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెనుమార్పులు జరుగుతున్నాయన్నారు. గత పాలకుల అవినీతిని ఎండగడుతున్నారని, ప్రజల వద్దకు పాలన తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు రామకృష్ణారెడ్డి అన్నారు. తండ్రి వైఎస్సార్ పాలనను అనుకరిస్తూ తనదైన శైలిలో వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం జగన్ చేస్తున్న యజ్ఞంలో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రజా వ్యవహారాల సలహాదారుడిగా విలువైన సలహాలు, సూచనలు చేస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.