Enumeration
-
కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. గాంధీ భవన్లో కుల గణనపై జరిగిన అవగాహన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించుకున్నామని రేవంత్ అన్నారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతకాంగ్రెస్ క్యాడర్, నేతలపై ఉంది. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని సూచిస్తున్నా. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలి. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.’’ అని రేవంత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్తగ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టేసింది. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారు.’’ అని రేవంత్ వివరించారు.పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు. రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
విజయవాడలో వరద నష్టం అంచనాపై గందరగోళ పరిస్థితులు
-
సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. -
కులగణన కోసం 14న సత్యాగ్రహం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెంటనే కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈనెల 14న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఓబీసీ సత్యాగ్రహ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి ఎన్.సాయికిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్, అభినేష్»ొమ్మ ప్రవీణ్ కుమార్ తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన చేసి రిజర్వేషన్స్‌పై ఉన్న 50 శాతం సీలింగ్ ఎత్తివేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఓబీసీ నేషనల్ ఫెలోషిప్లను 5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైకోర్టు చెప్పిన విధంగా మూడు నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని కులాల గణన చేయాలని కోరారు. -
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన గ్రామపంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రిజర్వేషన్ల ఖరారుకు కుల గణన ప్రాతిపదికగా తీసుకోవాలా.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సిద్ధం చేసిన తాజా ఓటర్ల జాబితాను లెక్కలోకి తీసుకోవాలా.. అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. కాగా ఈ నెలతో బీసీ కమిషన్ కాలపరిమితి ముగియనుండగా.. ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. కులగణనతో ఆలస్యం... కులగణన ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై లెక్కలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు చాలా రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తాజా ఓటర్ల జాబితాలు తీసుకుని మండలాలు, గ్రామస్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాపై అంచనాకు వచ్చి స్థానిక స్థాయిలోనే రిజర్వేషన్ల ఖరారు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఎదుట మార్గాంతరంగా ఉంది.ఈ ప్రక్రియను పంచాయతీరాజ్, ›గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడితే 2, 3 నెలల్లోగా ఓటర్ల జాబితాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్థారించేందుకు అవకాశముందని అటు బీసీ కమిషన్, ఇటు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతమే రిజర్వేషన్లు అందుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లను వారి జనాభాకు అనుగుణంగా 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీనిచి్చన విషయం తెలిసిందే. ఈ హామీ అమలుకు రాష్ట్ర బీసీ కమిష¯Œన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉంది.సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీ కమిష¯న్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏయే నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలో తేల్చాలని పేర్కొంది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని స్పష్టం చేయడంతో బీసీ కమిషన్ కసరత్తుకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ అమలు ఏ మేరకు సాధ్యమనే మీమాంస వ్యక్తమవుతోంది. సీఎం వచ్చాక స్పష్టత వస్తుందా? ఈ నెలాఖరుతో రాష్ట్ర బీసీ కమిష¯న్Œ చైర్మన్, సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం సెపె్టంబర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తే ఈ ఎన్నికలను సజావుగా సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 14 తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ల ప్రతినిధి బృందం యూఎస్, దక్షిణ కొరియాల పర్యటన నుంచి తిరిగి వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బీసీ కుల గణనకు కార్యాచరణ
నల్లగొండ/ నల్లగొండ రూరల్: బడుగు, బలహీనవర్గాలకు మేలు జరిగే విధంగా బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో కూడా విడుదల చేశామని, రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా ఎవరి వాటా ఎంత.. ఎవరి సంఖ్య ఎంత అనే విధంగా కార్యాచరణ చేపట్టే ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం నల్లగొండ పట్టణంలో సావిత్రిబాయి, జ్యోతిబాఫNలే విగ్రహాలను ఆవిష్కరించి అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. బీసీల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 80 కోట్లతో గురుకుల భవనాలు ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు బీసీ జన గణనకు కృషి చేయాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం.. ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా 21 శాతం డీఏ ఇచ్చామని, రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించామని చెప్పారు. నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ‘రాజధాని’ఏసీ బస్, నాలుగు డీలక్స్, ఒక పల్లె వెలుగు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడుపుతామని అన్నారు. నల్లగొండ బస్టాండ్‌లో బస్సులను ప్రారంభించిన అనంతరం మంత్రులు బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు. నల్లగొండలో 20 ఎకరాల్లో నూతన బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా.. త్వరలోనే బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పొన్నం హామీ ఇచ్చారు. -
సామాజిక విప్లవానికి నాంది కులగణన
గెలిచే అవకాశాలున్న పార్టీలో ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు అడగడానికీ, గెలిచిన పార్టీలో ఎన్నికల తరువాత ఎక్కువ పదవులు కోరడానికీ రాజకీయ నాయకులు కులం కార్డును వాడడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రతీ కులం తన జనాభా సంఖ్యనూ, శాతాన్ని పెంచి చెపుతుంటుంది. ఈ శాతాల న్నింటినీ కూడితే సులువుగా 300 దాటు తుంది! ఎన్నికల సంవత్సరంలో కులగణన చర్చ మరింత వేడెక్కుతోంది. సమాజంలో విభిన్న సమూహాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో వేల సంవత్సరాలుగా కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం మనది. ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. మన దేశంలో 5 వేలకు మించి కులాలున్నాయని అంచనా. కులాలతోనే మన దేశంలో సామాజిక అంతస్తుల దొంతర ఏర్పడుతోంది. వీటిని అర్థం చేసుకోవడానికి కులగణన ఒక చారిత్రక అవసరంగా మారింది. సామా జిక విప్లవానికి కులగణన నాంది పలుకుతుంది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలోనే విద్యా, ఉపాధి రిజర్వేషన్లు కల్పించారు. సామాజిక వివక్షకు గురవుతూ, విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్న సమూహాల కోసం ఉద్దీపన చర్యలు చేపట్టడంలో చాలా తాత్సారం జరిగింది. 1979 జనవరి 1న ప్రధాని మొరార్జీ దేశాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ‘సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్’ను నియమించారు. స్వల్ప కాలం బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్‌ను చైర్మన్‌గా నియమించడంతో దానికి ‘మండల్ కమిషన్’ అనే పేరు వచ్చింది. రెండేళ్ళ పరిశీలన తరువాత 1980 డిసెంబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బీపీ మండల్ తన నివేదికను సమ ర్పిస్తూ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారు. ఇక్కడ ఒక విచిత్రం వుంది. మండల్ కమిషన్ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇమ్మందిగానీ, కులగణన నిర్వహించమనలేదు. బ్రిటిష్ కాలపు రికార్డుల ప్రకారం దేశంలో బీసీల జనాభా 54 శాతం ఉంటుందని అంచనా వేసి అందులో 50 శాతం అనగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల కేసు మీద అంతిమ తీర్పు రాకముందే 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సుల్లో కొన్నింటిని అమలుపరచ బోతున్నట్టు ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. జనతాదళ్ నాయ కుడైన వీపీ సింగ్‌కు లోక్ సభలో మెజారిటీ లేదు. ఎన్టీ రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిగా రంగంలో దిగి, బయటి నుండి బీజేపీ ఇచ్చిన మద్దతుతో ఆయన ‘మైనారిటీ ప్రభుత్వానికి’ ప్రధాని అయ్యారు. అప్పట్లో బీజేపీకి లోక్ సభలో 85 సీట్లున్నాయి. ఓబీసీలకు రిజర్వే షన్లు కల్పిస్తే తన ఓటు బ్యాంకు అయిన ఓసీలు పార్టీకి దూరం అయి పోతారని ఆ పార్టీ భయపడింది. అప్పటి బీజేపీ అధ్యక్షులు ఎల్కే అడ్వాణి 1990 సెప్టెంబరు 25న సోమనాథ్ నుండి అయోధ్య వరకు 35 రోజుల ‘రామ్ రథయాత్ర’ మొదలెట్టారు. దీనికి రెండు లక్ష్యాలు న్నాయి. మొదటిది; మండల్ కమిషన్ సిఫార్సుల అమలును అడ్డుకోవ డానికి ఏకంగా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. రెండోది, ముస్లింల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకును సమీకరించడం. ఈ రెండు లక్ష్యాల రథయాత్రను రాజకీయ విశ్లేషకులు ‘మండల్–కమండల్’ అని పిలిచేవారు. బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు 7న వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. రెండేళ్ల తరువాత 1992 నవంబరు 16న ‘ఇంద్ర సహానీ కేసు’లో సుప్రీం కోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించ రాదనీ, క్రీమీలేయర్ కుటుంబాలను రిజర్వేషన్ పరిధి నుండి తప్పించా లనీ కొత్తగా రెండు నిబంధనలు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన పక్షం రోజుల్లోనే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. బ్రిటిష్ పాలకులు భారత దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సమాజ స్వభావాన్ని, ముఖ్యంగా కుల, మత స్వభావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని గుర్తించారు. 1881లో తొలి సారిగా జనగణన నిర్వహించారు. ఆ మరు సంవత్సరం అంటే 1882లో విలియం విల్సన్ హంటర్ నాయకత్వాన ఏర్పడిన కమిషన్ దేశంలో కులగణన నిర్వహించింది. అప్పటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి జనగణన కార్యక్రమం క్రమం తప్పకుండ సాగుతోంది. కానీ, కులగణన జరగలేదు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు దక్కుతుంది. దేశంలో అంతటి చొరవను చూపిన మరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. బిహార్‌లో 214 కులాలున్నట్టు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 7 వందలకు పైగా కులాలున్నట్టు అంచనా. ఆ లెక్కన ఏపీ కులగణన ప్రాజెక్టు బిహార్ కన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది. రెండేళ్ళ క్రితం బిహార్ రాష్ట్ర అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎస్సీ, ఎస్టీ మినహా మరెవ్వరికీ కులగణన నిర్వహించడం తమ విధానం కాదని 2021 జులై 20న పార్లమెంటులో ఒక విస్పష్ట ప్రకటన చేశారు. బీజేపీది ఒక విచిత్రమైన వ్యవహారం. ఒకవైపు, ఉచితాలు దేశఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అంటుంది; ఎన్నికల ప్రచారంలో తామర తంపరగా ఉచితాలను ప్రకటిస్తుంది. ఒకవైపు, కులం వంటి సంకుచిత భావాలకు తాము దూరం అంటుంది. ఎన్నికలకు ముందు కుల సమ్మేళ నాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన కుల సమ్మేళనాలను చూశాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ అలాంటివే చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ‘బీసీ సమ్మేళనం’లో పాల్గొన్నారు; నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చి ‘మాదిగ సమ్మేళనం’లో పాల్గొన్నారు. కానీ, విధాన పరంగా వారు కులగణనకు వ్యతిరేకం. నిజానికి సామాజిక న్యాయానికి కులగణన ఒక ప్రాతిపదిక అవుతుంది. సంక్షేమ పథకాలను అడగడానికి ప్రజలకూ, వాటిని రూపొందించడానికి ప్రభుత్వాలకూ అది ఆధారంగా మారుతుంది. ఇప్పుడు కుల గణన ‘ఇండియా కూటమి’కి కొత్త అస్త్రంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ప్రతి సభలోనూ ‘జిత్నీ ఆబాదీ; ఉత్నా హక్’, ‘జిస్కి జిత్ని భాగేదారీ; ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ’ (ఎంత జనాభో అంత హక్కు) అంటున్నారు. ఏపీలో తలపెట్టనున్న కులగణన విజయవంతం కావడం రాజకీయంగా వైసీపీ కన్నా సమాజానికి మరింత మేలు చేస్తుంది. - డానీ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
ఏనుగుల లెక్క తేలుద్దాం.. ఈ నెల 17వ తేదీ నుంచి...
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 3 రోజులపాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. మన రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తుండటంతో వాటి కోసం చాలాకాలం క్రితం కౌండిన్య అభయారణ్యాన్ని నెలకొల్పారు. శేషాచలం అడవులు, ఎస్వీ నేషనల్ పార్క్‌లోనూ ఏనుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సుమారు 175 ఏనుగులు ఉన్నట్టు అంచనా వేశారు. తాజా లెక్కింపు పూర్తయితే వాటి సంఖ్య పెరిగిందా.. తగ్గిందా అనేది తేలుతుంది. ఒకేసారి ఎందుకంటే..! ఏనుగులు నీటి లభ్యతను బట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అవి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రవేశించి అటూఇటూ తిరుగుతూ ఉంటాయి. దీంతో రాష్ట్రాల వారీగా లెక్కింపు చేపట్టినప్పుడు రెండుచోట్లా వాటిని లెక్కించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో ఒకేసారి లెక్కింపు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతంలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో లెక్కింపు జరపనున్నారు. లెక్క.. పక్కా..! ఇందుకోసం కర్ణాటక అటవీ శాఖ రూపొందించిన మోడల్‌ను అనుసరిస్తున్నారు. అక్కడ ఏనుగుల సంఖ్య వేలల్లో ఉండటంతో చాలా జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధానంలో మన రాష్ట్రంలో లెక్కింపు నిర్వహించడానికి అటవీ శాఖ సిద్ధమైంది. మొదటి రోజు 17వ తేదీన అటవీ ప్రాంతంలోని బ్లాకుల పరిధిలో బీట్ల వారీగా 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15 కిలోమీటర్లు తిరిగి లెక్కింపు జరపనున్నారు. ఇందుకోసం బీట్ల వారీగా ఇద్దరు, ముగ్గురితో బృందాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు నిర్దేశించిన రెండు కిలోమీటర్ల ప్రాంతంలో తిరిగి ఏనుగుల గుంపులను బట్టి లెక్కింపు జరుపుతారు. మూడవరోజు చెరువులు, మైదానాల్లో నేరుగా ఏనుగుల గుంపుల వద్దకెళ్లి వాటి ఫొటోలు తీసి లెక్కిస్తారు. గుంపులో పెద్దవైన ఆడ, మగ ఏనుగులు.. ఆ తర్వాత పెద్దవైన మగ, ఆడ ఏనుగులు.. పిల్లలు, దంతాలు లేని ఏనుగులు (మఖనా), గుంపు నుంచి వేరుపడిన ఒంటరి ఏనుగులుగా వాటిని వర్గీకరించి లెక్కింపు చేపట్టనున్నారు. ప్రణాళికాబద్ధంగా లెక్కింపు దక్షిణాది రాష్ట్రాలతో కలిసి ఒకేసారి ఏనుగుల లెక్కింపును ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేశాం. మూడు విధాలుగా లెక్కింపు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. – శాంతిప్రియ పాండే, ఏపీ సీసీఎఫ్ (వైల్డ్ లైఫ్), ఏపీ అటవీ శాఖ -
అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
తాడేపల్లి: అకాల వర్షాలపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్ ప్రారంభించాలని సూచించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. నివేదికల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కాగా, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని తెలిపారు. చదవండి: భారీ వర్షాలు.. పిడుగులు -
ఆధార్ అదరహో..!
జిల్లాలో 94 శాతం మందికి ఆధార్ నంబర్లు పూర్తయిన ఆధార్-జనాభా అనుసంధానం ఎన్యుమరేషన్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమం విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో 94 శాతం మందికి ఆధార్ ఉన్నట్లు జనగణన అధికారులు ధ్రుృవీకరించారు. కొద్దినెలల కిందట జిల్లాలో జనగణన-ఆధార్ అనుసంధానం కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 34 మండలాల్లో 5,680 నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ బుక్ లెట్లతో జనాభా గణనను ఆధార్‌తో సరిపోల్చారు. ఇంటింటికీ తిరిగి సర్వే చేశారు. ఆధార్ అనుసంధానం చేస్తూ లేని వారి నుంచి ఆధార్ నంబర్లను తీసుకుని వివరాలు నమోదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకూ ఈ గణన చేపట్టారు. ఈ వివరాలన్నింటినీ జాతీయ జనాభా గణన వెబ్సైట్లో పొందుపరిచారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకూ గణన అధికారులు వివరాలన్నింటినీ అప్లోడ్ చేశారు. మొత్తం 4,248 మంది ఎన్యూమరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు వారిని మినహాయించి గణన చేపట్టారు. మొత్తం 22,26,475 మందిని ఆధార్‌తో సరిపోల్చారు. వీరిలో 94 శాతం మంది(20,94,106 మంది)కి ఆధార్ అనుసంధానం జరిగినట్టు గుర్తించారు. ఆధార్ లేకుండా కేవలం ఈఐడీ నెంబర్లతో 0.42 శాతం మంది ఉన్నారు. వీరికి ఆధార్ నంబర్లు ఇంకా రాలేదు. ఇటువంటి వారు జిల్లాలో 9,253 మంది ఉన్నారు. ఆధార్ లేకుండా 54,476 మంది ఉన్నట్టు జనాభా గణన ఎన్యుమరేటర్లు గుర్తించారు. వలసలు, ఇతర కారణాలతో 68,640 మంది అందుబాటులో లేకపోవడంతో ఆధార్‌ను అనుసంధానించలేకపోయారు. వీరికి జిల్లాలో ఆధార్ ఉందా లేక ఇతర ప్రాంతాల్లో ఉందానన్న విషయం తెలియలేదు. రాష్ట్రంలోనే జిల్లా ప్రథమం.. ఆధార్‌తో జనాభా గణనను అనుసంధానించే కార్యక్రమంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 13 జిల్లాల్లోనూ గత ఏడాది అక్టోబర్ 23 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అయితే చాలా జిల్లాల్లో జనగణనకు సంబంధించిన సామగ్రి లేకపోవడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. డిసెంబర్ 31 నాటికి ఆధార్ అనుసంధానం పూర్తయ్యే అవకాశం లేదని భావించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని మరికొద్ది నెలలు పొడిగించారు. విజయనగరం జిల్లాలో మాత్రం నిర్ణీత సమయానికే ఆధార్‌తో జనాభా గణను పూర్తి చే శారు. వివరాలను ఎన్పీఆర్ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. -
తీర గ్రామాల్లో ఎన్యుమరేషన్ చిచ్చు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మత్స్యశాఖ చేపట్టిన ఎన్యుమరేషన్ గ్రామాల్లో చిచ్చు రేపుతోంది. హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల ఎన్యుమరేషన్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో విభేదాలు పొడచూపుతున్నాయి. బోట్లే లేని వారి బోట్లు పోయాయని ఎలా చూపిస్తారని ఒక వర్గం వాదిస్తుంటే, మా పేర్లు చేర్చితే మీకేంటి నష్టమంటూ మరో వర్గం ప్రతివాదనకు దిగుతోంది. అనర్హులను జాబితాల్లో చేర్చడంతో మత్స్యశాఖ అధికారులపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికంతటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. హుద్‌హుద్ తుపాను బీభత్సానికి భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా బోట్లు, వలలు కొట్టుకుపోవడమే కాకుండా మరికొన్ని బాగా దెబ్బతిన్నాయి. తుపాను తీరందాటిన అనంతరం ఎన్యుమరేషన్ చేపట్టగా 375 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ మేరకు బాధితుల జాబితా తయారు చేశారు. ఒక్కొక్క బోటుపై ఆధారపడ్డ ఐదుగురు కలాసీలకు, సదరు బోటు యాజమానికి చెరో రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అవకాశంగా తీసుకుని అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని అధికారులపై ఒత్తిళ్లు చేసి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావల్సిన వారందరికీ పరిహారం వచ్చేలా జాబితాలు తయారు చేయించారన్న విమర్శలున్నాయి. ఈ విషయమై గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. నష్టం జరిగిన వారి పేర్లతో పాటు ఎటువంటి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చడంపై గ్రామాల్లో అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. గ్రామాల వారీగా తయారు చేసిన జాబితాలను చూసి కొంతమందైతే అవాక్కైపోతున్నారు. అసలు బోట్లే లేని వారిని ఎలా చూపించారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నష్టం జరిగినవారికి, నష్టం జరగనివారికి తేడా ఏంటని?, ఇదేం పద్ధతి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అనర్హులను సైతం చేర్చాలనుకుంటే మిగతా వారిని కూడా కలపాలంటూ వాదనకు దిగుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో రూలా? అంటూ వాదులాడుకుంటున్నారు. మొత్తానికి గ్రామాల్లో ఇదొక చిచ్చులా తయారైంది. ఇదే విషయమై వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు నేతృత్వంలో మత్స్యకార సంఘ నాయకులు బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాయుడు తదితరులు సోమవారం మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్‌ను కలిసి నిలదీశారు. నష్టాల జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయని, నష్టం జరగని వారి పేర్లును జాబితాల్లో చేర్చారని, టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జాబితాలు తయారు చేశారని బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాముడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిలదీస్తామనే ఉద్దేశంతోనే జన్మభూమి సమావేశాలకు మత్స్యశాఖ అధికారులు హాజరు కాలేదని, మత్స్యశాఖ కార్యాలయంలోనే ఈ అవకతవకలు జరిగాయని ఏడీ ఎదుటే ఆరోపించారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అటు మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్, ఇటు మత్స్యకార సంఘం నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లోకి వచ్చి పరిశీలించి, విచారణ జరిపితే వాస్తవాలు బయటికొస్తాయని, అసలైన అర్హులకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు. -
హుద్‌హుద్, తుపానుకు నెల
-
విలయానికి... నెల
* ఇంకా కళ్లముందే కనిపిస్తున్న బీభత్సం * సాగుతున్న ఎన్యుమరేషన్ * నష్టాల బేరీజులో అధికారులు * నేటికి రూ.2వేల కోట్లు దాటిన నష్టం సాక్షి ప్రతినిధి, విజయనగరం: సరిగ్గా ముప్పై రోజుల కిందట రాకాసి గాలి సుడులు తిరుగుతూ జి ల్లాను వణికించేసింది. నేటికి నెలనాళ్లవుతున్నా ఆ విలయం ఆనవాళ్లు ఇంకా మాయలేదు. అధికారు ల అంచనాలు కూడా ఇంకా సా...గుతూనే ఉ న్నా యి. ఇప్పటికే రూ.2వేల కోట్ల మేర నష్టం జరిగినట్టు తేలింది. ఇంకెంత తేలనుందో తెలి యని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి విపత్తు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టం సంభవించింది. ఈ నష్టం అధికార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తుపాను గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న జిల్లా ప్రజలకు అది మిగిల్చిన నష్టాన్ని చూసి బెంబెలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. పునరుద్ధరణ పనులు ఇంకా సాగుతున్నాయి. పడిపోయిన చెట్లు, కూలి పోయిన ఇళ్లు ఎక్కడికక్కడ అలానే ఉన్నాయి. ఉద్యానవన తోటలైతే దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. తుపాను వెలిశాక నిత్యావసర సరుకులిచ్చి చేతులు దులుపుకున్న సర్కార్ పునరుద్ధరణ, పరి హారానికి సంబంధించి ఇంతవరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఒకవైపు నష్టం అంచనాలకు అందని విధంగా ఉంది. అంతకంతకు పెరిగిపోతోంది. నెలరోజులగా ఎన్యుమరేషన్ చేస్తున్నా కొ లిక్కి రావడం లేదు. ఇదొక ప్రహసనంలా సాగిపోతోంది. ఇదెప్పటికి పూర్తవుతుందో? పునరుద్ధరణ జరిగేదెప్పుడో? పరిహారం వచ్చేదెప్పుడో? ప్రజ ల నష్టం తీరెదెప్పుడో తెలియని దుస్థితి నెల కొంది. ఇప్పటివరకైతే సుమారు రూ.2వేల కోట్ల నష్టం తేలింది. ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఎన్యుమరేషన్ అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి హుద్‌హుద్ బీభత్సం ఎంత మేర సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ నష్టాల వివరాలివి. ఊవ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే 5,923.5హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతినగా 83.38 కోట్లు మేర నష్టం సంభవించింది. * 42,348హెక్టార్లలో ఉద్యానవన పంటలు నాశనమవ్వగా 21.23కోట్ల మేర నష్టం వాటిల్లింది. * పట్టు పరిశ్రమకు 11.90లక్షల నష్టం జరిగింది. * 15,991ఇళ్లు దెబ్బతినగా 8.70కోట్లు నష్టం ఏర్పడింది. * 23.96కోట్ల విలువైన జీవాలు చనిపోయాయి. * 77.69కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. * 11.44కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. * 22.01కోట్ల మేర ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లింది. * ఆర్అండ్బీ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 194.73కోట్ల నష్టం సంభవించింది. * పరిశ్రమలకు రూ.874కోట్లు నష్టం జరిగింది. * ఐటీడీఏ పరిధిలో రూ.3.69కోట్ల నష్టం ఏర్పడింది. * పంచాయతీరాజ్ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 183కోట్ల నష్టం వాటిల్లింది. * పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖకు 23. 99కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మున్సిపాలిటీల పరిధిలో 279.33కోట్ల మేర నష్టం జరిగింది. * చిన్న నీటిపారుదల శాఖకు 40.32కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. * గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగానికి 6.05కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మత్స్యశాఖ పరిధిలోకి వచ్చే వాటికి 28.37కోట్ల నష్టం ఏర్పడింది. * వైద్య ఆరోగ్య శాఖకు 29.62కోట్లు నష్టం జరిగింది. * ట్రాన్స్‌కోకు 41.48కోట్ల నష్టం సంభవించింది.