తీర గ్రామాల్లో ఎన్యుమరేషన్ చిచ్చు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మత్స్యశాఖ చేపట్టిన ఎన్యుమరేషన్ గ్రామాల్లో చిచ్చు రేపుతోంది. హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల ఎన్యుమరేషన్‌లో అవకతవకలు చోటుచేసుకోవడంతో విభేదాలు పొడచూపుతున్నాయి. బోట్లే లేని వారి బోట్లు పోయాయని ఎలా చూపిస్తారని ఒక వర్గం వాదిస్తుంటే, మా పేర్లు చేర్చితే మీకేంటి నష్టమంటూ మరో వర్గం ప్రతివాదనకు దిగుతోంది. అనర్హులను జాబితాల్లో చేర్చడంతో మత్స్యశాఖ అధికారులపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికంతటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. హుద్‌హుద్ తుపాను బీభత్సానికి భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా బోట్లు, వలలు కొట్టుకుపోవడమే కాకుండా మరికొన్ని బాగా దెబ్బతిన్నాయి. తుపాను తీరందాటిన అనంతరం ఎన్యుమరేషన్ చేపట్టగా 375 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ మేరకు బాధితుల జాబితా తయారు చేశారు.
ఒక్కొక్క బోటుపై ఆధారపడ్డ ఐదుగురు కలాసీలకు, సదరు బోటు యాజమానికి చెరో రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అవకాశంగా తీసుకుని అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని అధికారులపై ఒత్తిళ్లు చేసి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావల్సిన వారందరికీ పరిహారం వచ్చేలా జాబితాలు తయారు చేయించారన్న విమర్శలున్నాయి. ఈ విషయమై గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. నష్టం జరిగిన వారి పేర్లతో పాటు ఎటువంటి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చడంపై గ్రామాల్లో అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. గ్రామాల వారీగా తయారు చేసిన జాబితాలను చూసి కొంతమందైతే అవాక్కైపోతున్నారు. అసలు బోట్లే లేని వారిని ఎలా చూపించారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నష్టం జరిగినవారికి, నష్టం జరగనివారికి తేడా ఏంటని?, ఇదేం పద్ధతి? అని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ అనర్హులను సైతం చేర్చాలనుకుంటే మిగతా వారిని కూడా కలపాలంటూ వాదనకు దిగుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో రూలా? అంటూ వాదులాడుకుంటున్నారు. మొత్తానికి గ్రామాల్లో ఇదొక చిచ్చులా తయారైంది. ఇదే విషయమై వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు నేతృత్వంలో మత్స్యకార సంఘ నాయకులు బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాయుడు తదితరులు సోమవారం మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్‌ను కలిసి నిలదీశారు. నష్టాల జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయని, నష్టం జరగని వారి పేర్లును జాబితాల్లో చేర్చారని, టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జాబితాలు తయారు చేశారని బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాముడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నిలదీస్తామనే ఉద్దేశంతోనే జన్మభూమి సమావేశాలకు మత్స్యశాఖ అధికారులు హాజరు కాలేదని, మత్స్యశాఖ కార్యాలయంలోనే ఈ అవకతవకలు జరిగాయని ఏడీ ఎదుటే ఆరోపించారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అటు మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్, ఇటు మత్స్యకార సంఘం నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లోకి వచ్చి పరిశీలించి, విచారణ జరిపితే వాస్తవాలు బయటికొస్తాయని, అసలైన అర్హులకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు.