అరకు రావద్దు సారూ..!
ఏజెన్సీ టీడీపీ నేతల సూచన
బాక్సైట్ వ్యతిరేక ఉద్యమమే కారణం
12న సీఎం అరకు పర్యటన రద్దు
విశాఖపట్నం : ‘సీఎంగారు మా నియోజకవర్గానికి రావాలి... మా గ్రామానికి రావాలి’అని సాధారణంగా నేతలు కోరుతారు. అందుకోసం పట్టుబడతారు. సీఎం ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. కానీ సీఎం చంద్రబాబు ఏజెన్సీ పర్యటన విషయంలో ఆ సీన్ కాస్తా రివర్స్ అవుతోంది. రావడానికి వీల్లేదని గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు. వస్తే మేం కుటుంబాలతో గ్రామాల్లో ఉండలేం’అని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై తీవ్ర తర్జనభర్జనలు పడ్డ సీఎం అరకు పర్యటనను రద్దు చేసుకున్నారు.
అరకు పర్యటనకు సిద్ధపడ్డ సీఎం
12న అరకులోయలో పర్యటించాలని సీఎం నిర్ణయించుకున్నారు. పెద్దలబుడు పంచాయతీని ఆయన దత్తత తీసుకున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. ఇంతవరకు అక్కడకు వెళ్లనే లేదు. ఒక్క రూపాయి కూడా కేటాయించనూ లేదు. పర్యటన ముందు ఈ విషయం గుర్తుకువచ్చింది. దాంతో రూ.5కోట్లు కేటాయిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక అరకులోయకు వెళ్లడమే తరువాయి అని భావించారు. జాయింట్ కలెక్టర్ నివాస్, ఇతర అధికారులు శుక్రవారం అరకులో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. కానీ..
మీరు రావద్దు సారూ
బాక్సైట్ తవ్వకాలు జరుపుతామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఏజెన్సీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాక్సైట్ ఉద్యమం ఏజెన్సీలో తీవ్రస్థాయిలో సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటించడాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. పర్యటించడానికి వీల్లేదని పలు పంచాయతీలు పాలకమండళ్లు శనివారం తీర్మానాలు చేయాలని నిర్ణయించాయి. మరోవైపు ఏజెన్సీలో నలుగురు టీడీపీ నేతలను మావోయిస్టులు కొన్ని రోజుల క్రితమే అపహరించడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత... మరోవైపు మావోయిస్టుల నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఏజెన్సీలోని టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమైంది.
దాంతో సీఎం పర్యటించకపోతేనే మంచిదని వారు సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చారు. ఓ టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి సీఎం ను కలిశారు. ‘ఎన్ని వాహనాలు పెట్టినా గిరిజనులు మీ పర్యటనలో పాల్లోడానికి సాహసించరు. వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు’అని సున్నితంగానైనా అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దాంతో సీఎం ఇంటిలిజెన్స్ అధికారులను కూడా సంప్రదించారు. వారు కూడా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నందున పర్యటనను రద్దు చేసుకోవాలనే సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు తన అరకు పర్యటనను రద్దు చేసుకున్నారు. 12న విశాఖలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించారు.