Hudhud Storm
-
టాపు లేచిపోతోంది!
సాక్షి,ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : బీచ్‌రోడ్డులోని రాజీవ్ స్మృతి వనం పైకప్పు రేకులు ఎగిరిపోతున్నాయి. హుద్‌హుద్ సమయంలో ఈ భవనం పూర్తిస్థాయిలో దెబ్బతింది. అనంతరం దీనికి మరమ్మత్తులు చేశారు. అయితే కథ మొదటికొచ్చింది. భవనంపైన బిగించిన రేకులు ఊడిపోతున్నాయి. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు పైన ఉన్న రేకులు ఎగురుతూ దర్శనమిచ్చాయి. ఇవి అటుగా వెళ్లేవారిపై పడితే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. -
హామీకి పాతరేశారు!
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో 192 కిలో మీటర్లు విస్తరించిన ఉన్న తీర ప్రాంతంలో వందల సంఖ్యలో గ్రామాలున్నాయి. అన్ని ఊర్లకు విద్యుద్ధీకరణ పూర్తయినప్పటికీ వర్షాకాలంలో వంద రోజులకు పైగా చీకట్లోకి వెళ్లిపోతుంటాయి. ఏటా ఇదే పరిస్థితి. తుపాన్ల సమయంలో వీచే పెనుగాలులో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమై.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. హుద్‌హుద్ తుపాను సమయంలో ఇదే జరిగింది. భీకర గాలులకు వేలాది స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లా మొత్తం అంధకారంలోకి వెళ్లింది. రోజుల తరబడి కరెంటు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇలాంటి సమయంలో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు భూగర్భంలో విద్యుత్ కేబుల్ అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పనులకు సర్వే జరిపించి రూ.234 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అరుుతే ఇప్పటి వరకూ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. తరచూ విద్యుత్ కష్టాలు హుద్‌హుద్ తుపాను తరువాత కూడా చిన్నచిన్న తుపాన్లు జిల్లాను తాకాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఉన్న తీర ప్రాంత మండలాలైన ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం ప్రాంతాల్లో ప్రకృతి వైఫరీత్యాల వల్ల తరచూ విద్యుత్ సరఫరా నిలిచి పోతోంది. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కావాలంటే.. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కావాలంటే ఒక్కో మండలం పరిధిలో 33 కేవీ విద్యుత్ లైన్లు 15 కిలోమీటర్లు, 11 కేవీ విద్యుత్ లైన్ 15 కిలోమీటర్లు వంతున అవసరం. అలాగే 50 కిలోవాట్స్ యాంప్సు కెపాసిటీ ఉన్న 46 విద్యుత్ ట్రాన్సుఫార్మర్లు, 315 కిలోవాట్స్ యాంప్సు కెపాసిటీ ఉన్న ట్రాన్సుఫార్మర్లు 68 అవసరమవుతాయని అంచనా. అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థను 13 తీరప్రాంత సబ్స్టేషన్లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇదే విషయూన్ని ట్రాన్స్‌కో అధికారులు తమ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. కాల్వల తవ్వకానికి నిధులు అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంతోపాటు శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపించాం తుపాన్ల కారణంగా తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. భారీగా నష్టాలు వస్తున్నాయి. దీన్ని నివారించడానికి, పెద్దెత్తున మార్పులు చేయడానికి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. దీంతో క్షేత్రస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. రూ.234 కోట్లుతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ప్రపంచబ్యాంకు నిధులతో ఈ ఆధునికీకరణ చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నిధులు విడుదలైతే చర్యలు మొదలు పెడతాం. - శరత్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్ఈ -
అంధకార తాండవం
►హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు ►నేటికీ పునరుద్ధరించని వైనం జలాశయ నీటి విడుదలకు ►జనరేటరే దిక్కు విధుల నిర్వహణలో అవస్థలు పడుతున్న సిబ్బంది విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రాంతంలో హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు నేటికీ పునరుద్ధరించకపోవడం వల్ల రాత్రి వేళల్లో అంధకారం నెలకొంది. నాతవరం : జిల్లాలో ఏకైక మేజర్ ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను నేటికీ పునరుద్ధరించకపోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. హుద్‌హుద్ తుపాను సమయంలో గాలులకు తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లన్నీ ధ్వంసమయ్యాయి. అప్పటినుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందవి జనరేటర్‌పై ఆధారపడాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరా లేకుంటే.. తాండవ జలాశయం నీటికి ఆయకట్టుకు విడుదల చేయాలంటే గేట్లు ఎత్తేందుకు విద్యుత్ అవసరం. ప్రమాదస్థాయికి నీటిమట్టం చేరినప్పుడు స్పిల్‌వే దగ్గర గేట్లు ఎత్తి తాండవ నదిలోకి నీటిని విడుదల చేస్తుంటారు. ఇందుకు తప్పనిసరిగా విద్యుత్ అవసరం. హుద్‌హుద్ తరువాత తాండవ జలాశయం నిండిన పరిస్థితులు లేవు. ఈ కారణంగా విద్యుత్ ఉన్నా లేకపోయినా పెద్దగా సమస్య తలెత్తలేదు. అత్యవసర అయినప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో జనరేటరే దిక్కవుతోంది. చీకట్లో డ్యామ్! తాండవ జలాశయం డ్యామ్‌పై లైట్లు వెలగకపోవడం వల్ల అంధకారం నెలకొంది. రాత్రివేళల్లో జలాశయ ప్రాంతం చీకటిమయంగా మారడంతో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో డ్యామ్ దగ్గర నుంచి స్పిల్‌వే గేట్ల వరకు పరిస్థితిని ఎప్పడికప్పుడు సిబ్బంది పరిశీలించాలి. చుట్టూ దట్టమైన అటవీప్రాంతం, ఎటుచూసినా అంధకారం నెలకొనడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అడవి జంతువులతో సమస్య నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాల అటవీప్రాంతం మధ్య తాండవ జలాశయం విస్తరించి ఉంది. వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి జంతువులు జలాశయం వద్దకు వస్తుంటాయి. జలాశయాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అవి సేదతీరుతుంటాయి. వీటివల్ల సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా లేక ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి. నిధులు సిద్ధం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.18 లక్షలు విడుదల చేసింది. వీటిని విద్యుత్ శాఖకు చెల్లించాం. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ ప్రారంభించారు. త్వరలోనే విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుంది. - చిన్నారావు, తాండవ జేఈ -
సీఎం పర్యటన మూడో సారీ...
మళ్లీ రద్దుతో గిరిజనుల్లో నిరుత్సాహం అరకులోయ: సీఎం చంద్రబాబునాయుడు అరకులోయ పర్యటన మూడోసారి కూడా రద్దయింది. గతేడాది హుద్‌హుద్ తుపానుకు మండలంలోని మాదల పంచాయతీ మెదర్సోలా గ్రామంలో కొండచరియలు విరిగిపడిన సంఘటనలో ఐదుగురు ఆదిమజాతి గిరిజనులు దుర్మరణం పాలయ్యారు. ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం వస్తారని ఏర్పాట్లు చేసిన అధికారులు, పర్యటన రద్దయినట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. జన్మభూమిలో పాల్గొంటారని... అరకులోయ మండలంలో సీఎం దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. హుటాహుటిన రహదారిని మెరుగుపరిచారు. పంచాయతీలో పెండింగ్ పనులను పూర్తిచేశారు. ఐటీడీఏ పీవో, ఇతర శాఖ అధికారులు సమస్యలను గుర్తించారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో బహిరంగ సభకు సుమారు 10 వేల మందికి సరిపడే వేదికను సిద్ధం చేశారు. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దుతో గిరిజనులు నిరాశకు గురయ్యారు. మళ్లీ రద్దు.. అరకులోయలో సోమవారం సీఎం చంద్రబాబునాయుడు పర్యటిస్తారని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పెదలబుడులో రచ్చబండలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో కాఫీ పైలాన్ నిర్మాణం, ఎన్టీఆర్ క్రీడా మైదానంలో సుమారు 20వేల మందికి సరిపడే సభా వేదిక సిద్ధం చేశారు. ఈసారి తప్పనిసరిగా చంద్రబాబు అరకు వస్తారని అధికారులు భావించారు. సీఎం పర్యటన రద్దయిందని చివరి నిమిషంలో కలెక్టర్ యువరాజ్ ప్రకటించారు. పర్యటన రద్దుపై భిన్న కథనాలు అరకులోయలో సీఎం పర్యటన తరచూ రద్దవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అరకులోయ వస్తే పదవి కోల్పోతారన్న సెంటిమెంట్కూడా ఆయన పర్యటన రద్దుకు కారణమని ప్రచారం జరుగుతోంది. బాక్సైట్ ఉద్యమం, మావోయిస్టుల ప్రభావం కూడా కారణం కావొచ్చని అంటున్నారు. -
భారీ విపత్తు... సాయం వీసమెత్తు!
ఎప్పుడూ రాని కష్టం వచ్చింది... ఎన్నో కుటుంబాలు చివురుటాకుల్లా వణికిపోయాయి... ఎంద రికో గూడులేకుండా పోయింది...రైతుల కష్టం నీళ్లపాలయింది... ఒకరేమిటి జిల్లాలో దాదాపు అన్ని వర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు... ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి...ఇది హుద్‌హుద్ తుపాను రేపిన గాయం. అయితే హుద్‌హుద్ కన్నా ఘోరంగా నేతలు వ్యవహరించారు. తుపాను వచ్చిన వెంటనే జిల్లాలో పర్యటించి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీలు గుప్పించారు. కొద్దిపాటి మొత్తాన్ని విడుదల చేశారు. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో జిల్లా వాసులు కష్టాలతో కాపురం చేయవలసి వస్తోంది. ప్రకృతి బీభత్సం సృష్టించి ఎనిమిది నెలలు దాటింది , ఇప్పటికీ తుపాను ఆనవాళ్లు చెరిగిపోలేదు. జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీధిదీపాలు కూడా వెలగని దుస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుద్‌హుద్ సృష్టించిన బీభత్సం జిల్లా ప్రజల కళ్లముందు ఇంకా కదలాడుతునే ఉంది. ఎనిమిది నెలలు కావస్తున్నా అది చేసిన గాయం మాత్రం మానలేదు. బాధితుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. హుద్‌హుద్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రితో పాటు జిల్లాకొచ్చిన మంత్రులంతా ఊదరగొట్టారు. కానీ ఆ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. జిల్లాలో రైతులకు రూ.210 కోట్ల మేర నష్టం వాటిల్లగా కేవలం రూ.37కోట్లు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. జిల్లా వ్యాప్తంగా 15,189 ఇళ్లు కూలిపోగా, ఇంతవరకు ఒక్క బాధితుడికి కూడా కొత్తగా ఇల్లు మంజూరు చేయలేదు. మిగతా నష్టాలపైనా ఇదే తరహాలో ప్రభుత్వ స్పందన ఉంది. ఇదంతా పక్కన పెడితే హుద్‌హుద్ దెబ్బకు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పాడైన వీధి లైట్లకు పలుచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసి మమ అనిపించారు. కానీ అవి వెలుగేదెప్పుడో, ఆరిపోయేదెప్పుడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో పరిస్థితి మరింత దయనీయం. పట్టణంలోని అత్యధిక ప్రాంతాలు నేటికీ అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఎల్ఈడీ లైట్లును ఏర్పాటు చేస్తామంటూ పాడైన లైట్లును గాలికొదిలేశారు. విజయనగరం మున్సిపాల్టీలో 10,500 వీధి లైట్లు ఉండగా హుద్‌హుద్‌కు దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి. తుఫాన్ తరువాత జిల్లాకొచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణ సీరియస్‌గా స్పందిస్తూ 15 రోజుల్లోగా వీధి లైట్లును పునరుద్ధరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కానీ ఆ దిశగా పునరుద్ధరణ పనులు జరగలేదు. ఇప్పటికైతే మరమ్మతులు చేపట్టి 2500పాత లైట్లును, కొత్తగా మరో 1500ఎల్ఈడీ లైట్లును ఏర్పాటు చేశారు. దాదాపు 6500 వీధిలైట్లు వెలగడంలేదు. దీంతో పట్టణంలోని అత్యధిక ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ఇదే అవకాశంగా దొంగలు చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకూ దాదాపు 150 దొంగతనాలు జరిగాయి. ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడమే కాకుండా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు మున్సిపల్ పాలకులు గాని, ఇటు ప్రభుత్వ పెద్దలు గాని పట్టించుకోవడం లేదు. సాలూరు మున్సిపాల్టీలో 500లైట్లు, బొబ్బిలి మున్సిపాల్టీలో 100, పార్వతీపురం మున్సిపాల్టీలో 500లైట్లు హుద్‌హుద్ బీభత్సానికి దెబ్బతిన్నాయి. వాటికి తాత్కాలికంగా మరమ్మతు చేశారు. అయితే అవి ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు వెలగవో చెప్పలేని పరిస్థితి. అన్ని మున్సిపాల్టీల్లో ఎల్ఈడీ వెలుగులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా నేటికీ అది నెరవేరలేదు. -
పిట్టలు రాలుతున్నాయ్..!
ఎండల తీవ్రతను తట్టుకోలేక పక్షుల మృతి {బీడింగ్, నెస్టింగ్ సీజన్ విహంగాలకు కష్టకాలం ఆహారం, నీరు దొరక్క వందల మైళ్లు వలసలు టపటపా రాలిపోతున్న గుడ్లగూబలు, కబోది పక్షులు విజయవాడ బ్యూరో: ఎండల తీవ్రత పక్షి జాతికి పెనుముప్పుగా మారుతోంది. వేసవి ధాటికి తట్టుకోలేక వివిధ రకాల పక్షులు నేల రాలుతున్నాయి. సరైన ఆవాసం, ఆహారం, నీరు లభించక వందల కిలోమీటర్లు వలస పోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోలేక గుడ్లగూబలు, కబోది పక్షులు, నైట్‌హెరాన్స్, నైట్‌జార్స్ పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణంగా పక్షులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కంటే మించితే వీటికి ప్రాణగండం పొంచి ఉన్నట్లే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో పగలు 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో కాకులు, పిచ్చుకలు, గోరింకలు, పావురాళ్లు, గద్దలు, కొంగలతో పాటు సైబీరియా, నార్త్, సెంట్రల్ ఆసియా ప్రాంతాల నుంచి వలస వచ్చే రెడ్‌శాంక్స్, వార్‌బర్డ్స్, పికెట్స్, పెలికాన్స్ వంటి జాతులు విలవిలలాడుతున్నాయి. ఉత్తరాంధ్రలో పరిస్థితి తీవ్రం... హుద్‌హుద్ తుపాను కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పచ్చదనం మొత్తం హరించుకుపోయింది. దీంతో వేసవిలో గూడు (నెస్టింగ్) కోసం పక్షులకు కష్టకాలం వచ్చింది. కంబాలకొండ వైల్డ్‌లైఫ్ శాంచురీ మొత్తం తుపాను తీవ్రత కారణంగా దెబ్బతింది. దీంతో ఏటా ఇక్కడికొచ్చే పక్షులు ఈసారి లేకుండా పోయాయి. పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు, గుంటూరు జిల్లా ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా పులికాట్ ప్రాంతాల్లోనూ ఎండల వల్ల పక్షుల సంఖ్య తగ్గిందని పరిశోధకులు చెబుతున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో జెముడు కాకులు, రామచిలుకలు, గద్దలు, గోల్డెన్ ఓరియోల్, బ్రామినీకైట్స్, అలెగ్జాండర్ పెరాకైట్స్ వంటివన్నీ పిల్లలను కనే దశలో ఉంటాయి. ఎండల కారణంగా వాటి గుడ్లు ముందుగానే చితికిపోయి కొత్తతరం ఆగిపోతోంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో మసలే కాకులు, పిచ్చుకలు, గోరింకలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
శత కోటి సంబరం
వ్యాపారుల్లో సం‘క్రాంతులు’ జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల అమ్మకాలు సామాన్యుల నుంచి ధనికుల వరకు ఒకటే జోష్ సంక్రాంతి పండుగ వ్యాపారులకు కాసుల వర్షం కురిపించింది. అమ్మకాలు తారస్థాయికి చేరాయి. ప్రత్యేక ఆఫర్లు, బంపర్ డ్రాలు ప్రకటించడంతో నగరవాసులు ఉత్సాహంగా కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సంక్రాంతికి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాక్షి, విశాఖపట్నం : తెలుగువారి పెద్దపండుగగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగతో మహానగరం బోసిపోతుంటే..పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. పరసలు, సంబరాలతో పల్లెలన్నీ సందడిగా ఉన్నాయి. ఇక పర్యాటక ప్రాంతాలు, సినిమా థియేటర్లు కిటికిటలాడుతున్నాయి. హుద్‌హుద్ తుపానుతో మూడునెలలు గా సరైన వ్యాపారం లేక వెలవెలబోయిన నగరంలోని షాపింగ్‌మాల్స్ పండుగ పుణ్యమాని పుంజుకున్నాయి. సంక్రాంతి నాడు కోట్లల్లోనే వ్యాపారం జరగడంతో వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారు. అందరిలోనూ ఒకటే జోష్ :జిల్లాలో సుమారు 13 లక్షల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల పరిధిలో 40 లక్షలకు పైగా జనాభా ఉంది. మొత్తం కుటుంబాల్లో 8 లక్షల నుంచి 10లక్షల కుటుంబాల వరకు హిందూవులుంటారని అంచనా. వీరిలో సుమారు ఐదు లక్షల కుటుం బాలు నిరుపేద, సామాన్య వర్గాలకు చెందిన వారు కాగా, రెండున్నరలక్షల కుటుంబాల వరకు మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు, లక్షన్నర కుటుంబాల వరకు ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, మరో లక్షన్నర కుటుంబాలు ఉన్నత, ధనిక వర్గాలకు చెందిన వారుంటారని అంచనా. మిగిలిన పండుగ వేళల్లో ఎలా ఉన్నా సంక్రాంతి పండుగ కోసం మాత్రం అన్ని వర్గాల వారు భారీగానే ఖర్చు చేస్తుంటారు. బడ్జెట్ తక్కువైనా..ఖర్చులు బారెడు.. నెలకొచ్చే జీతభత్యాల పరంగా చూస్తే సామాన్యులకు రూ.3వేల నుంచి రూ.8వేల వరకు ఉంటే, మధ్యతరగతి వర్గాలకు రూ.8వేల నుంచి 20వేల వరకు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు రూ.20వేల నుంచి రూ.50వేల వరకు, ఉన్నత, ధనిక వర్గాల వారికి రూ.50వేల నుంచి రూ.లక్షన్నర ఆపైగా ఉంటుంది. ఇక సంక్రాంతి పండుగ వేళల్లో వీరు చేసే ఖర్చులను చూస్తే సామాన్యులు షాపింగ్స్‌కు రూ.1500ల నుంచి రూ.2వేల వరకు ఖర్చు చేయగా, పిండివంటల కోసం నాలుగైదు వందల వరకు, సినిమాలు షికార్ల కోసం మరో నాలుగైదువందల వరకు ఖర్చు చేస్తున్నారని అంచనా. మధ్యతరగతి ప్రజలు షాపింగ్స్‌కు రూ.5వేల నుంచిరూ.10వేల వరకు ఖర్చుచేయగా, సినిమాలు, షికార్ల కోసం రూ.2వేలు, విందుల(రెస్టారెంట్ల) కోసం రూ.1000 నుంచిరూ.1500 వరకు ఖర్చు చేస్తున్నట్టుగా అంచనా. ఇక ఎగువ మధ్యతరగతి ప్రజలు షాపింగ్స్‌కు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చుచేయగా, సినిమాలు, షికార్లకోసం రూ.5వేల వరకు, విందుల కోసం ఐదువేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక ఉన్నత, ధనిక వర్గాల వారైతే ఈ ఖర్చులకు లెక్కేలేదు. వీరు షాపింగ్స్కే ఏకంగా రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేశారని చె బుతున్నారు. ఇక సినిమాలు, షికార్ల కోసం రూ.10వేల వరకు, రెస్టారెంట్స్ కోసం రూ.20వేలకు పైగా ఖర్చువుతుందని ఒక అంచనా. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సంక్రాంతి పేరు చెప్పి షాపింగ్స్ కోసం రూ.100కోట్ల నుంచి రూ.150కోట్ల వరకు వ్యాపారం జరిగినట్టుగా చెబుతున్నారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అపారం
కేంద్రానికి నివేదిస్తాం పార్లమెంటరీ కమిటీ బృందం వెల్లడి అనకాపల్లి: హుద్‌హుద్ తుపానుకు జిల్లా తీవ్రంగా నష్టపోయినట్టు స్పష్టంగా కన్పిస్తోందని పార్లమెంటరీ కమిటీ పరిశీలన బృందం చైర్మన్ భట్టాచార్య తెలిపారు. భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్యపాల్ సింగ్‌తో పాటు పలువురు ఎంపీలు అనకాపల్లిలోని తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆదివారం సందర్శించారు. భట్టాచార్య మాట్లాడుతూ నష్టం అపారమని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుబ్రహ్మణ్య కాలనీలో పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వేగవంతం చేయాలని, ఇటువంటి అంశాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.ఎంపీ సీతారామ ఏచూరి మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించే ఇళ్ల కంటే పక్కా ఇళ్లు నిర్మించడమే మేలన్నారు. జరిగిన నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, కింజరపు రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు, జిల్లా కలెక్టర్ యువరాజ్, డీఆర్డీఏ పీడీ వెంకటరెడ్డి, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యుడు పల్లెల గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఏఎంఏఎల్ కళాశాలలో... ఏఎంఏఎల్ కళాశాలలో తుఫాన్‌కు పడిపోయిన ఆడిటోరియం, ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం సభ్యులు తిలకించారు. అక్కడ జరిగిన న ష్టాన్ని వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ వివరించారు. ఇంత వరకూ ప్రజాప్రతినిధులు రాలేదని లక్ష్మీనారాయణ చెబుతుండగా, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జోక్యం చేసుకొని తమ నివేదిక వల్లే ఈ బృందం వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామంతి పెరగడంతో కలెక్టర్ సర్దిచెప్పారు. నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బృందం.. అనంతరం పార్లమెంటరీ బృందం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలకు ఆలయ వర్గాలు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తాం రాంబిల్లి: హుద్‌హుద్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ పరిశీలన బృందం చైర్మన్ పి. భట్టాచార్య హామీ ఇచ్చారు. ఆదివారం భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్య పాల్ సింగ్ తో పాటు పలువురు ఎంపీలు రాంబిల్లి మండలం గొరపూడిలో హుద్‌హుద్ తుపాను ధాటికి నేలకూలిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. తుపాను నష్టంపై ఆరా తీశారు. తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఎంపీపీ వసంతవాడ లక్ష్మీనాగరత్నం, పంచదార్ల సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. ఉద్యానవన శాఖ అధికారి రాధిక తుపాను నష్టం తీరును ఎంపీలకు వివరించారు. పర్యటనలో బృంద సభ్యుల వెంట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ, జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ గంగాధరరావు, ఎంపీడీవో డి.డి. స్వరూపరాణి, టీడీపీ నాయకులు లాలం భాస్కరరావు, లాలం నాయుడుబాబు, వసంతవాడ దిన్‌బాబు పలు శాఖల అధికారులు , సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. -
పండగ వేళ గుండెల్లో రైళ్లు
పండక్కి ఊరెళ్లాలి. పిల్లలకు సెలవులిచ్చేశారు. అసలే పెద్ద పండగ. సొంతూళ్లో చేసుకోకపోతే సంతృప్తి ఉండదు. అందుకే విశాఖ రైల్వే స్టేషన్ ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. నగరంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే ఎక్కువ. వారంతా స్వస్థలాలకు పయనం కావడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ తీసుకునేందుకు పోటీ పడాల్సి వచ్చింది. గంటపాటు నిరీక్షిస్తేనే కానీ టికెట్ లభ్యం కాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఆ రైలు వెళ్లిపోవడంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన బొకారో, రత్నాచల్, ప్యాసింజర్ రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి, నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లకు వందలాదిమంది నిరీక్షణ జాబితాలోనే ప్రయాణిస్తున్నారు. కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద వుండే జనరల్ బుకింగ్‌ను హుద్‌హుద్ తుపాను నుంచి మూసేశారు. దీంతో ప్రయాణికులంతా జనరల్ బుకింగ్ కౌంటర్ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు కూడా పనిచేయకపోవడంతో తోపులాట తప్పడం లేదు. -విశాఖపట్నం సిటీ -
మంత్రి గంటా రాజకీయ ఊసరవెల్లి
అమాత్యుని అవినీతి పెరుగుతోంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ విశాఖపట్నం (తగరపువలస): తరచూ పార్టీని..నియోజకవర్గాన్ని మార్చే మంత్రి గంటా శ్రీనివాసరావును రాజకీయ ఊసరవెల్లిగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అభివర్ణించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుద్‌హుద్ తుపాను తర్వాత భీమిలి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పర్యటించారో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడంతో విఫలమైనందున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మందలించారన్నారు. అందువల్లే గంటా అలిగి పడుకున్నారన్నారు. వైఎస్.జగన్మోహనరెడ్డి భీమిలి తోటవీధి, బోయివీధిలో పర్యటించినప్పుడు గంటా ఇక్కడే ఉండి ఇప్పటివరకు తాము బతికున్నామో చచ్చామో కూడా చూడలేదని మత్స్యకారులు వాపోయిన సంగతిని గుర్తు చేశారు .అలాంటి గంటాకు వైఎస్.జగన్మోహనరెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. పోటీ చేయాలని ఉవ్విళ్లూరితే అసెంబ్లీ సభ్యత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి కర్రి సీతారామ్‌పై పోటీచేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. అవినీతి, కబ్జాలకు మారుపేరు గంటా.. మంత్రి అనుచరుడు భాస్కరరావు ఇటీవల రూ.475 కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడినట్టు ఒక దినపత్రికలోనే ప్రచురితమైందన్నారు. తుపాను తర్వాత 20 రోజులకు తన తల్లిపేరిట కార్యక్రమానికి వ్యాపారులను, విద్యాసంస్థలను బెదిరించి రూ.లక్షలు చందాలుగా వసూలు చేశారని అమర్నాథ్ ఆరోపించారు. ఎయిడెడ్ ఉపాద్యాయుల విరమణ వయసు పెంచడానికి విద్యాశాఖలో అవినీతి జరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రాబాబే ఇతర మంత్రుల ముందు అంగీకరించి తర్వాత గంటాను వెనకేసుకురావడంతో ఆయనకూ ఇందులో వాటా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అక్రమంగా ఉపాధ్యాయులను బదిలీ చేయడానికి పైరవీలు చేస్తూ గంటా కుటుంబ సభ్యులే రూ.లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. భీమిలి ఇన్చార్జ్ కర్రి సీతారామ్ మాట్లాడుతూ భీమిలిలో గంటా గెలుపు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఓట్లు చీల్చలేకపోవడంతోనే సాధ్యమైందన్నారు. 2009లో భీమిలిలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్ల కంటే 2014లో తనకే అధికంగా ఓట్లు లభించాయన్నారు. దమ్ముంటే మళ్లీ ఇప్పుడు తనపై పోటీచేసి గెలవాలన్నారు. భీమిలి పట్టణ ఇన్చార్జి అక్కరమాని వెంకటరావు మాట్లాడుతూ చిట్టివలస జూట్‌మిల్లును తెరిపించడంతో మంత్రి గంటాతో పాటు కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విఫలమయ్యారన్నారు. నేటినుంచి వైఎస్సార్సీపీ వార్డు కమిటీలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం జీవీఎంసీ పరిధిలో వార్డు కమిటీలు ప్రకటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భీమిలి విలీనంపై పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత జోన్లో కూడా కమిటీల వేస్తామన్నారు. -
అచ్చెన్నాయుడి అసందర్భ వ్యాఖ్యలు
* తుపానుపై చర్చ పేరిట జగన్‌పై అధికార పక్షం దాడి * విపక్ష సభ్యుల తీవ్ర నిరసన * మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: సంబంధం లేని ప్రశ్నలు, వ్యాఖ్యలతో నోరు నొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి సమయం, సందర్భంతో నిమిత్తం ఉండదని ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం శాసనసభలో నిరూపించారు. ఉత్తరాంధ్రను కుదిపేసిన హుద్‌హుద్ తుపానుపై చర్చ పేరిట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అకారణ దాడి చేసి ‘రాజును మిం చిన రాజభక్తి’ని ప్రదర్శించారు. తుపానుపై చర్చకు, సీబీఐ కేసులకు లింకేమిటో మంత్రికే తెలియాలి. అసలేం జరిగిందంటే... హుద్‌హుద్ తుపాను నష్టంపై ఎమ్మెల్యే కళావెంకట్రావ్ 344వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్వల్పకాలిక చర్చను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రారంభించారు. తన ప్రసంగంలో ప్రతి పక్షనేత జగన్‌ను ఉద్దేశించి పార్ట్‌టైం పాలిటీషియన్ అని, తుపాను బాధితుల్ని కుక్కలతో పోల్చారని.. రకరకాల ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యం తరం తెలుపుతూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఆయన జగన్మోహన్రెడ్డిని మాట్లాడమని కోరారు. జగన్: సభ్య సమాజం సిగ్గుపడేలా మీ (కూన) ప్రవర్తన ఉంది. విశాఖలో బాధితులకు ఆహార పొట్లా లు, నిత్యావసర వస్తువులు ఎలా సరఫరా చేశారో మీకు తెలుసా? ఈవేళ నేను గానీ మా పార్టీ వాళ్లుగానీ ఆహార పొట్లాలు తెప్పించి మీకు అలా విసిరేస్తే తీసుకుంటారా? తీసుకోరు గదా. కానీ మీరక్కడ చేసిందందే. బాధితులకు అలా ఎందుకిచ్చారు? ప్రతి గడప గడపకూ ఎం దుకు చేర్చలేకపోయా రు? దాన్ని తప్పు బడితే మమ్మల్ని విమర్శిసా ్తరా? ( అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు) అచ్చెన్నాయుడు: మిమ్మల్ని ఏ పదజాలంతో వ్యవహరించాలో అర్థం కావడం లేదు. ఆరోజు పరిస్థితి అలాంటింది. కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరూ ఆపలేరు. కానీ ఆ బీభత్సం నుంచి ప్రజలు తిరిగి కోలుకునేలా ముఖ్యమంత్రి, అధికారులు చేసిన కృషిని ప్రశంసించాలి. లేకుంటే మెదలకుండా ఉండాలి. సభ్యసమాజం సిగ్గుపడాలని మీరంటున్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి కోర్టుల చుట్టూ తిరుగుతూ కూడా మీరు శానససభలో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. సభ జరుగుతున్నందున ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇమ్మని కోరిన ‘నీవు దొంగవు, గంట సమయం ఇస్తున్నాం’ అంటూ పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. స్తంభించిన సభ: దీంతో విపక్షం భగ్గుమంది. సభ మధ్యలోకి దూసుకువచ్చిన సభ్యులు డిప్యూటీ స్పీకర్, మంత్రితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ‘చంద్రబాబు 420. మంత్రి క్షమాపణలు చెప్పాలి’ అనే నినాదాలతో పోడియంను చుట్టుముట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అభ్యంతరకర మాటలుంటే పరిశీలించి తొల గిస్తామని డిప్యూటీ స్పీకర్ హామీ ఇస్తూ 12.10 గంటల ప్రాంతంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా వైఎస్సార్సీపీ సభ్యులు ఆర్ శివప్రసాద్‌రెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొడా లి నాని, కోటింరెడ్డి శ్రీధర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, రోజా తదితరులు మంత్రి అచ్చెన్నాయుడు వైపు తిరిగి క్షమాపణ చెప్పాలంటూ నిలదీశారు.ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రత్తిపాటి పుల్లారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి సర్దిచెప్పి శాంతింపజేశారు. రైతు సమస్యలైపై వాయిదా.. తిరస్కరణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలంటూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శుక్రవారం శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ‘86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉండదు. అన్నదాతల సమస్యల మీద చర్చించాలి’ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి,గడికోట స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. బీఏసీలో నిర్ణయాల మేరకు చర్చిద్దామని స్పీకర్ వారికి తెలిపారు. -
శ్రీకాంత్ ఎలెవన్ ఘనవిజయం
హుద్‌హుద్ బాధితుల సహాయార్థం బెజవాడలో స్టార్ క్రికెట్ మ్యాచ్ 39 పరుగులతో నెగ్గిన శ్రీకాంత్ జట్టు అలరించిన తారల నృత్యాలు విజయవాడ స్పోర్ట్స్: హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన స్టార్ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరితంగా సాగింది. శ్రీమిత్ర హౌసింగ్, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన మ్యాచ్‌ను హీరో రామ్‌చరణ్‌తేజ టాస్ వేసి ప్రారంభించారు. తరుణ్ ఎలెవన్, శ్రీకాంత్ ఎలెవన్ జట్లు తలపడగా.. శ్రీకాంత్ ఎలెవన్ జట్టు 39 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాంత్ ఎలెవన్ జట్టు 19.2 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు నిఖిల్(35), నాని(31) మంచి పునాది వేయగా, సుధీర్ (41), నందకిషోర్ (32) రాణించారు. అనంతరం 200 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన తరుణ్ ఎలెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. జట్టులో రఘు 43 (6 ఫోర్లు, ఒక సిక్స్), తారకరత్న 22, తరుణ్ 27 పరుగులు చేశారు. శ్రీకాంత్ ఎలెవన్ జట్టు బౌలర్లలో ఆదర్శ్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. సుధీర్ 2, ఖయ్యూం ఒక వికెట్ పడగొట్టారు. మ్యాచ్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.రామకృష్ణ, శ్రీమిత్ర గ్రూప్ అధినేత చౌదరి, సినిమా రంగ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, హీరో జగపతిబాబు, బుల్లితెర నటులు, హీరోయిన్లు గౌరీ ముంజల్, సంజనా, రెజీనా, కామ్నా జెఠ్మలానీ, రక్ష, సాన్వీ తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్లు, పలువురు నటీనటులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 71 లక్షలు.. టాలీవుడ్ ఫండ్ రైజింగ్ క్రికెట్ మ్యాచ్ ద్వారా శ్రీమిత్ర హౌసింగ్, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కలిపి రూ. 20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు శ్రీమిత్ర హౌసింగ్ అధినేత చౌదరి ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా సేకరించిన దాదాపు రూ. 71 లక్షల 10 వేలు హుద్‌హుద్ బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు మ్యాచ్ స్పాన్సర్లు ప్రకటించారు. అభినందన గ్రూప్ రూ. 5 లక్షలు, శుభగృహ హౌసింగ్ రూ. 10 లక్షలు, నున్న రమణ రూ. 5 లక్షలు, పీజే ఎంటర్టైన్మెంట్స్ రూ. 5 లక్షలు, ఫ్యూచరాల్ రూ. 10 లక్షలు, భాష్యం స్కూల్ రూ. 5 లక్షలు, జీడీ కమ్యూనికేషన్స్, రామకృష్ణ హౌసింగ్ తదితర సంస్థలు ప్రకటించిన వాటితో కలిపి ఆ మొత్తం సమకూరాయని నిర్వాహకులు తెలిపారు. నాహిద్ అనే మూడేళ్ల బాలుడు రూ.10 వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేశాడు. -
హుద్‌హుద్ సాయంలో కోత
పొంతనలేని నివేదికలే కారణం ప్రధాని ప్రకటించిన సాయం తెచ్చుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం 1,000 కోట్లు ఇస్తామన్న మోదీ 680 కోట్ల రూపాయలు సరిపోతాయంటున్న కేంద్ర శాఖలు సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను నష్టానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 1,000 కోట్లను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. తుపాను నష్టంపై రాష్ట్ర యంత్రాంగం పొంతనలేని నివేదికలు పంపడమే దీనికి కారణం. రాష్ట్రం పంపిన నివేదికలు వాస్తవానికి దగ్గరగా లేవని కేంద్రం కూడా వాటిని విశ్వసించడంలేదు. తొలుత రూ. 14,000 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ తరువాత రూ. 21,908 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపింది. అందులో తక్షణ సాయంగా రూ. 9,500 కోట్లు ఇవ్వాలని కూడా కోరింది. ఈ నివేదికలన్నింటినీ పరిశీలించిన కేంద్ర ఆర్థిక, హోంశాఖ అధికారులు.. నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచి చూపిందనే అభిప్రాయానికి వచ్చారు. మొత్తం రూ.680 కోట్లు సాయంగా ఇస్తే సరిపోతుందని ఆ రెండు శాఖలు అంచనాకు వచ్చాయి. కాగా, హుద్‌హుద్ తుపానులో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకే నష్టం వాటిల్లినట్లు గతంలోనే వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల సాయంలో తొలి విడతగా కేవలం రూ. 400 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. దీంతో రాష్ట్ర అధికారులు షాక్ తిన్నారు. ఆందోళనతో ఢిల్లీ బయల్దేరుతున్నారు. ఈ నెల 15న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ సుకుమార ఢిల్లీ వెళ్లి హుద్‌హుద్ నష్టంపై కేంద్ర అధికారులతో చర్చించనున్నారు. -
స్మార్ట్ విలే జ్ నిర్మించండి
తెలుగు చిత్రసీమను కోరిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సాక్షి, హైదరాబాద్: ‘‘సినీ పరిశ్రమ యావత్తూ ఒక్క తాటిపై నిలిచి స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమం చేపట్టింది. ‘మేము సైతం’ ద్వారా రూ.11,51,56,116 మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. ఈ మొత్తాన్నీ మీకే ఇచ్చేస్తాను. దీనికి సమానంగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తాం. ఆ మొత్తం డబ్బుతో హుద్‌హుద్ తో దెబ్బతిన్న పల్లెటూళ్లలో ఏదో ఒక పల్లెని మీరే ఎంచుకోండి. దాన్ని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దండి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. వచ్చే అక్టోబర్ నాటికి తుపాను బీభత్సానికి ఏడాది పూర్తవుతుందని, ఆలోగా స్మార్ట్ విలేజ్‌ని పూర్తి చేయాలన్నారు. విరాళాలతో దాదాపు 8 వేల గృహాలను కట్టొచ్చని, తెలుగు సినీ పరిశ్రమ పేరు కలకాలం నిలిచిపోయేలా ఆ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు ఇందుకు చిత్రప్రముఖులు అంగీకారం తెలిపారు. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న విశాఖకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలుగు చిత్రసీమ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఈ శోభ చూస్తోంటే... మహనీయుడు నందమూరి తారకరామారావు గారు ప్రజల కోసం జోలె పట్టిన నాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆ స్ఫూర్తి ఇప్పుడు మీలో కనిపిస్తోంది. తుపాను సైతం అసూయ పడేంత బ్రహ్మండంగా ఈ కార్యక్రమం చేశారు’’ అని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లోనూ విశాఖ ప్రజలు చూపించిన చొరవ చాలా గొప్పదన్నారు. భవిష్యత్తులో ఏ విలయం కూడా ఏమీ చేయలేనంత గొప్పగా వైజాగ్‌ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ‘‘తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగువారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి. తెలుగు చిత్రసీమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలి’’ అని పేర్కొన్నారు. సంక్షోభంలోనే అవకాశాలు.. కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిని తాను భయపడనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్షోభంలోనే అవకాశాలు ఉంటాయన్నారు. రాజధాని నిర్మాణం ఒకప్పుడు పెద్ద సమస్య అని, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడను తెలుగువారు గర్వపడేలా రాజధానిగా తీర్చిదిద్దాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ‘‘నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మంచి ఫలితాలనిచ్చింది. దాని స్ఫూర్తిగా నేను ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’కి పిలుపునిచ్చాను. అది మంచి ఫలితాలను ఇస్తోంది. త్వరలో ‘స్మార్ట్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందుకెళ్తా. సింగపూర్, జపాన్ స్ఫూర్తితో ముందుకెళ్తే రానున్న 30, 40 ఏళ్లలో మనదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం’’ అని అన్నారు. ఈ సందర్భంగా జెమినీ టీవీతోపాటు పలు వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు చంద్రబాబుకు విరాళాల చెక్కులు అందించాయి. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల విరాళం ప్రకటించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్రసీమ తరఫున చిరంజీవి ముగింపు ప్రసంగం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందర్నీ అభినందించారు. -
క్రికెట్ టికెట్ల సొమ్ము వాపసు
పీఎం పాలెం : హుద్‌హుద్ తుపాను ప్రభావంతో గత నెల 14న రద్దయిన భారత్-వెస్టీండీస్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల సొమ్మును శనివారం చెల్లించారు. సుమారు రూ. 20 లక్షల వరకు చెల్లించినట్టు టికెట్ల సొమ్ము చెల్లింపు బృందం ప్రతినిధి డి.వి.ఎన్ .రాజు తెలిపారు. మీ సేవా కేంద్రాల్లో టికెట్ కొనుగోలు చేసిన వారికి ఆయా కేంద్రాల్లో చెల్లిస్తారని చెప్పారు. స్టేడియం వద్ద రూ. 5000 టికెట్ కొనుగోలు చేసిన 77 మంది, రూ. 2000 టికెట్ కొనుగోలు చేసిన 213 మంది, రూ.1500 టికెట్ కొనుగోలు చేసిన 285 మంది, రూ. 400 టికెట్లు కొనుగోలు చేసిన 1900 మందికి గేట్ నెం- 19, 16, 15 వద్ద సొమ్ము వాపసు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం కూడా ఈ సొమ్ము వాపసు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. -
ఏమిట్రీ భారం
వుడా మెడకు ‘గార్డు’ల ఉచ్చు ప్లాస్టిక్ గార్డులకు అనుమతించని ప్రభుత్వం ఇప్పటికే 28 వేలు వరకు ఆర్డర్ ఇచ్చిన వుడా తీసుకోడానికి వెనుకాడుతున్న అధికారులు విశాఖ రూరల్: అనాలోచిత నిర్ణయాలు విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) మెడకు చుట్టుకుంటున్నా యి. హుద్‌హుద్ తుపాను నష్ట నివారణ చర్య లు సంస్థకు భారంగా పరిణమిస్తున్నాయి. ముందస్తు వ్యూహం లేకుండా హడావుడిగా పిలిచిన టెండర్లు ఇప్పుడు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. నగరంలో పచ్చదనాన్ని పెం పొందించే కార్యక్రమాన్ని చేపట్టిన వుడా.. ట్రీ గార్డుల విషయంలో తప్పటడుగులు వేసింది. సిమెంట్, బేంబూ, ఇలా అనేక రకాల ట్రీ గార్డులు ఉండగా.. వాటన్నింటినీ కాదని ప్లాస్టిక్ ట్రీ గార్డులకు ఆర్డర్ ఇచ్చింది. అవి పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు.. గాలికి ఇవి ఎగిరిపోకుండా ఉండడానికి వీటికి మరో గార్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ ట్రీ గార్డులపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆర్డర్ ఇచ్చిన 28 వేల గార్డుల ఖర్చు వుడాయే భరించాల్సి రావడంత పాటు వాటి స్థానంలో మరో ట్రీ గార్డులు సిద్ధం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. పాస్టిక్‌ను నిషేదించిన వుడాయే.. తుపాను కారణంగా నగరంలో పచ్చదనం తుడుచిపెట్టుకుపోయింది. దీంతో జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ, వుడాతో పాటు ఇతర శాఖలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. వుడా అధికారులు నగర పరిధిలో 64,760 మొక్కలు నాటడానికి గల ప్రదేశాలను గుర్తించారు. 97,402 వివిధ రకాల మొక్కలను సేకరించాలని నిర్ణయించారు. నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సి ఉండడం, అవి అందుబాటులో లేకపోవడంతో మొక్కలు నాటే ప్రక్రియకు కొంత జాప్యం జరిగింది. ఇంతలో వుడా అధికారులు ప్లాస్టిక్ ట్రీగార్డులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో 28 వేల ప్లాస్టిక్ ట్రీ గార్డులకు ఆర్డర్ ఇచ్చారు. ఒక్కో గార్డు రూ.650గా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి వుడా అభివృద్ధి చేసిన పార్కుల్లో అధికారులు ప్లాస్టిక్‌ను నిషేదించారు. ఆ నిషేదాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన వుడా అధికారులే మొక్కలకు రక్షణగా ప్లాస్టిక్ గార్డులను తయారు చేయించడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. పర్యావరణ వేత్తలు సైతం వుడా చర్యలను తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేసే ఈ ప్లాస్టిక్ గార్డులకే రక్షణ లేకుండా పోయింది. కాస్త గట్టిగా గాలి వస్తే ఇవి ఎగిరిపోయేలా ఉన్నాయి. మొక్కల రక్షణ మాటెలా ఉన్నా వీటి రక్షణకు మరో గార్డును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇంత తేలికైన గార్డులను బీచ్ రోడ్డులో ఏర్పాటు చేస్తుండడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. భారం భరించాల్సింది వుడాయే ప్లాస్టిక్ ట్రీ గార్డులపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిని వినియోగించకూడదని అధికారులకు తేల్చి చెప్పింది. వాటి స్థానంలో సిమెంట్, బేంబూ, ఇతర గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ గార్డులకు నిధులు మంజూరు చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ గార్డులను ఆర్డర్ ఇచ్చిన వుడా అధికారులే ఆ వ్యయాన్ని భరించాలంటూ హుకుం జారీ చేసింది. ఇప్పటికే 8 వేల ప్లాస్టిక్ గార్డులను వుడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. మరో 20 వేలు గార్డులను కాంట్రాక్టర్ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించకపోవడంతో తయారు చేసిన గార్డులు తీసుకోకూడదని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సదరు కాంట్రాక్టర్ మాత్రం బ్యాంకు రుణం తీసుకొని మరీ ఈ గార్డులను తయారు చేశామని, ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వీటిని తీసుకోవాల్సిందేనని వుడా అధికారులకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ గార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో వుడాపై రూ.1.82 కోట్లు భారం పడనుంది. వీటి స్థానంలో మళ్లీ ట్రీ గార్డులు సమకూర్చాల్సి వస్తుంది. వాటికి మరింత నిధులు వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్లాస్టిక్ గార్డులు తీసుకుని మిగిలినవి సిమెంట్, ఐరెన్, లేదా బేంబూ గార్డులను తయారు చేయించాలని వుడా అధికారులు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. -
రిలీవింగ్‌కు.. జే‘సీ’
గుంటూరు కమిషనర్‌గా పోస్టింగ్ వచ్చి నెలైనా వెళ్లలేని స్థితిలో జేసీ తొలుత హుద్‌హుద్.. తర్వాత కలెక్టర్ సెలవు వరుస కార్యక్రమాలతో బిజీబిజీ ప్రవీణ్‌కుమార్ రాక కోసం గుంటూరు వాసుల నిరీక్షణ సాక్షి, విశాఖపట్నం : కోరుకున్న పోస్టు దక్కితే ఎవరైనా ఎగిరి గంతేస్తూ ఉత్తర్వు వచ్చిన మర్నాడే ఆ పోస్టులో చేరిపోతారు. కానీ జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రాష్ర్టంలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైన అక్టోబర్ మొదటి వారంలోనే ఆయనకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పోస్టింగ్ దక్కింది. వెంటనే వెళ్లి చేరాలని ఆశించారు. అంతలో హుద్‌హుద్ తుపాను హెచ్చరికలు రావడం, తుపాను తర్వాత రిలీవ్ చేస్తానంటూ కలెక్టర్ యువరాజ్ చెప్పడంతో కాదనలేకపోయారు. కనివినీ ఎరుగని రీతిలో హుద్‌హుద్ విధ్వంసం సృష్టించడం, సాక్షాత్తు ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం, ఉన్నతాధికారులంతా నగరంలోనే మకాం వేసి సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించడంతో జేసీకి కదల్లేని పరిస్థితి నెలకొంది. కాస్త పరిస్థితులు చక్కబడినందున రిలీవ్ అవుదామని ఆశించినప్పటికీ కలెక్టర్ కుటుంబ సమేతంగా వారంరోజుల పాటు స్వస్థలానికి వెళ్లారు. దీంతో ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 17వ తేదీన సీఎం పర్యటనతో తన రిలీవింగ్ మళ్లీ వాయిదాపడింది. ఆ తర్వాత రిలీవ్ అవుదామంటే కేంద్ర బృందం రానుండడం, కలెక్టర్ విదేశీ పర్యటనకు వెళ్లనుండడంతో మళ్లీ వాయిదాపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంతలో మళ్లీ ఈ నెల 29న సీఎం వస్తున్నారన్న సమాచారంతో మళ్లీ ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రిలీవింగ్ కోసం జేసీ నాలుగుసార్లు గుంటూరుకు రిజర్వేషన్ చేయించుకున్నారు.. చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. గుంటూరు వాసులు కొత్త మున్సిపల్ కమిషనర్ కోసం నెల రోజులుగా నిరీక్షించకతప్పడం లేదు. ఈయన రిలీవ్ కాకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ జేసీగా ఎవర్ని నియమించకపోవడమే. -
పరిహారం భోంచేశారు
టీడీపీ నేతలపై గుడివాడ అమర్నాథ్ విమర్శ మల్కాపురం: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ నాయకులు వారికి వచ్చిన పరిహారాన్ని భోంచేశారని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. గురువారం మల్కాపురం మరిడిమాంబ కల్యాణ మండపంలో జరిగిన పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 45 నుంచి 49వ వార్డు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నాయకులు స్టువర్టుపురం దొంగలను తలపిస్తున్నారని విమర్శించారు. హుద్‌హుద్ తుపాను బాధితులకు పరిహారం పంపిణీలోను పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు. దివంగత సీఎం వైస్ హయాంలో అర్హులు ప్రతిఒక్కరికీ పింఛను మంజూరు చేస్తే నిబంధనల పేరిట అర్హులకు తొలగించి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. రైతులకు, డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ విషయాన్ని విస్మరించారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని నగరంపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని, తుపానుకు దెబ్బతిన్న గ్రామాలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించిన ఏ నాయకుడైనా వారి మదిలో నిలిచిపోతారని, ఆ స్థానాన్ని దివంగత సీఎం వైఎస్ సంపాదించారని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు. వైఎ స్సా ర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి,బీసీ సెల్ నాయకులు పక్కి దివాకర్, మాజీ కార్పొరేటర్లు కలిదండి బద్రినాథ్, దాడి సత్యనారాయణ, మాటూరి చిన్నారావు పాల్గొన్నారు. -
తీర గ్రామాల్లో ఎన్యుమరేషన్ చిచ్చు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మత్స్యశాఖ చేపట్టిన ఎన్యుమరేషన్ గ్రామాల్లో చిచ్చు రేపుతోంది. హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల ఎన్యుమరేషన్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో విభేదాలు పొడచూపుతున్నాయి. బోట్లే లేని వారి బోట్లు పోయాయని ఎలా చూపిస్తారని ఒక వర్గం వాదిస్తుంటే, మా పేర్లు చేర్చితే మీకేంటి నష్టమంటూ మరో వర్గం ప్రతివాదనకు దిగుతోంది. అనర్హులను జాబితాల్లో చేర్చడంతో మత్స్యశాఖ అధికారులపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనికంతటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. హుద్‌హుద్ తుపాను బీభత్సానికి భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా బోట్లు, వలలు కొట్టుకుపోవడమే కాకుండా మరికొన్ని బాగా దెబ్బతిన్నాయి. తుపాను తీరందాటిన అనంతరం ఎన్యుమరేషన్ చేపట్టగా 375 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ మేరకు బాధితుల జాబితా తయారు చేశారు. ఒక్కొక్క బోటుపై ఆధారపడ్డ ఐదుగురు కలాసీలకు, సదరు బోటు యాజమానికి చెరో రూ.10 వేలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అవకాశంగా తీసుకుని అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకుని అధికారులపై ఒత్తిళ్లు చేసి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావల్సిన వారందరికీ పరిహారం వచ్చేలా జాబితాలు తయారు చేయించారన్న విమర్శలున్నాయి. ఈ విషయమై గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. నష్టం జరిగిన వారి పేర్లతో పాటు ఎటువంటి నష్టం జరగని వారి పేర్లను జాబితాలో చేర్చడంపై గ్రామాల్లో అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. గ్రామాల వారీగా తయారు చేసిన జాబితాలను చూసి కొంతమందైతే అవాక్కైపోతున్నారు. అసలు బోట్లే లేని వారిని ఎలా చూపించారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నష్టం జరిగినవారికి, నష్టం జరగనివారికి తేడా ఏంటని?, ఇదేం పద్ధతి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అనర్హులను సైతం చేర్చాలనుకుంటే మిగతా వారిని కూడా కలపాలంటూ వాదనకు దిగుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో రూలా? అంటూ వాదులాడుకుంటున్నారు. మొత్తానికి గ్రామాల్లో ఇదొక చిచ్చులా తయారైంది. ఇదే విషయమై వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు నేతృత్వంలో మత్స్యకార సంఘ నాయకులు బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాయుడు తదితరులు సోమవారం మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్‌ను కలిసి నిలదీశారు. నష్టాల జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయని, నష్టం జరగని వారి పేర్లును జాబితాల్లో చేర్చారని, టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి జాబితాలు తయారు చేశారని బర్రి చిన్నప్పన్న, ఎం.అప్పలకొండ, బర్రి రాముడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిలదీస్తామనే ఉద్దేశంతోనే జన్మభూమి సమావేశాలకు మత్స్యశాఖ అధికారులు హాజరు కాలేదని, మత్స్యశాఖ కార్యాలయంలోనే ఈ అవకతవకలు జరిగాయని ఏడీ ఎదుటే ఆరోపించారు. ఎవరి మెప్పు కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అటు మత్స్య శాఖ ఏడీ ఫణిప్రకాష్, ఇటు మత్స్యకార సంఘం నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లోకి వచ్చి పరిశీలించి, విచారణ జరిపితే వాస్తవాలు బయటికొస్తాయని, అసలైన అర్హులకు న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు. -
కలిసి నడుద్దాం..
కడలి కన్నెర్ర చేసి నెల కావొస్తున్నా.. తీరం ఇంకా వణుకుతూనే ఉంది. హుదూద్ ధాటికి విలవిల్లాడిన విశాఖను ఊరడించడానికి హీరో శ్రీకాంత్ ముందడుగు వేశారు. ఒక రోజంతా వైజాగ్ వీధుల్లో తిరిగారు. జడివానకు జడిసిన జనాలను ఆత్మీయంగా పలకరించి ధైర్యాన్నిచ్చారు. గురువారం ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా విశాఖవాసులను పలకరించారు. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, పెదగదిలి, జూను సందర్శించారు. బాధితులతో, విపత్తు ప్రాంతాల్లో సేవలందించిన వారితో మాట్లాడారు. ‘హుదూద్ ఇంత బీభత్సం సృష్టించిందా? తలచుకుంటేనే భయమేస్తోంది. విశాఖ ప్రజల ధైర్యానికి శాల్యూట్.. విశాఖను పునర్నిర్మించుకొందాం. అందుకు అందరం కలిసి నడుద్దాం’ అంటున్న శ్రీకాంత్ రిపోర్టింగ్ విశేషాలు.. సమయం: ఉదయం 10:30 ప్రాంతం: ఫిషింగ్ హార్బర్ శ్రీకాంత్: మీకు (మత్స్యకారులకు) బోట్లే కదా జీవనాధారం. అవి బాగా దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేసుకోవడం కష్టమే కదా! ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా? సత్తిబాబు: ఫిషింగ్ హార్బర్లో 65 బోట్లు తుపాను గాలులకు దెబ్బతిన్నాయి. వాటిలో 45 పూర్తిగా పాడైపోయాయి. వాటికి ప్రభుత్వం రూ.6 లక్షల సాయమైతే ప్రకటించింది గానీ ఇంతవరకూ పైసా అందలేదు. శ్రీకాంత్: మరి ఇన్సూరెన్స్ ఏమీ లేదా? సత్తిబాబు: ఉంది సార్! కానీ మా మత్స్యకారుల్లో చాలామంది పేదవారే. ఇక ప్రీమియం ఎలా కట్టుకోగలరు. అది కట్టకే ఇప్పుడే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఒక్కో బోటు మీద నాలుగు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి వేటకు వెళ్లాలంటే రూ.2 లక్షలు ఖర్చవుతోంది. చేపల వేట సరిగా ఉంటే డబ్బులు. లేదంటే నష్టమే మిగులుతుంది. శ్రీకాంత్: మరి బోట్లకు మరమ్మతులకు ఖర్చు ఎక్కువే అవుతుంది కదా! మరి ఏం చేస్తున్నారు? ఎల్లయ్యమ్మ: బాబూ.. ఒక బోటు కొత్తగా తయారు చేసుకోవాలంటే రూ.20 లక్షలవుతుంది. పాడైపోయినవి బాగు చేసుకోవాలంటే రూ.10 లక్షలైనా అవుతుంది. ప్రభుత్వం రూ.6 లక్షలు ఇస్తామంది. అవి ఏ మూలకు సరిపోతాయి బాబూ? ఇప్పుడు బోటు బాగు చేసుకోవాలి. మళ్లీ సముద్రంపైకి వేటకెళ్లాలంటే పెట్టుబడి కావాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. శ్రీకాంత్: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. మీలాంటి బాధితులను ఆదుకోవడానికి అన్ని జిల్లాల నుంచి ముందుకొస్తున్నారు. మా సినీ ఫీల్డ్ నుంచి సహాయం చేయడానికి చాలామంది స్పందించారు. ఫండ్ రైజింగ్ కోసం అంతా కృషి చేస్తున్నారు. సమయం: ఉదయం 11:30 గంటలు ప్రాంతం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీకాంత్: ఏయూని చూస్తే మనసు చలించిపోతోంది. ఒకప్పుడు కళకళలాడిన ఈ ప్రాంగణం ఇపుడు కళావిహీనంగా కనిపిస్తోంది. మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? జీఎస్ఎన్ రాజు (వీసీ): ఏయూ ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిది దశాబ్దాల్లో ఎప్పుడూ ఇలాంటి విపత్తును ఎదుర్కోలేదు. హుదూద్ ముందస్తు హెచ్చరికలతో జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ తుపాను దాటికి చెట్లు కూలిపోయాయి. ఇక్కడి భవనాలు, ఆడిటోరియాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగుల క్వార్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీకాంత్: ఇంత భారీ స్థాయిలో దెబ్బతిన్నా చాలా వేగంగా తేరుకోవడం గొప్ప విషయం. తుపాను తర్వాత సహాయక కార్యక్రమాలు ఎలా జరిగాయి? జీఎస్ఎన్ రాజు: తుపానుతో సిటీ మొత్తం విధ్వంసం కావడంతో ఇక్కడ పనులు కొద్దిగా ఆలస్యమయ్యాయి. కూలిపోయిన చెట్లు, డెబ్రిస్ తొలగింపు చర్యలు తుపాను మర్నాటి నుంచే ప్రారంభించాం. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, సిబ్బందితో పాటు ఎన్జీవోలు... ఇలా ప్రతి ఒక్కరూ సహకరించారు. శ్రీకాంత్: ఇలాంటి నష్టాలను నిధులతో పూడ్చుకోగలిగినా... పచ్చదనాన్ని మాత్రం ఎంత డబ్బు ఖర్చు చేసినా తెచ్చుకోలేం. పచ్చదనం పునరుద్ధరణకు ఏం చేస్తున్నారు? జీఎస్ఎన్ రాజు: ఏయూలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. మొక్కల సంరక్షణకూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల క్లాసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సమయం: ఉదయం 12:20 గంటలు ప్రాంతం: పెదగదిలి శ్రీకాంత్: కొండవాలు ప్రాంతాల్లో ఉన్న మీరు తుపాన్ సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు? సీతమ్మ: ఇక్కడున్నది అంతా పేదలమే. తుపానులొస్తే ఎక్కడికని పరిగెడతాం. తుపాను రోజు బిక్కుబిక్కుమని గడిపాం. పైనుంచి రేకులు ఎగిరిపడుతుంటే బతుకుతామనే ఆశ కూడా పోయింది. మూడు రోజులు నరకం అనుభవించాం. శ్రీకాంత్: ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధైర్యంగా నిలబడ్డారు. మరి ఇల్లు ఎలా కట్టుకుంటున్నారు? రామ: ఏం కట్టుకుంటాం సార్! దేవస్థానం వాళ్లతో ఇబ్బంది వచ్చింది. గాలులకు రేకులు లేచిపోతున్నాయంటే మళ్లీ రేకులే వేసుకోమంటున్నారు. స్లాబు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వమే దేవస్థానం అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలి. కొండమ్మ: పూరిళ్లలో ఉన్నవారికైతే మరిన్ని కష్టాలు బాబూ! ఇంటిపై వేసుకోవడానికి తాటికమ్మలూ దొరకడం లేదు. ఈ ఇరవై రోజులూ ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందలేదు. శ్రీకాంత్: మీ సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం దృష్టి పెడుతుందని భావిస్తున్నాను. సమయం: మధ్యాహ్నం 12.40 ప్రాంతం: జూ పార్కు శ్రీకాంత్: జూలో ఇంతటి నష్టాన్ని ఊహించలేం. మరి దీన్ని ఎలా రికవరీ చేస్తారు? రామలింగం (క్యూరేటర్): జూలో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, తుపాను తర్వాత ఎన్‌క్లోజర్స్‌లో పరిశుభ్రత, ఆరోగ్యరక్షణకు తగిన చర్యలు తీసుకోవడం వల్ల జీవాలన్నీ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాయి. తుపాను రోజున చనిపోయిన జంతువులు, పక్షులు జూలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. శ్రీకాంత్: మరి జూలో పచ్చదనం కోసం ఏం చేస్తున్నారు? రామలింగం: డెబ్రిస్ తొలగింపు దాదాపు కొలిక్కి వస్తోంది. తర్వాత మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తు మరింత పెద్ద తుపానులొచ్చినా తట్టుకొనే, లోతుగా వేళ్లు పెరిగే మొక్కలనే ఎంచుకుంటున్నాం. ఇక జంతువులను ఎక్కువ కాలం కేజ్‌ల్లో ఉంచడం వల్ల సమస్యలు వస్తాయి. వాటిని బయటకు తీసుకొచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 11న సందర్శకులకు అనుమతి ఇస్తున్నాం. -
నేనున్నానని..
తుపాను బాధితులకు జగన్ భరోసా వరద ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అడుగడుగునా కష్టాలు చెప్పుకున్న బాధితులు న్యాయం జరిగేంత వరకూ పోరాటం : ప్రతిపక్ష నేత అధైర్య పడొద్దని ప్రజలకు పరామర్శ సాక్షి, విశాఖపట్నం: ‘‘ఐదుగురు పిల్లలతో పందిరి గూడేసుకుని బతకతన్నాం అయ్యా.. నా భర్త ఏడేళ్ల క్రితమే పోనాడు. పింఛన్ రాట్లేదు. ఇప్పుడు తుఫానుకు ఆ పందిరి ఎగిరిపోనాది. కూలిన ఇల్లు ఉంటే చూపించు నష్టపరిహారం రాస్తానంటున్నారు. ఎగిరిపోయిన గూడును నెనెక్కడినుంచి తేవాలా?. మాకు బతికే దారిలేదయ్యా’అంటూ గనగల కొర్లమ్మ అనే మహిళ పూడిమడకలో సముద్రం వద్ద జగన్మోహన్రెడ్డికి తన కష్టాన్ని చెప్పుకుంది. ‘‘బాబూ..ఇల్లు పడిపోనాది. కూడులేదు. గంజినీళ్లు కూడా లేవు బాబూ.. మమ్మల్ని చూణ్ణానికి కూడా ఏరూ రానేదు. నువ్వే వచ్చావు నాయనా. మా కష్టాలు ఏలా ఉన్నావో చూడయ్యా.’’అంటూ దేసుడు సూరమ్మ అనే వృద్ధురాలు అచ్యుతాపురంలో జగన్‌ను చూసి గుండెలుబాదుకుంది.’’ఇలా ఒకరు కాదు కాదు ఇద్దరు కాదు వేలాదిమంది హుధూద్ తుఫాను బాధితులు మంగళవారం తమను పరామర్శించడానికి వచ్చిన జగన్‌కు తమ కష్టాలు ఏకరవుపెట్టారు. తుఫాను విలయతాండవానికి సర్వస్వం కోల్పోయిన తీర ప్రాంత ప్రజలను ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలకరించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి సాయంత్రం 3.30 నిమిషాలకు నక్కపల్లి మీదుగా నారాయణపురం చేరుకున్న జగన్ ఎలా ఉన్నారంటూ తమ అక్కడి ప్రజలను పలకరించారు. పాకలన్నీ పడిపోయాయని, రోడ్డుమీదే కాలం గడుపుతున్నామని వారు చెప్పారు. అక్కడి నుంచి కొత్తూరు శారదానదిని దాటుకుని ఎదురువాడ, అచ్చుతాపురం మీదుగా పూడిమడక వచ్చారు. కొండపాలెంలో మహిళలు జగన్ చూడగానే ఎదురువచ్చి తమ కష్టాలు ఎకరువుపెట్టారు. 10కేజీల బియ్యం ఇస్తామని రెండు కేజీలు తగ్గించి కొందరికి ఇచ్చారని, తిండిలేక పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ‘మిమ్మల్ని పట్టించుకునేందుకు ఎవరైనా వచ్చారా తల్లి’ అని జగన్ అడిగగా ఇప్పటి వరకూ ఏ నాయకుడు రాలేదని అక్కడి ప్రజలు వాపోయారు. బోటు బద్దలయ్యిందని, తన జీవనాధారం పోయిందని ఆసుపల్లి సత్యవతి దుఃఖపర్యంతమయ్యింది.తినడానికి తిండిలేదని మారి గంజామ్ చెబుతుంటే అక్కడి ప్రజల ధీన స్థితికి జగన్ చలించిపోయారు. పిల్లలతో మేమెలా బతకాలి బాబూ అంటూ మైలపల్లి కాసమ్మ కన్నీరు పెట్టుకుంది. లంగరు వేసిన బోట్లు తీరానికి కొట్టుకుని వచ్చాయని, కొన్ని సముద్రంలో కలిసిపోయాయని చేపల శ్రీరాములు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. సముద్ర తీరంలో నడుస్తూ పాడైన బోట్లను జగన్ పరిశీలించారు. ఆ సమయంలో ‘వస్తాడు వస్తాడు జగనన్న..బంగారు పల్లకిలో..మా కష్టాలు తీర్చేందుకు’అంటూ మత్య్సకార యువకులు సంప్రదాయ రీతిలో గీతాలను ఆలపించారు. ఇంత కష్టంలోనూ తమను ఆదుకునే నేత జగన్ అనే నమ్మకం ఆ పాటల్లో కనిపించింది. అక్కడ ఉన్న వేదికపై జగన్ ప్రసంగానికి ముందు ‘జగన్వచ్చి మన బతుకులు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు.’అని తెలుగుదేశం పార్టీకి చెందిన వి.సింహాచలం అనే మహిళ వేదికపై అనడం విశేషం. అదే వేదిక నుంచి ప్రభుత్వానికి జగన్ తుఫాను బాధితులను ఆదుకోవాలని పలు డిమాండ్లు చేశారు. వాటిని నెరవేర్చకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తానన్నారు. ఇదే సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. ఉద్దపాలెం, తాళ్లదిబ్బ, మాతయ్యపాలెం, దుప్పితూరు ప్రాంతాల్లో పర్యటించిన జగన్ ప్రతిఒక్కరి కష్టాలు అడిగితెలుసుకున్నారు. రాత్రి వేళ అయినప్పటికీ ప్రజలతో పాటే అంధకారంలో గడుపుతూ వారికి ధైర్యమిచ్చారు. పర్యటన ముగించుకుని స్టీల్‌ప్లాంట్ మీదుగా విశాఖనగరానికి చేరుకున్నారు. పర్యటలో పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు..బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో నేడు పరామర్శ విశాఖ రూరల్: హుదూద్ తుపాను బాధితులను పరామర్శించడానికి విశాఖ వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం నగరంలో పర్యటించనున్నారు. ఉదయం ఫోర్‌పాయింట్స్ హోటల్ నుంచి బయల్దేరి 9 గంటలకు ఫిషింగ్ హార్బర్‌ను సందర్శిస్తారు. అక్కడ మత్స్యకారులను పరామర్శించి ఏయూ వెళతారు. అక్కడి నుంచి జాలరిపేట, వాసవానిపాలెం వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడతారు. అనంతరం పెదగదిలి, ధర్మానగర్, తాటిచెట్లపాలెం, రామ్‌జీ ఎస్టేట్, 26వ వార్డులో ఉన్న దుర్గ ఆలయం, కొబ్బరితోట ప్రాంతాల్లో బాధితులకు పరామర్శిస్తారు. రాత్రి నగరంలోనే బస చేస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి(ప్రోగ్రామ్స్) తలశిల రఘురామ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. -
పారాహుషార్ బంగాళాభూతం
బంగాళాఖాతం.. ఇప్పుడు జిల్లావాసులను బుస వినిపించని, పడగ విప్పని మిన్నాగులా భయపెడుతోంది. కడలి కల్పిస్తున్న ‘హుదూద్’ ఆపద ఎక్కడ తీరం దాటుతుంది, ఆ సమయంలో ఎంత విలయం సృష్టిస్తుందోనని ప్రజలు కలవరపడుతున్నారు. మరో పక్క అధికార యంత్రాంగం విపత్కర పరిస్థితి ఉత్పన్నమైతే ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. సాక్షి, కాకినాడ :‘హుదూద్’ తుపాను పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 12న తీరం దాటనున్న ఈ తుపాను ప్రభావంతో 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చన్న అంచనాతో తీరమండలాల ప్రజలను హెచ్చరించారు. తుపాను విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెపుతున్నా దిశమార్చుకుని విశాఖ-కాకినాడ మధ్య దాటే అవకాశాలు లేకపోలేదని అధికారులుంటున్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం రాత్రికి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకతమై వాయవ్యదిశగా పయనిస్తున్న హుదూద్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో కాకినాడ పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు మరో నాలుగైదు రోజులు మత్స్య కారులను వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో (నం: 1077, 0884-2359173), అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో (08856-233100), రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో (0883- 2442344) కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. 1977 నాటి దివిసీమ ఉప్పెన, 1996 నాటి కోనసీమ తుపానులను మించి హుదూద్ ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా యంత్రాంగం తీర మండలాల అధికారులను స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదే శించింది. ఈనెల 13 నుంచి కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినా తుపానుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు కలెక్టర్ నీతూప్రసాద్ ప్రకటించారు. కాగా తుపాను వల్ల ఉత్పన్నం కాగల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావాలని ప్రభుత్వం కోరింది. వీటిలో రెండు జిల్లాకు రానున్నాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే తీరప్రాంతాల్లో 162 బోట్లను, 52 మంది గజ ఈతగాళ్ళను సిద్ధం చేశారు. ఈ నెల 11 నుంచి జరగాల్సిన జన్మభూమి-మా ఊరు సభలను వాయిదా వేశారు. ప్రస్తుతం సముద్రంలో వేటకు వెళ్ళిన 20 బోట్లు సురక్షితంగా తీరం చేరేలా మత్స్యశాఖాధికారులు చర్యలు చేపట్టారు. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కండి ః రాజప్ప తుపాను నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తమై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్.చినరాజప్ప ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ నీతూ ప్రసాద్‌తో కలిసి తుపానును ఎదుర్కొనే సన్నద్ధతపై వివిధశాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. తుపాను ఈ నెల 12 సాయంత్రానికి గోపాల్పూర్-విశాఖల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండి ప్రజలను అన్ని విధాలా అప్రమత్తం చేయాలన్నారు. శుక్రవారం సాయంత్రానికి తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. తుని నుంచి సఖినేటిపల్లి వరకు ఉన్న తీర ప్రాంత మండలాల్లోని ప్రజలందరినీ ముఖ్యంగా ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర మండలాల్లోని బలుసుతిప్ప, భైరవపాలెం, వాసాలతిప్ప వంగి పల్లపు ప్రాంతాల వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలను కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. గురువారం రాత్రి ఆమె వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను తీరం దాటే వేళ పెనుగాలులు, భారీ వర్షంతో ఉవ్వెత్తున సముద్ర అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. అన్ని మండలాల్లో హై అలర్ట్ పాటించాలని, తుపాను పరిస్థితుల దృష్ట్యా ముప్పు తొలగే వరకు 11 నుంచి జరగవలసిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుపానును ఎదుర్కొనేందుకు జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు, డీఆర్వో యాదగిరి, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లూ, అధికారులూ.. తగు చర్యలు తీసుకోండి : సీఎం 12న తీరం దాటనున్న తుపానును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కలెక్టర్లకు, అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 1977లో దివిసీమ ఉప్పెన, 1996లో కోనసీమ తుపాను వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న మినిట్-టు-మినిట్ ట్రాకింగ్, వాతావరణ సిస్టంలను వినియోగించుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రశాంత తీరం.. ప్రమాద సంకేతం! పిఠాపురం : జిల్లాకు.. ముఖ్యంగా తీరానికి తుపాన్లు కొత్త కాకపోయినా.. ఎప్పటికప్పుడు కడలి ఏస్థాయిలో కన్నెర్రజేస్తుందో, ఎంత కన్నీటికి కారణమవుతుందో, ఎన్ని కష్టనష్టాల పాలు చేస్తుందోనన్న కలవరం తప్పదు. గురువారం సముద్రతీరం ప్రశాంతంగా ఉన్నా, అలలు సాధారణంగా ఉండే దానికన్నా తక్కువస్థాయిలో ఉన్నా తీరవాసుల గుండెల్లో అలజడి రేగుతూనే ఉంది. ‘హుదూద్’ తుపాను ప్రభావంతో సముద్రం ఎలా విరుచుకు పడుతుందోనని మత్స్యకారులు గుబులు పడుతున్నారు. సాధారణంగా తుపాను హెచ్చరికలకు అంతగా జంకని ఉప్పాడ తీర మత్స్యకారులు సైతం తమ పడవలు, వలల వంటివి సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటారు. వీరి ఆదుర్దాతో అధికారులు సైతం విస్తుబోతున్నారు. సాధారణ సమయాలలో ఇసుక తిన్నెలతో కళకళలాడుతూ ఉండే సముద్ర తీరప్రాంతం ఒక్క ఇసుక రేణువు కూడా లేకుండా కొట్టుకు పోయి, బంక మట్టి కనిపించేంతగా కోతకు గురైంది. తీవ్రమైన తుపాను వచ్చే ముందే ఇలా జరుగుతుందని స్థానికులు చెపుతుండడం, సముద్రం మామూలుగా ఉండే దానికన్నా ప్రశాంతంగా ఉండడంతో అధికారులనూ ఆందోళన పరుస్తోంది.