- వ్యాపారుల్లో సం‘క్రాంతులు’
- జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల అమ్మకాలు
- సామాన్యుల నుంచి ధనికుల వరకు ఒకటే జోష్
సంక్రాంతి పండుగ వ్యాపారులకు కాసుల వర్షం కురిపించింది. అమ్మకాలు తారస్థాయికి చేరాయి. ప్రత్యేక ఆఫర్లు, బంపర్ డ్రాలు ప్రకటించడంతో నగరవాసులు ఉత్సాహంగా కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సంక్రాంతికి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సాక్షి, విశాఖపట్నం : తెలుగువారి పెద్దపండుగగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగతో మహానగరం బోసిపోతుంటే..పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. పరసలు, సంబరాలతో పల్లెలన్నీ సందడిగా ఉన్నాయి. ఇక పర్యాటక ప్రాంతాలు, సినిమా థియేటర్లు కిటికిటలాడుతున్నాయి. హుద్‌హుద్ తుపానుతో మూడునెలలు గా సరైన వ్యాపారం లేక వెలవెలబోయిన నగరంలోని షాపింగ్‌మాల్స్ పండుగ పుణ్యమాని పుంజుకున్నాయి. సంక్రాంతి నాడు కోట్లల్లోనే వ్యాపారం జరగడంతో వ్యాపారులు ఉత్సాహంగా ఉన్నారు.
అందరిలోనూ ఒకటే జోష్ :జిల్లాలో సుమారు 13 లక్షల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల పరిధిలో 40 లక్షలకు పైగా జనాభా ఉంది. మొత్తం కుటుంబాల్లో 8 లక్షల నుంచి 10లక్షల కుటుంబాల వరకు హిందూవులుంటారని అంచనా. వీరిలో సుమారు ఐదు లక్షల కుటుం బాలు నిరుపేద, సామాన్య వర్గాలకు చెందిన వారు కాగా, రెండున్నరలక్షల కుటుంబాల వరకు మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు, లక్షన్నర కుటుంబాల వరకు ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, మరో లక్షన్నర కుటుంబాలు ఉన్నత, ధనిక వర్గాలకు చెందిన వారుంటారని అంచనా. మిగిలిన పండుగ వేళల్లో ఎలా ఉన్నా సంక్రాంతి పండుగ కోసం మాత్రం అన్ని వర్గాల వారు భారీగానే ఖర్చు చేస్తుంటారు.
బడ్జెట్ తక్కువైనా..ఖర్చులు బారెడు..
నెలకొచ్చే జీతభత్యాల పరంగా చూస్తే సామాన్యులకు రూ.3వేల నుంచి రూ.8వేల వరకు ఉంటే, మధ్యతరగతి వర్గాలకు రూ.8వేల నుంచి 20వేల వరకు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు రూ.20వేల నుంచి రూ.50వేల వరకు, ఉన్నత, ధనిక వర్గాల వారికి రూ.50వేల నుంచి రూ.లక్షన్నర ఆపైగా ఉంటుంది. ఇక సంక్రాంతి పండుగ వేళల్లో వీరు చేసే ఖర్చులను చూస్తే సామాన్యులు షాపింగ్స్‌కు రూ.1500ల నుంచి రూ.2వేల వరకు ఖర్చు చేయగా, పిండివంటల కోసం నాలుగైదు వందల వరకు, సినిమాలు షికార్ల కోసం మరో నాలుగైదువందల వరకు ఖర్చు చేస్తున్నారని అంచనా.
మధ్యతరగతి ప్రజలు షాపింగ్స్‌కు రూ.5వేల నుంచిరూ.10వేల వరకు ఖర్చుచేయగా, సినిమాలు, షికార్ల కోసం రూ.2వేలు, విందుల(రెస్టారెంట్ల) కోసం రూ.1000 నుంచిరూ.1500 వరకు ఖర్చు చేస్తున్నట్టుగా అంచనా. ఇక ఎగువ మధ్యతరగతి ప్రజలు షాపింగ్స్‌కు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చుచేయగా, సినిమాలు, షికార్లకోసం రూ.5వేల వరకు, విందుల కోసం ఐదువేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
ఇక ఉన్నత, ధనిక వర్గాల వారైతే ఈ ఖర్చులకు లెక్కేలేదు. వీరు షాపింగ్స్‌కే ఏకంగా రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేశారని చె బుతున్నారు. ఇక సినిమాలు, షికార్ల కోసం రూ.10వేల వరకు, రెస్టారెంట్స్ కోసం రూ.20వేలకు పైగా ఖర్చువుతుందని ఒక అంచనా. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సంక్రాంతి పేరు చెప్పి షాపింగ్స్ కోసం రూ.100కోట్ల నుంచి రూ.150కోట్ల వరకు వ్యాపారం జరిగినట్టుగా చెబుతున్నారు.