కుల గణనపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు | Cm Revanth Speech At The Caste Enumeration Awareness Meeting | Sakshi
Sakshi News home page

ఇదో మెగా హెల్త్ చెకప్.. కుల గణనపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Published Wed, Oct 30 2024 2:56 PM | Last Updated on Wed, Oct 30 2024 5:08 PM

Cm Revanth Speech At The Caste Enumeration Awareness Meeting

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. గాంధీ భవన్‌లో కుల గణనపై జరిగిన అవగాహన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్‌ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించుకున్నామని రేవంత్‌ అన్నారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత
కాంగ్రెస్ క్యాడర్, నేతలపై ఉంది. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని సూచిస్తున్నా. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అని రేవంత్‌ చెప్పారు.

‘‘దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలి. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు  అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

నవంబర్ నెలాఖరుకల్లా కులగణన పూర్తి చేయాలి: రేవంత్

ఇదీ చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త

గ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టేసింది. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారు.’’ అని రేవంత్‌ వివరించారు.

పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు. రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement