- కేంద్రానికి నివేదిస్తాం
- పార్లమెంటరీ కమిటీ బృందం వెల్లడి
అనకాపల్లి: హుద్‌హుద్ తుపానుకు జిల్లా తీవ్రంగా నష్టపోయినట్టు స్పష్టంగా కన్పిస్తోందని పార్లమెంటరీ కమిటీ పరిశీలన బృందం చైర్మన్ భట్టాచార్య తెలిపారు. భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్యపాల్ సింగ్‌తో పాటు పలువురు ఎంపీలు అనకాపల్లిలోని తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆదివారం సందర్శించారు. భట్టాచార్య మాట్లాడుతూ నష్టం అపారమని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
సుబ్రహ్మణ్య కాలనీలో పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వేగవంతం చేయాలని, ఇటువంటి అంశాలపై జిల్లా కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.ఎంపీ సీతారామ ఏచూరి మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించే ఇళ్ల కంటే పక్కా ఇళ్లు నిర్మించడమే మేలన్నారు. జరిగిన నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, కింజరపు రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు, జిల్లా కలెక్టర్ యువరాజ్, డీఆర్‌డీఏ పీడీ వెంకటరెడ్డి, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యుడు పల్లెల గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు.
ఏఎంఏఎల్ కళాశాలలో...
ఏఎంఏఎల్ కళాశాలలో తుఫాన్‌కు పడిపోయిన ఆడిటోరియం, ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం సభ్యులు తిలకించారు. అక్కడ జరిగిన న ష్టాన్ని వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ వివరించారు. ఇంత వరకూ ప్రజాప్రతినిధులు రాలేదని లక్ష్మీనారాయణ చెబుతుండగా, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జోక్యం చేసుకొని తమ నివేదిక వల్లే ఈ బృందం వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామంతి పెరగడంతో కలెక్టర్ సర్దిచెప్పారు.
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బృందం..
అనంతరం పార్లమెంటరీ బృందం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలకు ఆలయ వర్గాలు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాలు అందజేశారు.
బాధితులకు న్యాయం జరిగేలా చేస్తాం
రాంబిల్లి: హుద్‌హుద్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ పరిశీలన బృందం చైర్మన్ పి. భట్టాచార్య హామీ ఇచ్చారు. ఆదివారం భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్య పాల్ సింగ్ తో పాటు పలువురు ఎంపీలు రాంబిల్లి మండలం గొరపూడిలో హుద్‌హుద్ తుపాను ధాటికి నేలకూలిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. తుపాను నష్టంపై ఆరా తీశారు.
తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఎంపీపీ వసంతవాడ లక్ష్మీనాగరత్నం, పంచదార్ల సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. ఉద్యానవన శాఖ అధికారి రాధిక తుపాను నష్టం తీరును ఎంపీలకు వివరించారు. పర్యటనలో బృంద సభ్యుల వెంట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ, జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ గంగాధరరావు, ఎంపీడీవో డి.డి. స్వరూపరాణి, టీడీపీ నాయకులు లాలం భాస్కరరావు, లాలం నాయుడుబాబు, వసంతవాడ దిన్‌బాబు పలు శాఖల అధికారులు , సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.