ఊరూ వాడా వైఎస్సార్‌కు నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు చేపట్టా
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడా ఘనంగా నిర్వహిద్దామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ జయంతి రోజైన జూలై 8 (సోమవారం)న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో రామకృష్ణారెడ్డి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈసారి వైఎస్సార్ 75వ జయంతి అయినందున రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమాలపై ఇప్పటికే సమాచారం అందించామని తెలిపారు. విగ్రహాలను సిద్ధం చేసి కింది స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. మళ్లీ పార్టీ చైతన్యవంతమై, ప్రజల్లోకి దూసుకుపోయేందుకు ఇది తొలి అడుగులా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఆదేశించారని తెలిపారు.
వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్
వైఎస్సార్ మరణించి 15 సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆయన ఆలోచనలనే సిద్ధాంతాలుగా చేసుకుని వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని, ప్రజల్లో మమేకమైన నాయకుడు ఎలా ఉండాలో ఆయన ద్వారా నేర్చుకున్నామని తెలిపారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్ ప్రజలతోనే మమేకమై ఉన్నారని, పార్టీ కూడా ఎప్పుడూ ప్రజలతోనే నడిచిందని వివరించారు.
వైఎస్సార్ మొదలు పెట్టిన పథకాలకు వైఎస్ జగన్ గత 5 ఏళ్లలో పూర్తి రూపం ఇవ్వడమే కాకుండా, వాటికి మరిన్ని జోడించి వ్యవస్థల్లో మంచి మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో తొలిసారి వైఎస్ జగన్ పేదరికాన్ని పారదోలి, అందరికీ సమాన అవకాశాలను కలిగించేలా పేదలను చేయి పట్టుకుని నడిపిస్తూ, సుస్థిరమైన అభివృద్ధి, అభ్యుదయం దిశగా రాష్ట్రాన్ని నడిపిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదన్నారు. మనం చేసిన మంచి పనుల వల్ల వచ్చిన మార్పులు కళ్ల ముందే కనపడుతున్నాయని తెలిపారు. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకుందని, ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు.
ఎప్పటికీ ప్రజలతో మమేకమై ఉంటాం
పథకాల లబ్ధిదారులంతా ఓటు రూపంలో మనకు అండగా నిలుస్తారనుకున్నామని, కానీ టీడీపీ మోసపూరిత, అమలు సాధ్యం కానీ హామీలను ప్రజలు నమ్మి ఉండొచ్చని, ఇతర కారణాలు కూడా తోడై ఈ ఫలితాలు వచ్చాయని సజ్జల అభిప్రాయపడ్డారు. పోలింగ్ అయిన వెంటనే టీడీపీ రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment