ఏమిట్రీ భారం | Plastic guard that the government | Sakshi
Sakshi News home page

ఏమిట్రీ భారం

Published Sun, Nov 23 2014 6:38 AM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM

ఏమిట్రీ భారం - Sakshi

ఏమిట్రీ భారం

  • వుడా మెడకు ‘గార్డు’ల ఉచ్చు  
  •  ప్లాస్టిక్ గార్డులకు అనుమతించని ప్రభుత్వం
  •  ఇప్పటికే 28 వేలు వరకు ఆర్డర్ ఇచ్చిన వుడా
  •  తీసుకోడానికి వెనుకాడుతున్న అధికారులు
  • విశాఖ రూరల్:  అనాలోచిత నిర్ణయాలు విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) మెడకు చుట్టుకుంటున్నా యి. హుద్‌హుద్ తుపాను నష్ట నివారణ చర్య లు సంస్థకు భారంగా పరిణమిస్తున్నాయి. ముందస్తు వ్యూహం లేకుండా హడావుడిగా పిలిచిన టెండర్లు ఇప్పుడు భారీ నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. నగరంలో పచ్చదనాన్ని పెం పొందించే కార్యక్రమాన్ని చేపట్టిన వుడా.. ట్రీ గార్డుల విషయంలో తప్పటడుగులు వేసింది.

    సిమెంట్, బేంబూ, ఇలా అనేక రకాల ట్రీ గార్డులు ఉండగా.. వాటన్నింటినీ కాదని ప్లాస్టిక్ ట్రీ గార్డులకు ఆర్డర్ ఇచ్చింది. అవి పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు.. గాలికి ఇవి ఎగిరిపోకుండా ఉండడానికి వీటికి మరో గార్డులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ ట్రీ గార్డులపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆర్డర్ ఇచ్చిన 28 వేల గార్డుల ఖర్చు వుడాయే భరించాల్సి రావడంత పాటు వాటి స్థానంలో మరో ట్రీ గార్డులు సిద్ధం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.
     
    పాస్టిక్‌ను నిషేదించిన వుడాయే..


    తుపాను కారణంగా నగరంలో పచ్చదనం తుడుచిపెట్టుకుపోయింది. దీంతో జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ, వుడాతో పాటు ఇతర శాఖలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. వుడా అధికారులు నగర పరిధిలో 64,760 మొక్కలు నాటడానికి గల ప్రదేశాలను గుర్తించారు. 97,402 వివిధ రకాల మొక్కలను సేకరించాలని నిర్ణయించారు.

    నాటిన మొక్కలకు రక్షణగా ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సి ఉండడం, అవి అందుబాటులో లేకపోవడంతో మొక్కలు నాటే ప్రక్రియకు కొంత జాప్యం జరిగింది. ఇంతలో వుడా అధికారులు ప్లాస్టిక్ ట్రీగార్డులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో 28 వేల ప్లాస్టిక్ ట్రీ గార్డులకు ఆర్డర్ ఇచ్చారు. ఒక్కో గార్డు రూ.650గా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి వుడా అభివృద్ధి చేసిన పార్కుల్లో అధికారులు ప్లాస్టిక్‌ను నిషేదించారు.

    ఆ నిషేదాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన వుడా అధికారులే మొక్కలకు రక్షణగా ప్లాస్టిక్ గార్డులను తయారు చేయించడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. పర్యావరణ వేత్తలు సైతం వుడా చర్యలను తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే మొక్కలకు రక్షణగా ఏర్పాటు చేసే ఈ ప్లాస్టిక్ గార్డులకే రక్షణ లేకుండా పోయింది. కాస్త గట్టిగా గాలి వస్తే ఇవి ఎగిరిపోయేలా ఉన్నాయి. మొక్కల రక్షణ మాటెలా ఉన్నా వీటి రక్షణకు మరో గార్డును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇంత తేలికైన గార్డులను బీచ్ రోడ్డులో ఏర్పాటు చేస్తుండడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.
     
    భారం భరించాల్సింది వుడాయే

    ప్లాస్టిక్ ట్రీ గార్డులపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిని వినియోగించకూడదని అధికారులకు తేల్చి చెప్పింది. వాటి స్థానంలో సిమెంట్, బేంబూ, ఇతర గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ గార్డులకు నిధులు మంజూరు చేసేది లేదని స్పష్టం చేశారు. ఈ గార్డులను ఆర్డర్ ఇచ్చిన వుడా అధికారులే ఆ వ్యయాన్ని భరించాలంటూ హుకుం జారీ చేసింది.

    ఇప్పటికే 8 వేల ప్లాస్టిక్ గార్డులను వుడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. మరో 20 వేలు గార్డులను కాంట్రాక్టర్ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించకపోవడంతో తయారు చేసిన గార్డులు తీసుకోకూడదని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సదరు కాంట్రాక్టర్ మాత్రం బ్యాంకు రుణం తీసుకొని మరీ ఈ గార్డులను తయారు చేశామని, ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వీటిని తీసుకోవాల్సిందేనని వుడా అధికారులకు తేల్చి చెప్పినట్లు తెలిసింది.

    దీంతో ఈ గార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో వుడాపై రూ.1.82 కోట్లు భారం పడనుంది. వీటి  స్థానంలో మళ్లీ ట్రీ గార్డులు సమకూర్చాల్సి వస్తుంది. వాటికి మరింత నిధులు వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్లాస్టిక్ గార్డులు తీసుకుని మిగిలినవి సిమెంట్, ఐరెన్, లేదా బేంబూ గార్డులను తయారు చేయించాలని వుడా అధికారులు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement