బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నల్లగొండ/ నల్లగొండ రూరల్: బడుగు, బలహీనవర్గాలకు మేలు జరిగే విధంగా బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో కూడా విడుదల చేశామని, రాహుల్‌గాంధీ చెప్పినట్లుగా ఎవరి వాటా ఎంత.. ఎవరి సంఖ్య ఎంత అనే విధంగా కార్యాచరణ చేపట్టే ఆలోచన చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి శనివారం నల్లగొండ పట్టణంలో సావిత్రిబాయి, జ్యోతిబాఫNలే విగ్రహాలను ఆవిష్కరించి అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. బీసీల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ప్రభాకర్ విమర్శించారు.
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 80 కోట్లతో గురుకుల భవనాలు ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు బీసీ జన గణనకు కృషి చేయాలని కోరారు.
ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం..
ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా 21 శాతం డీఏ ఇచ్చామని, రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించామని చెప్పారు. నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ‘రాజధాని’ఏసీ బస్, నాలుగు డీలక్స్, ఒక పల్లె వెలుగు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడుపుతామని అన్నారు. నల్లగొండ బస్టాండ్‌లో బస్సులను ప్రారంభించిన అనంతరం మంత్రులు బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు. నల్లగొండలో 20 ఎకరాల్లో నూతన బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా.. త్వరలోనే బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పొన్నం హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment