ప్రోటోకాల్ తుంగలో తొక్కి వెలగలేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు, సాగునీటి నిపుణుల విస్మయం
కనీసం 12 గంటల ముందు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు సమాచారం ఇవ్వాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చాటింపు వేయించాలి
పునరావాస శిబిరాలకు తరలించిన తర్వాతే గేట్లు ఎత్తాలి
శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామన్న వెలగలేరు డీఈ
వరద విజయవాడ చేరడానికి 20 గంటలు పడుతుందని చెప్పినట్లు వెల్లడి
లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు సమయం ఉన్నా ప్రభుత్వం అలసత్వం
చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పుతో శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తేయాలని ఆదేశం
ఈ చారిత్రక తప్పిదమే బుడమేరు విలయానికి కారణమంటున్న ఇంజనీర్లు, నిపుణులు
కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్
వరద వెనక్కి ఎగదన్నడంతో బీడీసీ కరకట్టకు గండి.. తరచూ లోతట్టు ప్రాంతాల మునక
రెండు ప్లాంట్ల నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: విజయవాడతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా బుడమేరుపై వెలగలేరు వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లను శనివారం అర్థరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తివేయడంపై రిటైర్డు ఈఎన్‌సీలు (ఇంజనీర్–ఇన్–చీఫ్), చీఫ్ ఇంజనీర్లు, సాగు నీటిరంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం విజయవాడలో జల ప్రళయానికి.. కనీవినీ ఎరుగని ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చెలగాటమాడేలా వ్యవహరించడంపై నివ్వెరపోతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల 30వతేదీ (శుక్రవారం), 31న (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత నెల 28న ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో శుక్రవారం పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు బుడమేరు ఉప్పొంగింది. శనివారం ఉదయానికి వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు దూసుకొచ్చింది.
బుడమేరు డైవర్షన్ ఛానల్ గుండా కృష్ణా నది వైపు పరుగులు తీసింది. ఎగువ నుంచి బుడమేరుకు భారీ వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి, ఎస్‌ఈ, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు శనివారం ఉదయమే సమాచారం ఇచ్చామని డీఈ మాధవ్ నాయక్ ‘సాక్షి’కి చెప్పారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరద విజయవాడ చేరడానికి 20 గంటల సమయం పడుతుందని కూడా చెప్పామన్నారు.
నిలువెల్లా నిర్లక్ష్యానికి తార్కాణం..
వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు దానికి దిగువన బుడమేరు పరీవాహక లోతట్టు ప్రాంతాల గ్రామాలు, విజయవాడలోని సింగ్ నగర్, కండ్రిక, పాత రాజరాజేశ్వరిపేట, పాయకాపురం తదితర కాలనీల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసేలా చాటింపు వేయించాలి. సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించాలి. ఆ తర్వాత గేట్లు ఎత్తడానికి వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బందికి అనుమతి ఇవ్వాలి. కానీ.. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది.
వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది పంపిన సమాచారంపై శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ కనీసం స్పందించలేదు. కృష్ణా, బుడమేరు ఒకేసారి ఉప్పొంగడం.. బుడమేరు నుంచి 60 వేల క్యూసెక్కులపైగా వరద పోటెత్తడంతో సీఎం చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పు ముంచుకొస్తుండటంతో శనివారం రాత్రి ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పు తప్పించడం కోసం వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించాలని రెగ్యులేటర్ సిబ్బందిని ఆదేశించింది.
విజయవాడలో జల ప్రళయం..
లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శనివారం ఎప్పటిలానే బుడమేరు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, విజయవాడ ప్రజలు నిద్రకు ఉపక్రమించారు. అనంతరం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లను ఎత్తేశారు. ఆదివారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులపై బుడమేరు వరద ఒక్కసారిగా విరుచుకుపడింది.
తేరుకునే లోపే బుడమేరు వరద చుట్టుముట్టి ఇళ్లను ముంచెత్తింది. జలప్రళయానికి దారి తీసింది. అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. చంద్రబాబు సర్కారు చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రళయం చోటుచేసుకుందని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు.
గేట్లు ఎత్తాలంటే ప్రోటోకాల్ ఇదీ
⇒ ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేయాలంటే సంబంధిత ప్రాజెక్టు ఎస్‌ఈ (సూపరిండెంట్ ఇంజనీర్), జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని ఆర్డీవో, ఆయా మండలాల తహసీల్దార్లకు కనీసం 12 గంటల ముందు సమాచారం ఇవ్వాలి.
⇒ ఇదే రీతిలో ప్రాజెక్టు ఉన్న జిల్లా ఎస్పీ, ప్రాజెక్టు దిగువ ప్రాంతాల పరిధిలోని డీఎస్పీ, సీఐలకు కూడా సంబంధిత ఎస్‌ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయాలి.
⇒ కలెక్టర్, ఆర్డీవోలు దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత తహసీల్దార్లను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఆయా ప్రాంతాల్లో చాటింపు వేయించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించాలి.
⇒ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించే ప్రక్రియ పూర్తయ్యాక గేట్లు ఎత్తాలి.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చెందిన ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేస్తూ 2021లో ఇచ్చిన ఉత్తర్వులు
ఆ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రాధాకృష్ణ.. వాటిపై స్టే ఇచ్చిన హైకోర్టు
రాధాకృష్ణకు రాసిచ్చారు..!
బుడమేరు డైవర్షన్ ఛానల్(బీడీసీ)లో ఏడాది పొడవున రోజూ కనీసం 2 వేల క్యూసెక్కుల నీరు ఉంటుంది. ఈ నేపథ్యంలో బీడీఎస్‌పై 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 1994లో జెన్‌కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
అయితే 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1,020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్‌కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు.
ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 1999 ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలవడానికి యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డంకిగా మారింది. దాంతో వరద వెనక్కి ఎగదన్నడంతో బీడీసీ కరకట్టకు గండిపడి తరచూ విజయవాడ లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి.
బుడమేరు వరదతో 2005లోనూ ఇదే రీతిలో విజయవాడ ముంపునకు గురైంది. ఈ క్రమంలో బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరించడం ద్వారా విజయవాడకు ముంపు ముప్పును శాశ్వతంగా తప్పించే పనులకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ పనులు చేపట్టడానికి వీలుగా 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ (ఎన్వోసీ)ని రద్దు చేశారు. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో బీడీసీ ఆధునికీకరణ పనులు ముందుకు కదల్లేదు. రాష్ట్ర విభజనకు ముందు నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు షరతులతో ఎన్‌వోసీని పునరుద్ధరించింది.
ఇక విభజన తర్వాత టీడీపీ సర్కారు రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునీకరణను అటకెక్కించేసింది. అనంతరం 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునీకరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా ఎన్‌వోసీ రద్దుపై స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వానికి చెప్పాం
శుక్రవారం బుడమేరు పరీవాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని మాకు ముందే తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు 45 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నంలోపే సమాచారం ఇచ్చాం. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తిన 20 గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని చెప్పాం. ప్రభుత్వ అనుమతితోనే శనివారం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశాం.
– మాధవ్ నాయక్, డీఈ, వెలగలేరు రెగ్యులేటర్
‘‘గత శనివారం ఉదయమే బుడమేరుకు ఎగువ నుంచి వరద ఉద్ధృతి ప్రారంభమైందన్నది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. కృష్ణా నదికి గరిష్ట ప్రవాహం వస్తుందన్నది కూడా తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. కానీ.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా హఠాత్తుగా వెలగలేరు గేట్లు ఎందుకు ఎత్తేశారు? ఎవరు ఎత్తమన్నారు? విజయవాడలో జల ప్రళయానికి ఇదే కారణం.
అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసింది. ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే దీనికి కారణం’’ ఉమ్మడి రాష్ట్రంలో పలువురు సీఎంల వద్ద సలహాదారులుగా (జలవనరులు) పనిచేసిన రిటైర్డు ఈఎన్‌సీల నిశ్చితాభిప్రాయం ఇది.
‘‘2005లో బుడమేరుకు 70–75 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. నాడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాక వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. అప్పటితో పోల్చితే ఇప్పుడొచ్చిన వరద తక్కువే. ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యకరం. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు హఠాత్తుగా ఎత్తేస్తే విజయవాడను బుడమేరు ముంచెత్తుతుందని, భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది?’’
కృష్ణా డెల్టాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజనీర్ సూటి ప్రశ్న
‘‘2009 అక్టోబర్ 2న శ్రీశైలానికి 25.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కృష్ణా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే. దాన్ని సమర్థంగా నియంత్రించి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరే వరదను 11.10 లక్షల క్యూసెక్కులకు తగ్గించగలిగాం. విజయవాడకు ముంపు ముప్పు తప్పించాం. దాంతో పోల్చితే ఇప్పుడు కృష్ణాకు, బుడమేరుకు వచ్చిన వరద తక్కువే. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా నివారించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం విజయవాడలో జల విలయానికి దారితీసింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడంలో ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ పనితీరు ఎంత దయనీయంగా ఉందో బహిర్గతమవుతోంది’’
2009లో కృష్ణా వరదలను సమర్థంగా నియంత్రించడంలో కీలక భూమిక పోషించిన రిటైర్డు ఈఎన్‌సీ
Comments
Please login to add a commentAdd a comment