వరద వస్తుందని చెప్పి ఉంటే జాగ్రత్త పడేవాళ్లం
ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు
వరద ఇంటిలోకి వచ్చేవరకూ మాకు తెలీదు
ఇంటిలోని సామాన్లు వరదపాలు
పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి
పాడైన ఆటోలు, బైక్‌లు, కార్లు, ఇతర వాహనాలు
ఇళ్లు దెబ్బతిన్నాయి.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న వరద బాధితులు.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతో తీవ్రంగా నష్టపోయిన 1.45లక్షల కుటుంబాలు
వారంరోజుల తరువాత కూడా ఇంకా వరద ముంపులోనే 7లక్షల మంది
పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు.. అందరూ వరద బాధితులే.. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల నుంచి రూ.30లక్షల వరకు నష్టం
రూ.10వేల కోట్లు మేర నష్టపోయిన బాధితులు
బాధితులకు పునరావాస కేంద్రాలు లేవు.. బాబుకే కలెక్టరేట్‌లో పునరావాసం...
సర్వం కోల్పోయాం
ఏడాది కిందటే సింగ్‌నగర్ తోట వారి వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని మారాం. గత ఆదివారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదకు ఇంట్లో సామాన్లు అన్ని పాడయ్యాయి. పదేళ్లుగా సంపాదించిన వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయి. మా అమ్మాయి, అబ్బాయి సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. వరద వస్తుందని ముందుగా చెబితే వీలైనంతవరకు జాగ్రత్త పడేవాళ్లం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్వం కోల్పోయాం.
– రాధాకృష్ణ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి, తోటవారి వీధి, సింగ్‌నగర్
అజిత్‌సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై రిక్షాలో సామాన్లు తరలిస్తున్న గుండు కృష్ణ ఓ ఆటో డ్రైవర్. మరి ఇంటి సామాన్లు రిక్షాలో ఎందుకు తీసుకువెళుతున్నారనే కదా మీ సందేహం? విజయవాడలోని కండ్రికలో నివసించే కృష్ణ, ఆయన సోదరుడు ఫైనాన్స్‌లో తీసుకున్న రెండు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బుడమేరు వరద ముంచెత్తడంతో రెండు ఆటోలు వరదలో పూర్తిగా మునిగి దెబ్బతిన్నాయి. ఆటోకు నెలకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.20 వేలు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీ చెల్లించాలి.
ఆటోలను బాగు చేయించాలంటే ఆటోకు రూ.లక్ష చొప్పున మొత్తం రెండు లక్షలు అవుతుందంటున్నారు. ఇన్సూరెన్స్ రాదని చెప్పారు. ఇంట్లో వంట సామాన్లు, ఫ్రిజ్, గ్యాస్ స్టౌ, పిల్లల పుస్తకాలు, ఫర్నిచర్ అన్నీ దెబ్బతిన్నాయి. మళ్లీ అవి కొనాలంటే రూ.50 వేల దాకా ఖర్చవుతుంది. వంట దినుసులైతే తడిసి ముద్దయి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇంట్లో కరెంటు వైరింగ్ దెబ్బతింది. ఇల్లు కూడా మరమ్మతులకు గురైంది. ఇవన్నీ బాగు చేయించుకోవాలంటే కనీసం మరో రూ.లక్ష అవుతుంది. ఆటో నడిపి రోజూ రూ.వెయ్యి దాకా సంపాదించేవారు. ఇప్పుడు సంపాదన లేదు.
వరద తగ్గాక ఆటోలు బాగు చేయించుకుని రోడ్డెక్కితేనే మళ్లీ ఉపాధి లభించేది! అదెన్ని రోజులు పడుతుందో తెలియదు. కనీసం నెల రోజుల పాటు ఉపాధికి దూరం కానున్నాడు. మరోవైపు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీలు కట్టాలి. ఇలా కృష్ణ కుటుంబానికి దాదాపు రూ.నాలుగు లక్షల దాకా నష్టం వాటిల్లింది. కేవలం వరద వస్తుందని ప్రభుత్వం ముందుగా చెప్పకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా అంత నష్టపోయింది. అదే ప్రభుత్వం అప్రమత్తం చేసి ఉంటే కనీసం ఇంట్లో ముఖ్యమైన సామాన్లు, పిల్లల పుస్తకాలు, మరికొన్ని వస్తువులను రెండు ఆటోల్లో తరలించి ఈ గండం నుంచి గట్టెక్కేవాళ్లమని కృష్ణ ఆక్రోశిస్తున్నాడు.
– లబ్బీపేట (విజయవాడ తూర్పు)
సింగ్‌నగర్ డాబా కొట్ల జంక్షన్‌లో రెండంతస్తుల ఇల్లు నిర్మించుకున్న వ్యాపారి కె.నాగేశ్వరరావును పలకరించగానే ఆయన ఆవేదన కట్టలు తెంచుకుంది. ‘ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద నీరు ముంచెత్తడంతో మొదటి అంతస్తుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాం. ఇంటి ముందున్న మూడు కార్లు వరద నీటిలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంట్లోకి నీళ్లొచ్చి సామాన్లు అన్నీ తడిసిపోయాయి.
మా అల్లుడు రూ.5 వేలు డబ్బులిచ్చి సోమవారం ఉదయం పడవ తేవడంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఆరు రోజులుగా ఓ హోటల్‌లో ఉంటున్నాం. మా కుటుంబానికి రూ.25 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాకు ఏం సాయం చేస్తుంది..? వరద వస్తుందని మాకు ముందుగానే చెప్పి ఉంటే ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ప్రభుత్వం ప్రజల పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించలేదు’ అని నిర్వేదం వ్యక్తం చేశాడు.
సోమవారం వరద ముంపులోనే విజయవాడలోని కండ్రిక
నిర్లక్ష్యం ఖరీదు.. 60 నిండుప్రాణాలు
విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 1.45 లక్షల కుటుంబాల దుస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏకంగా 7 లక్షల మంది వరద కష్టాలివి! బుడమేరుకు భారీ వరద వస్తోందని తెలిసి కూడా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఫలితం ఇదీ. ఇందుకు సామాన్యులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికి దాదాపు 60 నిండు ప్రాణాలు బలయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారమే 1.45 లక్షల కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదలు ముంచెత్తిన వారం రోజుల తరువాత కూడా ఏకంగా 7 లక్షల మంది వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇక 1.45 లక్షల కుటుంబాలకు కలిగిన నష్టం ఎంతన్నది అంచనాలకే అందడం లేదన్నది కఠోర వాస్తవం. లక్షల ఇళ్లు వరదకు దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయించుకునేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వరదకు ఇళ్లల్లో వంట సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది.
గ్యాస్ స్టౌ, వంట సామాన్లు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. లక్షలాది ఇళ్లల్లో పిల్లల పుస్తకా>లు, సర్టిఫికెట్లు తడిసిపోయాయి. ఎంతోమంది సర్టిఫికెట్లు, బ్యాంకు పుస్తకాలు, దస్తావేజులు వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, సరుకు రవాణా వాహనాలు, ఇతర వాహనాలు వారం రోజులుగా వరద ముంపులోనే ఉండటంతో బురద పేరుకుపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి.
ప్రకృతి వైపరీత్యంతో దెబ్బతిన్న ఆ వాహనాలకు బీమా వర్తిందని బీమా కంపెనీలు ఇప్పటికే తేల్చి చెప్పేశాయి. ‘మా పెంకుటిల్లు వరదకు మునిగిపోయింది. వరద తగ్గిన తరువాత కరెంట్ వైరింగ్ పూర్తిగా మార్పించుకోవాలి. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. వైరింగ్‌కు కనీసం రూ.50 వేలు అవుతుంది’అని రాజీవ్‌నగర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ తన కష్టాలను చెప్పుకొచ్చారు. ఇక రోజు కూలీలు, కార్మికులకు ఇప్పటికే వారం రోజులుగా ఉపాధి లేదు.
మరో 15 రోజుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో సంపాదన లేక ...చేతిలో డబ్బులు లేక పేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సగటున ఒక్కో కుటుంబానికి కనీసం రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సగటు అంచనాల ప్రకారం 1.45 లక్షల కుటుంబాలకు రూ.10 వేల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందన్నది ప్రాథమిక అంచనా.
చంద్రబాబుకే పునరావాసం
ఏకంగా 7 లక్షల మందిని వరదకు వదిలేసిన ప్రభుత్వం సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబానికి మాత్రం పునరావాసం కల్పించింది. నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు కరకట్ట బంగ్లాను వరద ముంచెత్తనుందనే హెచ్చరికలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ ఇంటిని కాపాడేందుకు కనీసం అప్రమత్తం చేయకుండా వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు అర్థరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తేశారు. అంతకుముందే చంద్రబాబు కుటుంబం హుటాహుటిన బంగ్లాను ఖాళీ చేసేసింది.
చంద్రబాబు స్వయంగా విజయవాడ కలెక్టరేట్‌కు మకాం మార్చారు. అన్ని సౌకర్యాలతో కూడిన తన వాహనాన్ని అక్కడే పార్క్ చేయించుకున్నారు. వారం రోజులుగా అన్ని సౌకర్యాలతో అక్కడే ఉంటున్నారు. ఇక లోకేశ్ కూడా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు షిఫ్ట్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నివాసానికి తరలి వెళ్లిపోయారు. వరదలతో ఏమాత్రం ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కుటుంబాన్ని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించిందన్నది స్పష్టమవుతోంది.
బొండా ఉమా బిస్కట్ ప్యాకెట్లిచ్చి వెళ్లిపోయారు..
‘కండిగ్రలో ఓ అపార్ట్మెంటులో వాచ్‌మేన్‌గా పని చేస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్ చిన్న గదిలో మా కుటుంబం ఉంటోంది. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న మా గది వరదలో మునిగిపోయింది. ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. కనీసం వంటపాత్రలు కూడా లేవు. మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది.
ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఆ వీధిలో తెలిసిన వారి డాబా మీద ఉండమని ఆశ్రయం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నాం. ఎమ్మెల్యే బొండా ఉమా రూ.5 బిస్కట్ ప్యాకెట్లు పంచి వెళ్లిపోయారు. వాటితో కడుపు నింపుకోవాలా? ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం’
– వెంకటరావు, వాచ్‌మేన్, కండ్రిక
Comments
Please login to add a commentAdd a comment