1997 చివరి వరకూ బీభత్సమైన ర్యాలీ..! కానీ 1998లో మాత్రం అదే స్థాయి ఎగుడుదిగుళ్లు. ఆ సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు ఏకంగా 40 శాతం వరకూ నష్టపోయాయి. కోలుకోవటానికి ఏడాది పట్టింది.
2007 చివరి వరకూ కూడా ఇలాంటి పరిస్థితే. మార్కెట్లు మరిచిపోలేని పరుగు తీశాయి. కానీ 2008లో..? దారుణమైన పతనం. మళ్లీ ఆ మార్కెట్లు కోలుకోవటానికి ఏకంగా నాలుగైదేళ్లు పట్టేశాయి.
ఇపుడు 2017లో... మునుపటి బుల్ రన్స్‌ను మైమరిపించేటంతటి డ్రీమ్ రన్. ఇండెక్స్‌లే కాదు. చాలా షేర్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల్ని తాకాయి. మరి 2018లో ఏం జరుగుతుంది?
ప్రతి పదేళ్లకోసారి భారత స్టాక్ మార్కెట్లలో చరిత్ర పునరావృతమవుతుందా? ఎగుడు దిగుళ్లు కళ్లకు కడతాయా? లేకపోతే ప్రస్తుత ర్యాలీకి దేశీయ మదుపరుల వెన్నుదన్నులున్నాయి కనుక... నిధుల ప్రవాహం బాగుంది కనక ర్యాలీ ఇలాగే కొనసాగుతుందా? భవిష్యత్తును ఊహించటం కష్టమే కాగా... ఈ విషయంలో విశ్లేషకుల అభిప్రాయం ఒకింత ప్రతికూలంగానే ఉంది.
అందరూ ఎత్తుపల్లాలు తప్పకపోవచ్చని చెబుతుండగా... కొందరు మాత్రం కంపెనీల ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటే ఈ బుల్ పరుగు ఇలాగే కొనసాగుతుందని, నిఫ్టీ 11,000 మైలురాయిని అధిగమిస్తుందని చెబుతున్నారు. అయితే మార్కెట్లు పడకపోయినా అక్కడక్కడే కన్సాలిడేట్ కావచ్చని, కొన్ని రంగాల షేర్లు మాత్రం పరుగులు పెడతాయని ఇంకొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2018పై ఎవరి అంచనాలేంటి? ఏఏ రంగాలపై బుల్లిష్‌గా ఉన్నారు? ఏఏ షేర్లను సిఫారసు చేస్తున్నారు? మొత్తంగా స్టాక్ మార్కెట్ మదుపరులకు కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆయా వివరాలన్నీ గుదిగుచ్చి ‘సాక్షి’ బిజినెస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం...
దేశీ స్టాక్ మార్కెట్లకు 2018లో ఒడిదుడుకులు తప్పకపోవచ్చన్నది జెన్‌మనీ జాయింట్ ఎండీ సతీష్ కంతేటి మాట. 2017 స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చని.. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఇందుకు కారణంగా నిలవవచ్చని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన. మార్కెట్ల గమనంపై ఇంకా ఆయనేమన్నారంటే...
కొత్త సంవత్సరంలో మార్కెట్లను ప్రభావితం చేయబోయే మూడు, నాలుగంశాలున్నాయి. రాబోయే బడ్జెట్‌లో మళ్లీ స్టాక్స్‌పై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను (ఎల్‌టీసీజీ) ప్రవేశపెట్టొచ్చన్న అంచనాలు తక్షణం ప్రభావం చూపిస్తాయి. ఇది రెట్రాస్పెక్టివ్‌గా కాకుండా 2018 ఏప్రిల్ 1 తర్వాత కొన్న వాటికి మాత్రమే వర్తింపజేస్తే గనక మార్కెట్ మరీ నెగెటివ్‌గా రియాక్ట్ కాకపోవచ్చు. అలా కాకుండా రెట్రాస్పెక్టివ్‌గా ఉంటే మాత్రం సూచీలు పతనమయ్యే అవకాశముంది.
ఏదైతేనేం.. దీనిపై అనిశ్చితితో బడ్జెట్ దాకా ఒడిదుడుకులు కొనసాగవచ్చు. మరోవైపు, డీమోనిటైజేషన్, జీఎస్‌టీ వంటి అంశాల వల్ల ఆదాయం వృద్ధి కావటానికి మరికొంత సమయం పడుతుంది. జీఎస్‌టీ తరువాత పన్నుల వసూళ్లు ఇంకా స్థిరపడలేదు. ఫలితంగా ప్రభుత్వం రూ. 50,000 కోట్ల మేర నిధులు సమీకరించాలనే యోచనలో ఉండటమనేది... ద్రవ్యలోటు పెరగటానికి దారితీయొచ్చు. అటు ఆర్‌బీఐ లకి‡్ష్యంచిన దానికన్నా కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉండొచ్చు.
ఈ పరిణామాలన్నీ కూడా వడ్డీ రేట్ల పెంపునకు దారి తీయొచ్చు. ఏదైతేనేం... జీఎస్‌టీ, డీమోనిటైజేషన్ ప్రభావాల నుంచి బయటపడి ఎకానమీ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ముందే.. వచ్చే ఒకటిరెండు త్రైమాసికాల్లో వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ నెగెటివ్‌గా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ముడి చమురు ధర పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగి, అంతర్జాతీయ ధోరణిలోనే ఇక్కడా వడ్డీ రేట్లు పెరిగే రిస్కులున్నాయి.
ఎన్నికల ఫలితాలూ కీలకమే...
వచ్చే ఏడాది కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. వీటి ఫలితాలను మార్కెట్ నిశితంగా పరిశీలిస్తుంది. ఆ పై ఏడాది కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుపై వీటి ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేది చూస్తుంది. కాస్త అటూ ఇటూగా 2019లో కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు ఏమాత్రం భిన్నమైన ఫలితాలొచ్చినా.. మార్కెట్లు నెగెటివ్‌గా స్పందించే అవకాశం ఉంటుంది.
మార్కెట్లు అస్థిరతను, అనిశ్చితిని ఇష్టపడవు. పాజిటివ్‌గా కావొచ్చు.. నెగెటివ్‌గా కావొచ్చు. కొన్నాళ్లుగా చూస్తే కేంద్ర ఎన్నికలకు ముందు పరిస్థితులను బట్టి మార్కెట్లు గణనీయమైన మార్పులకు లోనవుతున్నాయి. అదే విధంగా సార్వత్రిక ఎన్నికలు 2019లోనే ఉన్నప్పటికీ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి మార్కెట్లు 2018 నుంచే డిస్కౌంటింగ్ చేసుకునే అవకాశాలున్నాయి. 2019లో స్థిరమైన ప్రభుత్వం వచ్చే సంకేతాలుంటే తప్ప 2018లో మార్కెట్లు... 2017 స్థాయి రిటర్నులు ఇవ్వకపోవచ్చు. 2018లో మరిన్ని ప్రతికూల పవనాలు వీచే అవకాశాలు ఉన్నందున.. కరెక్షన్ అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మార్కెట్ల వృద్ధి గతంతో పోలిస్తే తక్కువగానే ఉండొచ్చు.
కంపెనీల ఫలితాలే దిక్సూచి
‘‘కొత్త ఏడాది భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు, భారత మార్కెట్లకు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనేది నా అభిప్రాయం. 2008 నుంచీ ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం సానుకూలంగా ఉంటోంది. 2017లో జీఎస్‌టీతో భారత ఆర్థిక వ్యవస్థ భారీ సంస్కరణలకు తెర తీసింది. పెద్ద నోట్లను రద్దు చేయటంతో సహా వీటి వాస్తవ ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. దేశీ స్టాక్ మార్కెట్లు మాత్రం జనవరి నుంచి వెలువడే కంపెనీల ఫలితాల్ని బట్టే ఒక మలుపు తీసుకుంటాయి.’’
– వైభవ్ సంఘవి, కో–సీఈఓ, అవెండాస్ క్యాపిటల్ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్
10,650 దాటితే నిఫ్టీ@ 11,200
‘‘2016 డిసెంబర్లో నిఫ్టీ దాదాపు 7,893 పాయింట్ల దగ్గర ఉంది. అక్కడి నుంచి ఒకే ఏడాదిలో ఏకంగా 10,500 పాయింట్లను దాటేసింది. విచిత్రమేంటంటే మధ్యలో ఎక్కడా భారీ కరెక్షన్‌లు కూడా రాలేదు. కాబట్టి ఈ ర్యాలీ కొనసాగుతుందనే అంచనాలున్నా... తగిన కరెక్షన్ రాకుండా ఇలా ఎంతవరకు వెళుతుందనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
నా ఉద్దేశం ప్రకారం నిఫ్టీ తదుపరి 10,650 పాయింట్లను చేరుతుంది. దాన్ని గనక పూర్తిస్థాయి కొనుగోళ్ల మద్దతుతో దాటేస్తే, 11,200 పాయింట్లను అవలీలగా దాటేస్తుంది. కాకపోతే కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే బుక్‌వేల్యూ, పీఈ రేషియో వంటి ఫండమెంటల్స్ చూసి కొనటానికి చాలా షేర్లు అనుకూలంగా లేవు. వాటిని కొంటే ఇంకా పెరుగుతాయనే నమ్మకం లేదు. కాబట్టి మున్ముందు కంపెనీల ఫలితాలు బాగుంటేనే మరింత ర్యాలీ జరుగుతుందని ఆశించొచ్చు’’
– మజార్ మొహమ్మద్, చీఫ్ స్ట్రాటజిస్ట్– చార్ట్‌వ్యూఇండియా.ఇన్
స్మాల్, మిడ్‌క్యాప్‌లో పాక్షికంగా లాభాల స్వీకరణ
మొత్తం సెక్టార్ లేదా సూచీ సంకేతాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా.. ఇన్వెస్టర్లు.. ఎంచుకున్న షేర్లనే కొనటం మంచిది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ర్యాలీని ఉపయోగించుకుని, వేల్యుయేషన్స్ ఎక్కువగా అనిపిస్తున్న వాటిల్లో పాక్షికంగానైనా లాభాలు స్వీకరించడం శ్రేయస్కరం. తద్వారా 2018 లేదా 2019లో మార్కెట్లు కరెక్షన్‌కి లోనైనా రిస్కులు తగ్గించుకోవచ్చు.
అగ్రి ,ఇన్‌ఫ్రా స్టాక్స్‌లో అవకాశాలు ..
రంగాలవారీగా చూస్తే.. అగ్రి సంబంధిత కంపెనీలు, ఇన్‌ఫ్రా, అఫోర్డబుల్ హౌసింగ్ నిర్మాణ సంస్థల షేర్లు మెరుగ్గా ఉంటాయని అంచనా. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాలోనూ అవకాశాలు ఉన్నాయి.. అయితే, ఈ రంగాల్లో ప్రత్యేకమైన ఉత్పత్తులు తయారు చేసే స్పెషలైజ్డ్ సంస్థల వృద్ధికి అవకాశాలు బాగా ఉండగలవు. ఫార్మా విషయానికొస్తే.. ఎక్కువగా దేశీ మార్కెట్ ప్రధానంగా కార్యకలాపాలు ఉన్న సంస్థలు మెరుగ్గా ఉండొచ్చు.
అమెరికా వడ్డీ రేట్లు, క్రూడాయిల్ రిస్కులు..
అంతర్జాతీయంగా చూస్తే.. క్రూడాయిల్ ధరలు గానీ ర్యాలీ జరిపిన పక్షంలో ఆ ప్రభావాలతో దేశీ మార్కెట్లు పెరిగే అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. ఇక, 2008 నాటి మాంద్యం అనంతరం అమెరికా, యూరప్ మొదలైనవి వడ్డీ రేట్లు భారీగా తగ్గించేసి, ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా వ్యవస్థకు ఊతమిచ్చే ప్రయత్నం చేశాయి. ఆ నిధులే భారత్ తదితర మార్కెట్లలోకి ప్రవహించాయి.
ప్రస్తుతం పరిస్థితులు సర్దుకుంటున్న దరిమిలా ఆయా దేశాలు క్రమంగా వడ్డీ రేట్లు పెంచడం మొదలుపెట్టాయి. అమెరికాలో పన్ను సంస్కరణలు అక్కడి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేవిగానే ఉన్నాయి. పరిస్థితుల రికవరీతో.. అమెరికా, యూరప్ మొదలైనవి గణనీయంగా వడ్డీ రేట్లు పెంచిన పక్షంలో ఈ పరిణామాలన్నీ మన మార్కెట్‌పై ప్రభావం చూపే రిస్కుంది.
దేశీ పెట్టుబడులతో క్షీణతకు అడ్డుకట్ట..
కొన్నాళ్లుగా మార్కెట్లలోకి మ్యూచువల్ ఫండ్స్ తదితర మార్గాల్లో దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. మార్కెట్ భారీగా క్షీణించకుండా ఇవి కొంత అడ్డుకట్ట వేస్తున్నాయి. 2018లోనూ ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది. ఇది పాజిటివ్ కోణం. అయితే, నెగటివ్ కోణం మరోటి కూడా ఉంది. మార్కెట్ బాగుంది కదాని కంపెనీలు పొలోమంటూ ఐపీవోలకి వచ్చేస్తున్నాయి. దీంతో సరఫరా భారీగా పెరిగిపోతుండటం వల్ల మార్కెట్ల పెరుగుదల ఒక స్థాయికి మాత్రమే పరిమితం అయిపోయే అవకాశాలూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment