పాపం గజరాజులు! విద్యుత్ షాక్‌లు, రైలు ప్రమాదాలు, విష ప్రయోగాలు.. | India Lost 494 Elephants In The Last Five Years Due To Accidents | Sakshi
Sakshi News home page

పాపం గజరాజులు! విద్యుత్ షాక్‌లు, రైలు ప్రమాదాలు, విష ప్రయోగాలు..

Published Tue, Jan 24 2023 9:09 AM | Last Updated on Tue, Jan 24 2023 12:31 PM

India Lost 494 Elephants In The Last Five Years Due To Accidents - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో గజరాజుల అసహజ మరణాలు ఇటీవలకాలంలో పెరిగిపోతున్నాయి. రైలు ప్రమాదాలు, విద్యుత్‌ షాక్, వేటాడటం, విషప్రయోగం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 494 ఏనుగులు మృత్యువాతపడినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యుదాఘాతం కారణంగా 2017–18 నుంచి 2021–22 వరకు అత్యధికంగా 340 ఏనుగులు మృతిచెందినట్లు తెలిపింది.

ఆ తర్వాత రైలు  ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మృతిచెందాయి. వేటాడి 41, విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపినట్లు వివరించింది. ఐదేళ్లలో అత్యధికంగా అసోంలో 121 ఏనుగులు వివిధ కారణాలతో మృత్యువాతపడ్డాయి. అతితక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది ఏనుగులు విద్యుత్‌షాక్‌తో మరణించాయి. ఏనుగుల దంతాల కోసం విషప్రయోగాలు చేస్తుండటం శోచనీయం. వివిధ ప్రాంతాల్లో గత ఐదేళ్లలో విషప్రయోగం ద్వారా 25 ఏనుగులను చంపేశారు. కేవలం అసోంలోనే విషప్రయోగం చేసి ఏకంగా 21 ఏనుగులను హతమార్చారు.  

విద్యుత్‌ షాక్‌ వల్లే ఎక్కువ.. 
ప్రధానంగా విద్యుదాఘాతం వల్లే ఎక్కువగా ఏనుగులు మరణిస్తున్నాయి.  
అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్‌ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. దీంతో ఆహారం, నీటి కోసం అడవి నుంచి బయటకు వస్తున్న ఏనుగులు విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందుతున్నాయి. ఐదేళ్లలో విద్యుత్‌ షాక్‌కు గురై 340 ఏనుగులు మరణించాయి.  
విద్యుత్‌ షాక్‌ నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్‌ కంచెలను తొలగించాలని అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌ ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
భూమిపైన విద్యుత్‌ లైన్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, అండర్‌ గ్రౌండ్‌ లేదా, స్తంభాలపై మాత్రమే విద్యుత్‌ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు వెల్లడించింది.  

రైలు ప్రమాదాల కారణంగా... 
రైళ్లు ఢీకొని కూడా ఎక్కువగానే ఏనుగులు మృతి చెందుతున్నాయి. రైలు ప్రమాదాలబారిన పడి ఐదేళ్లలో 80 గజరాజులు మరణించాయి.  
రైలు ప్రమాదాల వల్ల ఏనుగుల మరణాల నివారణకు రైల్వే బోర్డు, పర్యావరణ–అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. 
రైలు పైలెట్‌లకు పట్టాల చుట్టూ ఎక్కువ దూరం స్పష్టంగా కనిపించేలా ట్రాక్‌ వెంబడి చెట్లను తొలగించాలని, ఏనుగుల ఉనికి గురించి పైలెట్‌లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్‌ విభాగాలను ఆధునికీకరించాలని, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్‌ పాస్, ఓవర్‌ పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు.  
ఏనుగుల ఉనికి ఉన్న ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై అటవీ శాఖ ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, వన్యప్రాణుల పరిశీలకులు నిరంతరం పెట్రోలింగ్‌ చేయడం వంటి చర్యలను తీసుకుంటున్నారు.
ఏనుగుల సంరక్షణకు ఆర్థిక, సాంకేతిక సాయం 
ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో ఏర్పాట్లకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మనుషులు–ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడానికి ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో 32 ఎలిఫెంట్‌ రిజర్వ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జాతీయ రహదారులపై ఎకో బ్రిడ్జ్‌ల ఏర్పాటు ద్వారా వన్యప్రాణులు సురక్షితంగా రహదారులు దాటేలా కసరత్తు జరుగుతోందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రపంచ బ్యాంకు సహాయం చేయనుందని పేర్కొంది.
చదవండి: విదేశాలకు వలసల్లో మనమే టాప్‌.. దేశాన్ని వీడిన 1.80 కోట్ల మంది..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement