హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద రుణమాఫీ బాధితులు సోమవారం వచ్చారు. అన్ని అర్హత పత్రాలు ఉన్నా రుణమాఫీ వర్తించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలిసేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పొగాకు రైతులకు రుణమాఫీ ఇవ్వటం లేదని వారు వాపోయారు.
బ్యాంకు పుస్తకాలు, ఆధార్ కార్డులు ఉన్నా రుణమాఫీ జాబితాలో తమను చేర్చలేదని ఫిర్యాదు ఈ సందర్భంగా కుటుంబరావుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోలు, బ్యాంకు అధికారులు సమాధానం చెప్పటం లేదని రైతులు తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయలేదని రైతులు ఆవేదన చెందారు. కాగా రెండోవిడత రుణమాఫీ అమలు విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200మంది రైతులు సచివాలయానికి వచ్చారు.