వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పేద మహిళలకు దుస్తుల పంపిణీ
గెలుపు ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే వైఎస్ జగన్ లక్ష్యం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
పేదలకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ.. పెద్ద ఎత్తున అన్నదానం, రక్తదానం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, విజనరీ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారారని తెలిపారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
పెద్ద ఎత్తున తరలివచి్చన అభిమానుల కోలాహలంగా మధ్య జరిగిన ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముందుగా వైఎస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు, ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.
తాడేపల్లిలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ
భారీ బైక్ ర్యాలీ
వైఎస్సార్‌సీపీ విద్యార్థి – యువజన – సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న.. ప్రజా సేవకా.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాడేపల్లి పురవీధుల్లో ర్యాలీ చేశారు.
మేలును గుర్తుచేసుకున్న ప్రజలు
గత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‘పేద ప్రజలకు సుపరిపాలన అందించిన ధీరుడు మా అన్న జగన్మోహనుడు.. పారిశ్రామిక ప్రగతిలో తనదైన ముద్ర వేశారు.. రాష్ట్రం ఎయిర్ కండీషన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ హబ్‌లకు వేదికైంది.. చదువుతోనే పేద బిడ్డల తల రాత మారుతుందని నమ్మిన ఏకైక నేత.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారందరికీ ప్రతీ పథకం ఇంటి వద్దనే అందించాలని తపనపడే మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు’ అని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment