కలిసి నడుద్దాం.. | hero srikanth meets vishakha people as sakshi reporter | Sakshi
Sakshi News home page

కలిసి నడుద్దాం..

Published Sat, Nov 8 2014 11:20 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

కలిసి నడుద్దాం.. - Sakshi

కలిసి నడుద్దాం..

కడలి కన్నెర్ర చేసి నెల కావొస్తున్నా.. తీరం ఇంకా వణుకుతూనే ఉంది. హుదూద్ ధాటికి విలవిల్లాడిన విశాఖను ఊరడించడానికి హీరో శ్రీకాంత్ ముందడుగు వేశారు. ఒక రోజంతా వైజాగ్ వీధుల్లో తిరిగారు. జడివానకు జడిసిన జనాలను ఆత్మీయంగా పలకరించి ధైర్యాన్నిచ్చారు. గురువారం ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా విశాఖవాసులను పలకరించారు.

ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న ఫిషింగ్ హార్బర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, పెదగదిలి, జూను సందర్శించారు. బాధితులతో, విపత్తు ప్రాంతాల్లో సేవలందించిన వారితో మాట్లాడారు. ‘హుదూద్ ఇంత బీభత్సం సృష్టించిందా? తలచుకుంటేనే భయమేస్తోంది. విశాఖ ప్రజల ధైర్యానికి శాల్యూట్.. విశాఖను పునర్నిర్మించుకొందాం.  అందుకు అందరం కలిసి నడుద్దాం’ అంటున్న శ్రీకాంత్ రిపోర్టింగ్ విశేషాలు..
 
సమయం: ఉదయం 10:30
ప్రాంతం: ఫిషింగ్ హార్బర్

శ్రీకాంత్: మీకు (మత్స్యకారులకు) బోట్లే కదా జీవనాధారం. అవి బాగా దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేసుకోవడం కష్టమే కదా! ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా?

సత్తిబాబు: ఫిషింగ్ హార్బర్‌లో 65 బోట్లు తుపాను గాలులకు దెబ్బతిన్నాయి. వాటిలో 45 పూర్తిగా పాడైపోయాయి. వాటికి ప్రభుత్వం రూ.6 లక్షల సాయమైతే ప్రకటించింది గానీ ఇంతవరకూ పైసా అందలేదు.

శ్రీకాంత్: మరి ఇన్సూరెన్స్ ఏమీ లేదా?

సత్తిబాబు: ఉంది సార్! కానీ మా మత్స్యకారుల్లో చాలామంది పేదవారే. ఇక ప్రీమియం ఎలా కట్టుకోగలరు. అది కట్టకే ఇప్పుడే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఒక్కో బోటు మీద నాలుగు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి వేటకు వెళ్లాలంటే రూ.2 లక్షలు ఖర్చవుతోంది. చేపల వేట సరిగా ఉంటే డబ్బులు. లేదంటే నష్టమే మిగులుతుంది.

శ్రీకాంత్: మరి బోట్లకు మరమ్మతులకు ఖర్చు ఎక్కువే అవుతుంది కదా! మరి ఏం చేస్తున్నారు?

ఎల్లయ్యమ్మ: బాబూ.. ఒక బోటు కొత్తగా తయారు చేసుకోవాలంటే రూ.20 లక్షలవుతుంది. పాడైపోయినవి బాగు చేసుకోవాలంటే రూ.10 లక్షలైనా అవుతుంది. ప్రభుత్వం రూ.6 లక్షలు ఇస్తామంది. అవి ఏ మూలకు సరిపోతాయి బాబూ? ఇప్పుడు బోటు బాగు చేసుకోవాలి. మళ్లీ సముద్రంపైకి వేటకెళ్లాలంటే పెట్టుబడి కావాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు.

శ్రీకాంత్: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. మీలాంటి బాధితులను ఆదుకోవడానికి అన్ని జిల్లాల నుంచి ముందుకొస్తున్నారు. మా సినీ ఫీల్డ్ నుంచి సహాయం చేయడానికి చాలామంది స్పందించారు. ఫండ్ రైజింగ్ కోసం అంతా కృషి చేస్తున్నారు.  
 
సమయం:
ఉదయం 11:30 గంటలు
ప్రాంతం: ఆంధ్ర విశ్వవిద్యాలయం

శ్రీకాంత్: ఏయూని చూస్తే మనసు చలించిపోతోంది. ఒకప్పుడు కళకళలాడిన ఈ ప్రాంగణం ఇపుడు కళావిహీనంగా కనిపిస్తోంది. మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి ఏం చేస్తున్నారు?

జీఎస్‌ఎన్ రాజు (వీసీ): ఏయూ ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిది దశాబ్దాల్లో ఎప్పుడూ ఇలాంటి విపత్తును ఎదుర్కోలేదు. హుదూద్ ముందస్తు హెచ్చరికలతో జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ తుపాను దాటికి చెట్లు కూలిపోయాయి. ఇక్కడి భవనాలు, ఆడిటోరియాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగుల క్వార్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

శ్రీకాంత్: ఇంత భారీ స్థాయిలో దెబ్బతిన్నా చాలా వేగంగా తేరుకోవడం గొప్ప విషయం. తుపాను తర్వాత సహాయక కార్యక్రమాలు ఎలా జరిగాయి?

జీఎస్‌ఎన్ రాజు: తుపానుతో సిటీ మొత్తం విధ్వంసం కావడంతో ఇక్కడ పనులు కొద్దిగా ఆలస్యమయ్యాయి. కూలిపోయిన చెట్లు, డెబ్రిస్ తొలగింపు చర్యలు తుపాను మర్నాటి నుంచే ప్రారంభించాం. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, సిబ్బందితో పాటు ఎన్‌జీవోలు... ఇలా ప్రతి ఒక్కరూ సహకరించారు.

శ్రీకాంత్: ఇలాంటి నష్టాలను నిధులతో పూడ్చుకోగలిగినా... పచ్చదనాన్ని మాత్రం ఎంత డబ్బు ఖర్చు చేసినా తెచ్చుకోలేం. పచ్చదనం పునరుద్ధరణకు ఏం చేస్తున్నారు?

జీఎస్‌ఎన్ రాజు: ఏయూలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. మొక్కల సంరక్షణకూ తగిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల క్లాసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
 
సమయం: ఉదయం 12:20 గంటలు
ప్రాంతం: పెదగదిలి

శ్రీకాంత్: కొండవాలు ప్రాంతాల్లో ఉన్న మీరు తుపాన్ సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు?

సీతమ్మ: ఇక్కడున్నది అంతా పేదలమే. తుపానులొస్తే ఎక్కడికని పరిగెడతాం. తుపాను రోజు బిక్కుబిక్కుమని గడిపాం. పైనుంచి రేకులు ఎగిరిపడుతుంటే బతుకుతామనే ఆశ కూడా పోయింది. మూడు రోజులు నరకం అనుభవించాం.

శ్రీకాంత్: ఇలాంటి కష్టకాలంలో కూడా మీరు ధైర్యంగా నిలబడ్డారు. మరి ఇల్లు ఎలా కట్టుకుంటున్నారు?

రామ: ఏం కట్టుకుంటాం సార్! దేవస్థానం వాళ్లతో ఇబ్బంది వచ్చింది. గాలులకు రేకులు లేచిపోతున్నాయంటే మళ్లీ రేకులే వేసుకోమంటున్నారు. స్లాబు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వమే దేవస్థానం అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలి.

కొండమ్మ: పూరిళ్లలో ఉన్నవారికైతే మరిన్ని కష్టాలు బాబూ! ఇంటిపై వేసుకోవడానికి తాటికమ్మలూ దొరకడం లేదు. ఈ ఇరవై రోజులూ ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందలేదు.

శ్రీకాంత్: మీ సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం దృష్టి పెడుతుందని భావిస్తున్నాను.
 
సమయం: మధ్యాహ్నం 12.40
ప్రాంతం: జూ పార్కు

శ్రీకాంత్: జూలో ఇంతటి నష్టాన్ని ఊహించలేం. మరి దీన్ని ఎలా రికవరీ చేస్తారు?

రామలింగం (క్యూరేటర్): జూలో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు, తుపాను తర్వాత ఎన్‌క్లోజర్స్‌లో పరిశుభ్రత, ఆరోగ్యరక్షణకు తగిన చర్యలు తీసుకోవడం వల్ల జీవాలన్నీ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాయి. తుపాను రోజున చనిపోయిన జంతువులు, పక్షులు జూలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.

శ్రీకాంత్: మరి జూలో పచ్చదనం కోసం ఏం చేస్తున్నారు?

రామలింగం: డెబ్రిస్ తొలగింపు దాదాపు కొలిక్కి వస్తోంది. తర్వాత మొక్కలు నాటే కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తు మరింత పెద్ద తుపానులొచ్చినా తట్టుకొనే, లోతుగా వేళ్లు పెరిగే మొక్కలనే ఎంచుకుంటున్నాం. ఇక జంతువులను ఎక్కువ కాలం కేజ్‌ల్లో ఉంచడం వల్ల సమస్యలు వస్తాయి. వాటిని బయటకు తీసుకొచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 11న సందర్శకులకు అనుమతి ఇస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement