- పొంతనలేని నివేదికలే కారణం
- ప్రధాని ప్రకటించిన సాయం తెచ్చుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం
- 1,000 కోట్లు ఇస్తామన్న మోదీ
- 680 కోట్ల రూపాయలు సరిపోతాయంటున్న కేంద్ర శాఖలు
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను నష్టానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 1,000 కోట్లను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. తుపాను నష్టంపై రాష్ట్ర యంత్రాంగం పొంతనలేని నివేదికలు పంపడమే దీనికి కారణం.
రాష్ట్రం పంపిన నివేదికలు వాస్తవానికి దగ్గరగా లేవని కేంద్రం కూడా వాటిని విశ్వసించడంలేదు. తొలుత రూ. 14,000 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ తరువాత రూ. 21,908 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపింది. అందులో తక్షణ సాయంగా రూ. 9,500 కోట్లు ఇవ్వాలని కూడా కోరింది. ఈ నివేదికలన్నింటినీ పరిశీలించిన కేంద్ర ఆర్థిక, హోంశాఖ అధికారులు.. నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచి చూపిందనే అభిప్రాయానికి వచ్చారు.
మొత్తం రూ.680 కోట్లు సాయంగా ఇస్తే సరిపోతుందని ఆ రెండు శాఖలు అంచనాకు వచ్చాయి. కాగా, హుద్‌హుద్ తుపానులో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకే నష్టం వాటిల్లినట్లు గతంలోనే వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల సాయంలో తొలి విడతగా కేవలం రూ. 400 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది.
దీంతో రాష్ట్ర అధికారులు షాక్ తిన్నారు. ఆందోళనతో ఢిల్లీ బయల్దేరుతున్నారు. ఈ నెల 15న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ సుకుమార ఢిల్లీ వెళ్లి హుద్‌హుద్ నష్టంపై కేంద్ర అధికారులతో చర్చించనున్నారు.