AP Floods: ఎటు చూసినా ఆక్రందనలే | Poor people of the flooded areas are in terrible conditions | Sakshi
Sakshi News home page

AP Floods: ఎటు చూసినా ఆక్రందనలే

Published Mon, Sep 9 2024 5:04 AM | Last Updated on Mon, Sep 9 2024 9:55 AM

 ఆదివారం విజయవాడలోని జక్కంపూడి కాలనీలో ఒక స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్న ఆహారం కోసం వరద బాధితుల అవస్థలు

ఆదివారం విజయవాడలోని జక్కంపూడి కాలనీలో ఒక స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్న ఆహారం కోసం వరద బాధితుల అవస్థలు

ప్రభుత్వ సాయమెక్కడ?.. దారుణ పరిస్థితుల్లో వరద ముంపు ప్రాంత పేదలు

పనులు లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక సతమతం 

పిల్లల కోసం పాల ప్యాకెట్‌ కూడా కొనలేని దుస్థితి 

పత్తా లేని ప్రభుత్వం.. సహాయం ఎండమావే 

దాతల సాయంపైనే ఆధారపడి జీవిస్తున్న వైనం 

ఆదుకోవాలంటూ బంధువులు, స్నేహితులకు ఫోన్లు 

వారం దాటిపోయినా లోతట్టు కాలనీల వైపు తొంగిచూడని చంద్రబాబు సర్కార్‌  

జీవనోపాధిని దెబ్బతీసింది
శనివారం అందిన పింఛను డబ్బుల్లో రూ.3,500 పెట్టి సిగరెట్లు, ఇతర సరుకులు తెచ్చి షాపులో పెట్టా. ఆదివారం తెల్లవారేసరికి నాలుగు అడుగుల నీరు రావడంతో షాపులో ఉన్న సరుకులన్నీ కొట్టుకుపోయాయి. షాపు నడిస్తేనే మా జీవనం సాగుతుంది. షాపులో సరుకుల్ని తీసుకునేందుకు మూడో అంతస్తు నుంచి కిందకు దిగలేక.. ఒకవేళ దిగినా నీటి వడిలో కొట్టుకుపోతాననే భయంతో రాలేకపోయా. కనీసం ముందురోజే మాకు సమాచారం ఇస్తే.. కనీసం కొంతమేరైనా నష్టాన్ని నివారించుకోగలిగే వాడిని. మాలాంటి చిరు వ్యాపారులను ఎవరు ఆదుకుంటారు? 
– ఆర్‌.కొండలరావు, దివ్యాంగుడు, వైఎస్సార్‌ కాలనీ

పదేళ్ల కష్టం వరద పాలైంది
పదేళ్ల కష్టాన్ని వరద ఎత్తుకుపోయింది. వైఎస్సార్‌ కాలనీలోని క్రీడా మైదానం వద్ద చిన్న దుకాణంలో చెప్పులు, దుస్తుల వ్యాపారం చేసుకుంటున్నాను. గత శనివారం మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో షాపులో ఉన్న చెప్పులు, దుస్తులను రెండు అడుగుల ఎత్తులో పెట్టుకున్నాను. తెల్లవారేసరికి షాపు మొత్తం నీటిలో మునిగిపోవడంతో మొత్తం వరద పాలైంది. మళ్లీ తేరుకోవడానికి కనీసం మూడు నెలలైనా సమయం పడుతుంది. ఈలోగా బతుకు సాగించేదెలా?    
 – కరీముల్లా, వైఎస్సార్‌ కాలనీ

‘కట్టుకోవటానికి బట్టల్లేవు. మందులు కొందామన్నా డబ్బుల్లేవు. ఇళ్లల్లోని సామగ్రి లేదు. పిల్లల పుస్తకాలు కొట్టుకుపోయాయి. ఏ అవసరాలు తీరాలన్న కనీస నగదు అందుబాటులో ఉండాలి. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అందుకే.. తక్షణ సాయం అందించాలి. ప్రభు­త్వం ఇచ్చే ఆహారం మా కాలనీలోకి రావటం లేదు. మేమెలా బతకాలి’ అంటూ ఆంధ్రప్రభ కాలనీకి చెందిన కనకదుర్గ విలపిస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు: వారు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు. ఏరోజుకారోజు కూలికి పోతే కానీ ఐదు వేళ్లూ నో­ట్లోకి పోవు. ఇలాంటి వారిని వరద ముంచింది.. దీనికంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకా ముంచుతోంది. విజయవాడను వరద ముంచెత్తి వారం దాటిపోయి­నా లోతట్టు కాలనీల ప్రజల వైపు ప్రభుత్వం తొంగిచూస్తే ఒట్టు. ప్రధాన రోడ్లలో ఉన్నవారికి సాయం చేస్తున్నట్టు షో చేస్తున్న సర్కారు పెద్దలు లోతట్టు కాలనీల పేదలను పూర్తిగా వరదకు వదిలేశారు. దీంతో దారుణ పరిస్థితుల్లో ఈ కాలనీల్లో పేదలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. 

వారానికి పైగా పనులు లేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్నా­రు. పసిపిల్లలకు పాలు పట్టడానికి పాల ప్యాకెట్‌ కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వ సా­యం అందకపోవడంతో దా­తల సహాయంపైనే ఆధారపడి బతుకీడుస్తున్నారు. యజమానులు అద్దె ఇంటిని ఖాళీ చేయమంటారే­మోనని కలత చెందుతూ సాయం చేయాలంటూ బంధువులు, స్నేహితులను అర్థిస్తున్నారు. ఇ­లాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని బాధి™­è ులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

విజయవాడలో వరదలకు పేదల జీవితాలు చిన్నాభిన్న­మయ్యాయి. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. వారం రోజులకు పైగానే జలదిగ్భందంలో ఉండిపోవడంతో పూట గడవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు పడుతున్నారు. బయట కూడా అప్పు పు­ట్ట­డం లేదు. దాతలు పంచే ఆహారాన్ని పిల్లలకు పెట్టి పెద్దలు పస్తులుంటున్నారు. దాతల ఆహార పంపిణీ కూడా నిలిచిపోతే తమను ఆదుకునేవారెవరని పేద కుటుంబాలు చింతిస్తున్నాయి. ముంపు బాధితులను తక్షణ సాయంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తోంది.  

కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు.. 
విజయవాడ లక్షలాది మంది ముంపు బారిన పడ్డారు. వీరు గత 8 రోజులుగా చుట్టూ నీళ్లను తప్ప వేరే ప్రపంచాన్ని చూడలేదు. ముంపునకు గురైన భవానీపురం, సింగ్‌నగర్, కండ్రిక, పాయకాపురం, మిల్క్‌ ఫ్యాక్టరీ, చిట్టినగర్, వైఎస్సార్‌ కాలనీ ఇలా వివిధ ప్రాంతాల్లో తక్కువ అద్దెకు ఇళ్లు దొరుకుతాయి.  నిర్మాణ రంగం, ఆటోనగర్‌ కారి్మకులు, ఆటో, రిక్షావాలాలు, ఇతర రోజువారీ కూలీ పనులపై ఆధారపడ్డ పేదలు ఇక్కడే నివసిస్తున్నారు. 

పగబట్టినట్టు వరద ప్రభావం ఈ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. వరద నీరు ఇంట్లో చేరి కట్టుబట్టలు మినహా ఏ ఒక్క వస్తువు పనికొచ్చే పరిస్థితిలో లేవు. దీంతో ఇంట్లో వంట సామాగ్రి, నిత్యావసరాలు, దుస్తులు ఇలా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయాల్సి ఉంది.  వారం రోజులుగా పని లేకపోవడం.. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో పాడై­న వస్తువులన్నింటినీ కొనాలంటే వేలల్లో ఖ­ర్చు అ­వుతుంది. అంత మొత్తం ఇప్పడు ఎక్కడ నుంచి తేవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇప్పటికీ చివరి కాలనీల్లో ఆకలి కేకలు.. 
నందమూరి నగర్, భరతమాత కాలనీ, ఉడా కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ, ఇందిరానాయక్‌ నగర్, రాజీవ్‌ కాలనీ, శాంతి నగర్, ప్రశాంతి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఊర్మి­ళా నగర్, పాయకాపురం, కండ్రిక, పాత రాజీవ్‌ న­గర్, తదితర ప్రాంతాల్లో ఆదివారం కూడా నడుములోతు నీరు ఉంది. ఇప్పటికీ ఈ కాలనీలకు తాగు­నీరు, ఆహారం అందడం లేదు.  స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తొంగి చూ­డ­టం లేదు. 

నీట మునిగిన ఇంటి నుంచి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూపించకపోవడంతో మేడలు, మిద్దెలపైనే టార్ఫాలిన్లు కప్పుకుని జీవిస్తున్నారు. ప్రచార యావే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వ పెద్దలు లోతట్టు ప్రాంతాలను గాలికొదిలేశారు. దీంతో కనీసం ఆహారం, తాగునీళ్లు కూడా దక్కక పస్తులుండాల్సిన దుస్థితి. చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాల్లోనివారు వరద నీటిలోనే కి.మీ కాలినడకన వచ్చి రోడ్లపై దాతలు ఇచ్చే ఆ­హార పొట్లాల కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది.    


అమ్మో.. అద్దె.. 
విజయవాడ లోతట్టు కాలనీలో వరదబారిన పడ్డవారిలో పేదలే అత్యధికం. వీరంతా కూలి పనులు చేసుకుంటూ అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. ఇప్పుడు వరదలతో పనులు లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఈ నెల అద్దె కట్టడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా 1న అద్దె కోసం యజమాని ఇంటికి వస్తే.. ఈసారి మాత్రం తెల్లారేసరికే వరద ముంచెత్తింది. దీంతో అద్దె చెల్లించకపోతే యజమానులు ఇళ్లు ఖాళీ చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ప్రతి నెలా వచ్చే ఆదాయంలో 40 శాతం అద్దెకే చెల్లించాల్సి వస్తోంది. 



‘ఇంటి యజమానికి వరద వచ్చిందని చెబితే ఆలస్యంగానైనా అద్దె ఇమ్మనే చెబుతారు. ఊరికే ఎందుకు వదులుకుంటారు? మాకేమో పనులు లేవు. తిండి మాట దేవుడెరుగు.. అద్దె కట్టకపోతే ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేసి రోడ్డున పడాలి. దీనికి తోడు మమ్మల్ని నిండా ముంచిన ప్రభుత్వం ఆలస్యంగానై కరెంటు బిల్లు కట్టమంటుందే కానీ మాఫీ చేస్తామనట్లేదు’ అంటూ వరద బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బంధువులకు భారంగా మారి.. 
వరద ముంపు పూర్తిగా తగ్గనప్పటికీ చాలా మంది నీటిలో నానుతున్న తమ ఇళ్లను చూసుకునేందుకు తిరిగి వస్తున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆశ్రయం పొందుతున్నవారు.. ఎక్కువ రోజులు ఉండి భారంగా మారుతున్నామని బాధపడుతున్నారు. తమ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోయినప్పటికీ తమ ఇంటికి వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్లలో చిరుజీవులు, ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు.

వర్షాలతో పెరిగిన కష్టాలు
బుడమేరు వరద కొంతమేర తగ్గిందని భావిస్తున్న తరుణంలో వర్షాలు కురుస్తుండటంతో ముంపు బాధితుల కష్టాలు మరింత పెరిగాయి, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వరద ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అర్థంకాక గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పలు కాలనీలకు తాగునీటి సరఫరా జరగటం లేదు. 

విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. వరదతో వాహనాలు దెబ్బతిన్నాయి.. పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అలస్యమైతే వాహనాలు మరింత దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. వ్యర్థాలు పేరుకుపోయి వ్యాధులు ప్రబలుతున్నాయని కన్నీరుపెడుతున్నారు.

పేదలను దోచుకుంటున్న ప్రభుత్వం
ముంపు ప్రాంతాల్లో మొబైల్‌ కూరగాయల మార్కెట్‌లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వారం రోజులుగా ఉపాధి లేని పేదల దగ్గర వాటిని కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న వాస్తవాన్ని విస్మరించింది. ఉచితంగా అందించాల్సిన కూరగాయలకు రేట్లు పెట్టి మరీ విక్రయిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. వర్షాలకు పాడైపోయిన కూరగాయలను అంటగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని చెబుతున్నా అధికార పార్టీకి చెందిన చోటా నాయకులకే అందుతున్నాయని విమర్శిస్తున్నారు.  

ఇప్పటివరకు ప్రభుత్వం ఏ సాయం చేయలేదు.. 
వరద వస్తోందని ప్రభుత్వం కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. ముందే చెప్పి ఉంటే మా చావేదో మేం చచ్చే వాళ్లం. మూడు రోజుల పాటు డాబా­పైనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ వచ్చి ఆహారం, నీళ్లు ఇవ్వలేదు. ఆకలితో అలమటించి చనిపోతామని నడుము లోతు నీటిలోనే భార్య, కూతురితో సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాను. ప్రస్తుతం అక్కడే ఉన్నాం. ఇప్పటివరకూ ప్రభుత్వం ఏ సాయం ప్రకటించలేదు.   
– వి. విజయ్‌కుమార్, పాత రాజీవ్‌నగర్‌

తక్షణ సాయం కింద రూ.10 వేలు ఇవ్వాలి..  
కూలిపనులకు వెళితే రోజుకు రూ.500­–­700 వచ్చేది. వరద మొద­లైనప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యా­ను. దాతలు ఇచ్చే ఆహారంతోనే పూట గడుస్తోంది. ఇంట్లోకి వరదనీరు చేరి వస్తువులన్నీ పాడైపోయాయి. ప్రతి దానికీ డబ్బు కావాలి. ప్రభుత్వం వెంటనే రూ.10 వేలు తక్షణ సాయం ఇవ్వాలి. వరద నష్టం అంచనా వేశాక పరిహారం అందించి ఆదుకోవాలి. లేదంటే మాలాంటి పేదలు జీవనం సాగించలేరు. 
–సుబ్బారావు, ఎన్‌ఎస్‌సీ బోస్‌ కాలనీ

ఒక్క అధికారి కూడా మా దగ్గరకు రాలేదు..  
వరద వచ్చి వారం దాటింది. ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వ అధి­కారి మా ఇళ్ల వైపు రా లేదు.  కాలనీలో లోపలికి వచ్చి అన్నం మెతుకూ పచలేదు. మెయిన్‌ రోడ్లలో పంచుతుంటే అక్కడకు పోయి ఆహా­రం కోసం యుద్ధం చేశాం. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి సాయం ఊసే లేదు.  
– కొరివి లక్ష్మి, కండ్రిక 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement