ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ ఎంతగా పెరుగుతుందో దేశం మొత్తం చూస్తోంది. గత రెండేళ్లలో అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2020లో ఈవీ వెహికిల్స్ అదీ టూ వీలర్స్ అమ్మకాలు 1,00,736 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక 2021లో ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) విక్రయాలు దేశీయంగా 2,33,971 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే డబుల్ అయ్యిందన్నమాట. మరి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?.. ఈవీ మార్కెట్ అంచనా వేస్తున్నట్లు పదిహేనేళ్ల రికార్డు.. ఈ ఒక్క ఏడాదిలోనే బద్ధలు కానుందా?
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022)లో ఏకంగా 10 లక్షలకు యూనిట్ల మేర అమ్ముడు పోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అంటే గత 15 ఏళ్లలో అమ్ముడైన వాటికి ఇది సమానమన్నమాట. ఇది సాధమ్యేనా? అవుననే అంటోంది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సొసైటీ (ఎస్‌ఎంఈవీ). ఈ మేరకు పలు అంచనాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కొద్ది నెలలుగా ఈవీలకు మంచి రోజులు చూస్తున్నాం. గత 15 ఏళ్లలో మేము మొత్తం 10 లక్షల ఈ2డబ్ల్యూలు, ఈ–త్రీ వీలర్లు, ఈ–కార్లు, ఈ–బస్సులు విక్రయించాం. అయితే, 2022 జనవరితో మొదలుపెట్టి ఈ ఒక్క ఏడాదే దాదాపు అదే స్థాయిలో 10 లక్షల వాహనాలను విక్రయించే అవకాశాలు ఉన్నాయి‘ అని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెబుతున్నారు.
సానుకూలంగా ఈవీ విధానం..
ఎలక్ట్రిక్ వాహన విధానంలో ప్రభుత్వం ఇటీవల సానుకూల మార్పులు చేసిందని గిల్ పేర్కొన్నారు. ఖరీదైన ద్రవ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని పర్యావరణ అనుకూలమైన, స్వచ్ఛమైన రవాణా విధానాల అమలుకు కేంద్రం నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఆకర్షణీయమైన ధరలు, తక్కువ ఇంధన వ్యయాలు, చౌకగా నిర్వహణ తదితర అంశాల కారణంగా కస్టమర్లు పెద్ద సంఖ్యలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడం ప్రారంభమైందని గిల్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఎంచుకోవడంలో పర్యావరణపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. ఇటీవలి నెలవారీ ధోరణులు చూస్తుంటే .. గడిచిన పన్నెండు నెలలతో పోల్చి చూస్తే వచ్చే 12 నెలల్లో విక్రయాల వృద్ధి అయిదు నుంచి ఆరు రెట్లు అధికంగా ఉండొచ్చని గిల్ అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు–మూడేళ్లలో దేశీయంగా ఈ–స్కూటర్లు, ఈ–మోటర్‌సైకిళ్లు, ఈ–సైకిళ్లు వంటి అన్ని విభాగాల్లో.. పెద్ద కంపెనీల నుంచి కూడా ఉత్పత్తులు ఉండగలవని ఆయన తెలిపారు. ‘వచ్చే నాలుగైదు ఏళ్లలో ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో 30 శాతం దాకా వాటా ఎలక్ట్రిక్ వాహనాలది ఉంటుందని ధీమాగా చెప్పవచ్చు‘ అని గిల్ వివరించారు.
హై–స్పీడ్ వాహనాలకే ఓటు..
ఎస్‌ఎంఈవీ గణాంకాల ప్రకారం.. గంటకు 25 కి.మీ.కు మించిన వేగంతో నడిచే, పూర్తి స్థాయి లైసెన్సు అవసరమయ్యే హై–స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల (ఈ2డబ్ల్యూ) అమ్మకాలు 2021లో 425% వృద్ధితో 1,42,829 యూనిట్లకు చేరాయి. 2020లో వీటి సంఖ్య 27,206 యూనిట్లే. ఇక గంటకు 25 కి.మీ. కన్నా తక్కువ వేగంతో నడిచే, పూర్తి స్థాయి లైసెన్సు అవసరం ఉండని లో–స్పీడ్ ఈ2డబ్ల్యూల అమ్మకాలు కేవలం 24% వృద్ధి చెంది 73,529 యూనిట్ల నుంచి 91,142 యూనిట్లకు పెరిగాయి. వాస్తవానికి వీటి అమ్మకాలు 2021 ఆఖరు రెండు త్రైమాసికాల్లో గణనీయంగా తగ్గాయి.
జే సంగ్ టెక్‌తో ఒమెగా సైకి మొబిలిటీ జట్టు..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒమెగా సైకి మొబిలిటీ (ఓఎస్‌ఎం) తాజాగా కొరియాకు చెందిన విద్యుత్ వాహనాల పవర్‌ట్రెయిన్ దిగ్గజం జే సంగ్ టెక్‌తో చేతులు కలిపింది. భారత్‌లో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లు తయారు చేయనుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఇరు సంస్థలు ఓఎస్‌ఎం జే సంగ్ టెక్ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తాయి. స్థానిక అవసరాలకు తగినట్లుగా పవర్‌ట్రెయిన్‌లను తయారు చేయడంలో జే సంగ్ సాంకేతికతను, ఒమేగా తయారీ సామర్థ్యాలను ఈ సంస్థ వినియోగించుకుంటుంది. ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఓఎస్‌ఎంకి చెందిన కార్గో ఈ–త్రీ–వీలర్ రేజ్‌ప్లస్‌కు అవసరమయ్యే ఆర్‌ఏ314 పవర్‌ట్రెయిన్‌ను మొదటి ఉత్పత్తిగా జాయింట్ వెంచర్ సంస్థ ఆవిష్కరిస్తుంది. హరియా ణాలోని ఫరీదాబాద్ ప్లాంటులోనూ, పుణెలోని గ్రూప్ కంపెనీ ఒమేగా బ్రైట్ స్టీల్ అండ్ కాంపొనెట్స్ ప్లాంటులోను కొత్త ఆర్‌ఏ314ని ఓఎస్‌ఎం తయారు చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్‌ను దేశీ డ్రైవింగ్ పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించడం వల్ల చిన్న స్థాయి నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల కోసం కూడా ఆర్‌ఏ314లను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని ఓఎస్‌ఎం ఎండీ దేవ్ ముఖర్జీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment