కలెక్టరేట్‌కు క్యూ కట్టిన వరద బాధితులు
నెల రోజులుగా తిరుగుతున్నా చలనం లేని సర్కారు
ఎన్టీఆర్ కలెక్టరేట్‌కు కుప్పలుగా దరఖాస్తులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు.
బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు. ఈ విషయాన్ని కలెక్టరేట్ వద్దకు వస్తున్న బాధితుల సంఖ్యే చెబుతోంది. నిత్యం వందలాది బాధితులు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. బాధితుల నుంచి గుట్టలుగుట్టలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. శనివారం నాడు కూడా కండ్రిక, వైఎస్సార్ కాలనీ, ఉడా కాలనీ, భవానీపురం ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో బందరు రోడ్డుపై ఎండలోనే చంటి పిల్లలతో సహా పడిగాపులుకాశారు.
చాలా సేపటి తర్వాత అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. అయితే, దరఖాస్తులో సచివాలయ నంబర్ తప్పనిసరిగా రాయాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. తమ ప్రాంత సచివాలయ కోడ్ తెలియక ఒకటికి రెండు సార్లు ఇంటికి, కలెక్టరేట్‌కు తిరిగారు. నెల రోజులుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ రూపాయి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు.
పరిహారం ఎందుకు జమ కాలేదో ఏ ఒక్కరూ చెప్పడంలేదని మండిపడుతున్నారు. వరదల్లో అన్నీ కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది, స్థానిక వీఆర్వోలు కలెక్టరేట్‌కు వెళ్లమని చెబుతున్నారే తప్ప సరైన కారణాలు చెప్పడం లేదని మండిపడుతున్నారు.
రీ సర్వే చేయాలి
ఎఫ్‌సీఐలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. హెచ్‌ఐజీ–2లో 235 ఫ్లాట్‌లో ఉంటున్నా. వరదలకు ఇల్లు మునిగిపోయింది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మోటార్, కారు, స్కూటర్ మొత్తం దెబ్బతిన్నాయి. రూ. 2 లక్షలకు పైగా నష్టం వచి్చంది. సర్వే టీం రెండు మూడు సార్లు వచ్చి రాసుకున్నారు.
వాళ్లేమి రాశారో తెలీదు. ఈ రోజుకు కూడా నాకు పరిహారం అందలేదు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించాను. కలెక్టర్‌ను కలిసేందుకు వస్తే అందుబాటులో లేరు. మా ప్రాంతంలో రీ సర్వే చేసి నష్టం వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. – వీవీ సూర్యనారాయణ రావు, హౌసింగ్ బోర్డు కాలనీ, భవానీపురం
Comments
Please login to add a commentAdd a comment