Satya Pal Singh
-
జాతీయ విద్యాసంస్థలకు రూ. 6143 కోట్లు కేటాయించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా సంస్థలకు 6,143 కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఉన్నత విద్యా సంస్థల నిర్మాణం కోసం జరిపిన నిధుల కేటాయింపు గురించి వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ స్థాయి ఉన్నత విద్యాలయాల నిర్మాణానికి ఈ మొత్తం కేటాయించినట్టు గురువారం రాజ్యసభలో వెల్లడించారు. అంతేకాకుండా రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. విద్యాసంస్థలకు కేటాయించిన మొత్తంలో 2018 డిసెంబర్ నాటికి 195.14 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. 2017-18 బడ్జెట్లో విద్యా సంస్థలకు 250 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందని చెప్పిన సత్యపాల్ సింగ్.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఏపీలో సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2018 డిసెంబర్ 14వ తేదీన లోక్‌సభ ఆమోదం పొందినట్టు తెలిపారు. కేటాయింపుల్లో.. సెంట్రల్ యూనివర్సిటీకి 902 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి(తెలంగాణతో కలిపి) 834 కోట్లు, ఐఐటీ తొలి దశకు 1074 కోట్లు, ఎన్ఐటీకి 460 కోట్లు, ఐఐఎంకు 594 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్‌కి 1979 కోట్లు, ట్రిపుల్ ఐఐటీకి 297 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయా విద్యా సంస్థలను శాశ్వత క్యాంపస్‌లకు తరలించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి ఐఐటీ భవనాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనట్టు మంత్రి గుర్తుచేశారు. -
మళ్లీ కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్
సాక్షి, బెంగళూర్ : సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ట్విటర్ లో కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ కు ఈ విలక్షణ నటుడు సూటిగా చురకలు అంటించాడు. ‘‘మనిషి కోతి నుంచి పుట్టాడన్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రిగారు చెబుతున్నారు. కానీ, అయ్యా.. అందుకు భిన్నమైన పరిస్థితులను మనం ఇప్పుడు చూస్తున్నామన్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా? మనిషి కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నాడు’’ అంటూ ప్రకాశ్ రాజ్ మంత్రిని ఉద్దేశించి ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. కాగా, ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని.. కాబట్టి డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని ఆయన చెప్పారు. తక్షణమే ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రిని ట్రోల్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “ our ancestors have not seen ape evolving in to man” says minister. But dear sir,..can you deny that we are witnessing..the reverse....man evolving into ape by digging the past and trying to take us back into STONE AGE......#justasking — Prakash Raj (@prakashraaj) 22 January 2018 -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అపారం
కేంద్రానికి నివేదిస్తాం పార్లమెంటరీ కమిటీ బృందం వెల్లడి అనకాపల్లి: హుద్‌హుద్ తుపానుకు జిల్లా తీవ్రంగా నష్టపోయినట్టు స్పష్టంగా కన్పిస్తోందని పార్లమెంటరీ కమిటీ పరిశీలన బృందం చైర్మన్ భట్టాచార్య తెలిపారు. భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్యపాల్ సింగ్‌తో పాటు పలువురు ఎంపీలు అనకాపల్లిలోని తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆదివారం సందర్శించారు. భట్టాచార్య మాట్లాడుతూ నష్టం అపారమని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుబ్రహ్మణ్య కాలనీలో పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు వేగవంతం చేయాలని, ఇటువంటి అంశాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు.ఎంపీ సీతారామ ఏచూరి మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించే ఇళ్ల కంటే పక్కా ఇళ్లు నిర్మించడమే మేలన్నారు. జరిగిన నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. ఎంపీలు అవంతి శ్రీనివాసరావు, కింజరపు రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు, జిల్లా కలెక్టర్ యువరాజ్, డీఆర్డీఏ పీడీ వెంకటరెడ్డి, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ సభ్యుడు పల్లెల గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఏఎంఏఎల్ కళాశాలలో... ఏఎంఏఎల్ కళాశాలలో తుఫాన్‌కు పడిపోయిన ఆడిటోరియం, ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం సభ్యులు తిలకించారు. అక్కడ జరిగిన న ష్టాన్ని వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ వివరించారు. ఇంత వరకూ ప్రజాప్రతినిధులు రాలేదని లక్ష్మీనారాయణ చెబుతుండగా, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జోక్యం చేసుకొని తమ నివేదిక వల్లే ఈ బృందం వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామంతి పెరగడంతో కలెక్టర్ సర్దిచెప్పారు. నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న బృందం.. అనంతరం పార్లమెంటరీ బృందం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీలకు ఆలయ వర్గాలు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తాం రాంబిల్లి: హుద్‌హుద్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ పరిశీలన బృందం చైర్మన్ పి. భట్టాచార్య హామీ ఇచ్చారు. ఆదివారం భట్టాచార్య నేతృత్వంలో సీతారాం ఏచూరి, సత్య పాల్ సింగ్ తో పాటు పలువురు ఎంపీలు రాంబిల్లి మండలం గొరపూడిలో హుద్‌హుద్ తుపాను ధాటికి నేలకూలిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. తుపాను నష్టంపై ఆరా తీశారు. తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఎంపీపీ వసంతవాడ లక్ష్మీనాగరత్నం, పంచదార్ల సర్పంచ్ వసంతవాడ వెంకటేశ్వరరావు ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. ఉద్యానవన శాఖ అధికారి రాధిక తుపాను నష్టం తీరును ఎంపీలకు వివరించారు. పర్యటనలో బృంద సభ్యుల వెంట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ, జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్, ఆర్డీవో పద్మావతి, తహశీల్దార్ గంగాధరరావు, ఎంపీడీవో డి.డి. స్వరూపరాణి, టీడీపీ నాయకులు లాలం భాస్కరరావు, లాలం నాయుడుబాబు, వసంతవాడ దిన్‌బాబు పలు శాఖల అధికారులు , సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.