సీఎం చంద్రబాబునాయుడు అరకులోయ పర్యటన మూడోసారి కూడా రద్దయింది. గతేడాది హుద్‌హుద్ తుపానుకు మండలంలోని...
మళ్లీ రద్దుతో గిరిజనుల్లో నిరుత్సాహం
అరకులోయ: సీఎం చంద్రబాబునాయుడు అరకులోయ పర్యటన మూడోసారి కూడా రద్దయింది. గతేడాది హుద్‌హుద్ తుపానుకు మండలంలోని మాదల పంచాయతీ మెదర్‌సోలా గ్రామంలో కొండచరియలు విరిగిపడిన సంఘటనలో ఐదుగురు ఆదిమజాతి గిరిజనులు దుర్మరణం పాలయ్యారు. ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం వస్తారని ఏర్పాట్లు చేసిన అధికారులు, పర్యటన రద్దయినట్లు చివరి నిమిషంలో ప్రకటించారు.
జన్మభూమిలో పాల్గొంటారని...
అరకులోయ మండలంలో సీఎం దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. హుటాహుటిన రహదారిని మెరుగుపరిచారు. పంచాయతీలో పెండింగ్ పనులను పూర్తిచేశారు. ఐటీడీఏ పీవో, ఇతర శాఖ అధికారులు సమస్యలను గుర్తించారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో బహిరంగ సభకు సుమారు 10 వేల మందికి సరిపడే వేదికను సిద్ధం చేశారు. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దుతో గిరిజనులు నిరాశకు గురయ్యారు.
మళ్లీ రద్దు..
అరకులోయలో సోమవారం సీఎం చంద్రబాబునాయుడు పర్యటిస్తారని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పెదలబుడులో రచ్చబండలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో కాఫీ పైలాన్ నిర్మాణం, ఎన్టీఆర్ క్రీడా మైదానంలో సుమారు 20వేల మందికి సరిపడే సభా వేదిక సిద్ధం చేశారు. ఈసారి తప్పనిసరిగా చంద్రబాబు అరకు వస్తారని అధికారులు భావించారు. సీఎం పర్యటన రద్దయిందని చివరి నిమిషంలో కలెక్టర్ యువరాజ్ ప్రకటించారు.
పర్యటన రద్దుపై భిన్న కథనాలు
అరకులోయలో సీఎం పర్యటన తరచూ రద్దవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అరకులోయ వస్తే పదవి కోల్పోతారన్న సెంటిమెంట్‌కూడా ఆయన పర్యటన రద్దుకు కారణమని ప్రచారం జరుగుతోంది. బాక్సైట్ ఉద్యమం, మావోయిస్టుల ప్రభావం కూడా కారణం కావొచ్చని అంటున్నారు.