Elephant count for 3 days in south states from 17th May - Sakshi
Sakshi News home page

ఏనుగుల లెక్క తేలుద్దాం.. ఈ నెల 17వ తేదీ నుంచి...

Published Thu, May 11 2023 5:10 AM | Last Updated on Thu, May 11 2023 11:19 AM

Elephant count for 3 days from 17th of this month - Sakshi

సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ట్రాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 3 రోజులపాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. మన రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్‌ పార్క్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో లెక్కింపు చేపట్టనున్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. తమిళనాడు సరిహద్దుల నుంచి ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తుండటంతో వాటి కోసం చాలాకాలం క్రితం కౌండిన్య అభయారణ్యాన్ని నెలకొల్పారు. శేషాచలం అడవులు, ఎస్‌వీ నేషనల్‌ పార్క్‌లోనూ ఏనుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో సుమారు 175 ఏనుగులు ఉన్నట్టు అంచనా వేశారు. తాజా లెక్కింపు పూర్తయితే వాటి సంఖ్య పెరిగిందా.. తగ్గిందా అనేది తేలుతుంది. 

ఒకేసారి ఎందుకంటే..!
ఏనుగులు నీటి లభ్యతను బట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే అవి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రవేశించి అటూఇటూ తిరుగుతూ ఉంటాయి. దీంతో రాష్ట్రాల వారీగా లెక్కింపు చేపట్టినప్పుడు రెండుచోట్లా వాటిని లెక్కించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అటవీ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో ఒకేసారి లెక్కింపు జరపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, గోవా, మహారాష్ట్రలోని కొంత ప్రాంతంలో ఒకేసారి ఈ నెల 17, 18, 19 తేదీల్లో లెక్కింపు జరపనున్నారు. 

లెక్క.. పక్కా..!
ఇందుకోసం కర్ణాటక అటవీ శాఖ రూపొందించిన మోడల్‌ను అనుసరిస్తున్నారు. అక్కడ ఏనుగుల సంఖ్య వేలల్లో ఉండటంతో చాలా జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధానంలో మన రాష్ట్రంలో లెక్కింపు నిర్వహించడానికి అటవీ శాఖ సిద్ధమైంది. మొదటి రోజు 17వ తేదీన అటవీ ప్రాంతంలోని బ్లాకుల పరిధిలో బీట్ల వారీగా 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15 కిలోమీటర్లు తిరిగి లెక్కింపు జరపనున్నారు.

ఇందుకోసం బీట్ల వారీగా ఇద్దరు, ముగ్గురితో బృందాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు నిర్దేశించిన రెండు కిలోమీటర్ల ప్రాంతంలో తిరిగి ఏనుగుల గుంపులను బట్టి లెక్కింపు జరుపుతారు. మూడవరోజు చెరువులు, మైదానా­ల్లో నేరుగా ఏనుగుల గుంపుల వద్దకెళ్లి వాటి ఫొటోలు తీసి లెక్కిస్తారు. గుంపులో పెద్దవైన ఆడ, మగ ఏను­గులు.. ఆ తర్వాత పెద్దవైన మగ, ఆడ ఏనుగులు.. పిల్లలు, దంతాలు లేని ఏనుగులు (మఖనా), గుంపు నుంచి వేరుపడిన ఒంటరి ఏను­గులు­గా వాటిని వర్గీకరించి లెక్కింపు చేపట్టనున్నారు. 

ప్రణాళికాబద్ధంగా లెక్కింపు
దక్షిణాది రాష్ట్రాలతో కలిసి ఒకేసారి ఏనుగుల లెక్కింపును ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నాం. ఇందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేశాం. మూడు విధాలుగా లెక్కింపు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. – శాంతిప్రియ పాండే, ఏపీ సీసీఎఫ్‌ (వైల్డ్‌ లైఫ్‌), ఏపీ అటవీ శాఖ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement