ఎప్పుడూ రాని కష్టం వచ్చింది... ఎన్నో కుటుంబాలు చివురుటాకుల్లా వణికిపోయాయి... ఎంద రికో గూడులేకుండా పోయింది...రైతుల కష్టం నీళ్లపాలయింది... ఒకరేమిటి జిల్లాలో దాదాపు అన్ని వర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు... ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి...ఇది హుద్‌హుద్ తుపాను రేపిన గాయం. అయితే హుద్‌హుద్ కన్నా ఘోరంగా నేతలు వ్యవహరించారు. తుపాను వచ్చిన వెంటనే జిల్లాలో పర్యటించి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీలు గుప్పించారు. కొద్దిపాటి మొత్తాన్ని విడుదల చేశారు. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో జిల్లా వాసులు కష్టాలతో కాపురం చేయవలసి వస్తోంది. ప్రకృతి బీభత్సం సృష్టించి ఎనిమిది నెలలు దాటింది , ఇప్పటికీ తుపాను ఆనవాళ్లు చెరిగిపోలేదు. జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీధిదీపాలు కూడా వెలగని దుస్థితి ఏర్పడింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుద్‌హుద్ సృష్టించిన బీభత్సం జిల్లా ప్రజల కళ్లముందు ఇంకా కదలాడుతునే ఉంది. ఎనిమిది నెలలు కావస్తున్నా అది చేసిన గాయం మాత్రం మానలేదు. బాధితుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. హుద్‌హుద్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రితో పాటు జిల్లాకొచ్చిన మంత్రులంతా ఊదరగొట్టారు. కానీ ఆ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. జిల్లాలో రైతులకు రూ.210 కోట్ల మేర నష్టం వాటిల్లగా కేవలం రూ.37కోట్లు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. జిల్లా వ్యాప్తంగా 15,189 ఇళ్లు కూలిపోగా, ఇంతవరకు ఒక్క బాధితుడికి కూడా కొత్తగా ఇల్లు మంజూరు చేయలేదు. మిగతా నష్టాలపైనా ఇదే తరహాలో ప్రభుత్వ
స్పందన ఉంది. ఇదంతా పక్కన పెడితే హుద్‌హుద్ దెబ్బకు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పాడైన వీధి లైట్లకు పలుచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసి మమ అనిపించారు. కానీ అవి వెలుగేదెప్పుడో, ఆరిపోయేదెప్పుడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో పరిస్థితి మరింత దయనీయం. పట్టణంలోని అత్యధిక ప్రాంతాలు నేటికీ అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఎల్‌ఈడీ లైట్లును ఏర్పాటు చేస్తామంటూ పాడైన లైట్లును గాలికొదిలేశారు. విజయనగరం మున్సిపాల్టీలో 10,500 వీధి లైట్లు ఉండగా హుద్‌హుద్‌కు దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి. తుఫాన్ తరువాత జిల్లాకొచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణ సీరియస్‌గా స్పందిస్తూ 15 రోజుల్లోగా వీధి లైట్లును పునరుద్ధరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కానీ ఆ దిశగా పునరుద్ధరణ పనులు జరగలేదు.
ఇప్పటికైతే మరమ్మతులు చేపట్టి 2500పాత లైట్లును, కొత్తగా మరో 1500ఎల్‌ఈడీ లైట్లును ఏర్పాటు చేశారు. దాదాపు 6500 వీధిలైట్లు వెలగడంలేదు. దీంతో పట్టణంలోని అత్యధిక ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ఇదే అవకాశంగా దొంగలు చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకూ దాదాపు 150 దొంగతనాలు జరిగాయి. ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడమే కాకుండా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు మున్సిపల్ పాలకులు గాని, ఇటు ప్రభుత్వ పెద్దలు గాని పట్టించుకోవడం లేదు. సాలూరు మున్సిపాల్టీలో 500లైట్లు, బొబ్బిలి మున్సిపాల్టీలో 100, పార్వతీపురం మున్సిపాల్టీలో 500లైట్లు హుద్‌హుద్ బీభత్సానికి దెబ్బతిన్నాయి. వాటికి తాత్కాలికంగా మరమ్మతు చేశారు. అయితే అవి ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు వెలగవో చెప్పలేని పరిస్థితి. అన్ని మున్సిపాల్టీల్లో ఎల్‌ఈడీ వెలుగులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా నేటికీ అది నెరవేరలేదు.
భారీ విపత్తు... సాయం వీసమెత్తు!
Published Sun, Jul 5 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement