పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు
మొన్న 32.. నిన్న 15.. మొత్తం 47
వరదలో చిక్కుకుని నీరు, తిండి లేక తనువు చాలిస్తున్న అభాగ్యులు
ఆదుకునే దిక్కులేక ఇళ్లలోనే కొందరు తనువు చాలింపు
తప్పించుకోబోయి నీటిలో గల్లంతై మరణించినవారు మరికొందరు
మునిగిన ఇళ్ల గోడలపై వేలాడుతున్న అనాథ మృతదేహాలు
అనాథగా పడి ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన బలగాలు
వరదలో ఇలా చనిపోయి.. లెక్క తేలని వారు ఇంకెందరో..
దొరికిన మృతదేహాలు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు
గల్లంతైన వారి కోసం మార్చురీలో కుటుంబ సభ్యుల వెదుకులాట
కుళ్లిన మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరవుతున్న బంధువులు
వాంబే కాలనీ జీ బ్లాక్.. 4 రోజులుగా వరద నీరు చుట్టుముట్టింది.. బయటకు వచ్చే అవకాశమే లేదు.. ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి.. చాలా మందికి తినడానికి తిండి ఏమీ లేదు.. వీరిలో 78 ఏళ్ల రాజశేఖర్ అనే వృద్ధుడు కూడా ఒకరు.. పాస్టర్‌గా పని చేస్తున్న ఇతను తన భార్య కమలమ్మతో కలిసి జీవిస్తున్నాడు.. వయసు పైబడిన ఇద్దరూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. పూట పూటకూ మందులు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఒక్క పూట ఆహారం లేకపోతే షుగర్ స్థాయి తగ్గి నీరసించే వారు.. వరద కారణంగా 2 రోజుల పాటు ఏమీ తినకుండా ఉండిపోవాల్సి వచ్చింది. తాగేందుకు మంచి నీళ్లు లేని దయనీయ స్థితి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఉన్నట్లుండి రాజశేఖర్ తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం ఆహారం, నీరు అందించి ఉంటే బతికి ఉండే వారని చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకుని ఇలా ఎందరో అర్ధంతరంగా తనువు చాలించడం అందరి హృదయాలను కలిచివేస్తోంది.
వాంబే కాలని నుంచి సాక్షి ప్రతినిధి/ సాక్షి నెట్‌వర్క్ : ఆకలితో చనిపోవటం అనేది ఇటీవల కాలంలో మన ప్రాంతంలో ఎప్పుడూ వినలేదు. అంధ్ర అన్నపూర్ణగా పిలిచే కృష్ణా డెల్టాలో అకలి చావు సంభవించడం యావత్ రాష్ట్రాన్ని విస్మయానికి గురి చేస్తోంది. బుడమేరు వరదను అంచనా వేయడంలో, ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. మంగళ, బుధవారాల్లో తిండి, నీరు లేక చనిపోయిన వారే ఎక్కువ. పాస్టర్ మృతి గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఇందిరానాయక్ నగర్‌లో ఓ మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు చెప్పారు. పాముల కాలువ వద్ద పడవ బోల్తా పడి గల్లంతైన పోతుల దుర్గారావు బుధవారం శవమై కనిపించాడు.
పెరుగుతున్న మరణాల సంఖ్య
వరద తగ్గు ముఖం పట్టే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. గల్లంతైన వారి లెక్క తేలటం లేదు. బంధువుల అచూకి తెలియక పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వీరి గోడు మాత్రం ఆలకించడం లేదు. మంగళవారం వరకు 32 మంది మృతి చెందినట్లు వెల్లడికాగా, బుధవారం మరో 15 మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో మృతుల సంఖ్య 47కు చేరింది. ఇంకా పలు మృతదేహాలు నీటిలో తేలియాడుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నప్పటికీ వాటి లెక్క తేలడం లేదు. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఎవరూ వెళ్లలేదు.
ఆ ప్రాంతంలో పరిస్థితి ఏమిటో తెలియదు. ఇంకెన్ని శవాలు బురదలో ఉన్నాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి బుధవారం సాయంత్రం వరకు 22 మృతదేహాలు వచ్చాయి. 11 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఇందులో ఆరు మృతదేహాలు కుళ్లిపోయి, పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. కాగా, పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను బంధువులు ప్రైవేటు అంబులెన్స్‌లలోనే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయలేదు.
తమవారి ఆచూకీ కోసం..
వరదలో చాలా మంది కొట్టుకుపోయారు. నాలుగు రోజులు గడిచినా వారి ఆచూకీ లభించలేదు. అయితే మార్చురీలో కొన్ని మృతదేహాలు ఉన్నాయనే విషయం తెలియడంతో గల్లంతు అయిన వారి బంధువులు పెద్ద సంఖ్యలో మార్చురీకి క్యూ కట్టారు. ‘నాలుగు రోజుల క్రితం మా అన్న పోలినాయుడు పనికి వెళ్లి వస్తూ.. వరదలో కొట్టుకుపోయాడు. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకు వెళ్లినా పట్టించుకోలేదు. మా కుటుంబ సభ్యులం, మా ప్రాంత వాసులం వెతుకుతున్నాం.
అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగైతే ఎలా?’ అని న్యూరాజరాజేశ్వరరావుపేటకు చెందిన కరుభుక్త సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. వరద మృత్యురూపంలో కబళించిన వారందరి మృతదేహాలను మార్చురీలో ఉండటంతో తమ వారిని గుర్తించేందుకు వందల సంఖ్యలో ముంపు ప్రాంత ప్రజలు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు.
అక్కడ కుళ్లి ఉన్న తమ వారి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటి ముందే వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడుస్తాడని ఊహించలేదంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న దుర్గారావు మేనత్త అమ్మడమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలిసి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామని, ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రోడు ఇంటి ముందే వరదలో కొట్టుకు పోయి మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద నీటిలో కొట్టుకుపోయి.. ఆచూకీ లభించని వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి వచ్చి తమ వారి మృతదేహాలేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. అక్కడ కుళ్లి, ఉబ్బిపోయి ఉన్న మృతదేహాలను ఆతృతతో పరిశీలిస్తున్నారు. వారిలో తమ వారు లేక పోవడంతో వెనుతిరుగుతున్నారు. అక్కడ ఉన్న అంబులెన్స్‌ల వారిని, పోలీసులను ఆరా తీస్తున్నారు.
ఇలా సింగ్‌నగర్, పాయకాపురం, ప్రకాష్‌నగర్ ప్రాంతాలతో పాటు, వైఎస్సార్‌కాలనీ ప్రాంతాల నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. డీ కంపోజ్ అయిన మృతదేహాలు చాలా వరకు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. విపరీతమైన దుర్వాసన వస్తున్నప్పటికీ, వరదలో కొట్టుకుపోయిన వారి కుటుంబ సభ్యులు వాటిని వెళ్లి పరిశీలిస్తున్నారు.
అడుగు కదలని పరిస్థితి...
అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.. మూడు రోజులుగా మృతదేహం నీళ్లలోనే తేలియాడుతున్న దుస్థితి.. వ్యక్తి గల్లంతై నాలుగు రోజులు గడుస్తున్నా.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రాథేయపడుతున్నా, అధికారులు.. ప్రభుత్వం నుంచి కనీస సాయం కరువైంది. ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు ఉన్నా.. కేవలం అలంకారప్రాయమే. సింగ్‌నగర్ పరిధిలోని నందమూరినగర్, ఇందిరానాయక్‌నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో తమ వాళ్ల కోసం వెతుకుతున్న దృశ్యాలు కంట నీరు తెప్పిస్తున్నాయి.
చెట్టుకొకరు.. పుట్టకొకరు..
తెల్లారేసరికి ఒక్కసారిగా వరద ముంచేసింది. ఎటు వెళ్లాలో తెలియలేదు. ఇంత ఉధృతంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు. పోనీ వరద ముంచెత్తుతున్నప్పుడైనా బయటకు వద్దామంటే అంత సమయం లేదు. అతికష్టం మీద వచ్చినా ఎక్కడికెళ్లాలో, ఎక్కడుండాలో తెలియదు. సర్కారు ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇన్ని ఇబ్బందుల మధ్య దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు తమ ఇళ్లలోనే ఉండిపోయారు. వారిలో వృద్ధులున్నారు. చిన్న పిల్లలున్నారు.
అనారోగ్యం పాలైన వారున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారున్నారు. వారిని ఎవరూ పట్టించుకోలేదు. కనీసం మందులు సమకూర్చలేదు. తాగునీరు, ఆహారం లేక, ఆకలితో, అనారోగ్యంతో ఎంతో మంది అభాగ్యులు ఇళ్లలోనే ప్రాణాలు విడిచారు. మరికొందరు సాయం కోరేందుకు, అపాయం నుంచి తప్పించుకునేందుకు బయటకు వచ్చి వరద నీటిలో కొట్టుకు పోయారు. అలాంటి వారి మృతదేహాలు చెట్టుకొకటి, పుట్టకొకటిగా వేలాడుతున్నాయి.
సింగ్‌నగర్ ప్రాంతంలోని ఇందిరానాయక్ నగర్‌లో మృతదేహం ఉందని స్ధానికుల ద్వారా తెలుసుకున్న ‘సాక్షి’ ఆ సమాచారాన్ని సహాయక చర్యల కోసం వచ్చిన జాతీయ విపత్తు నిర్వహణ బలగాల(ఎన్‌డీఆర్‌ఎఫ్)కు తెలియజేసింది. సాయిబాబా గుడి వీధిలో ఇంటి గోడపై అనాథగా పడి ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించింది. వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బోటు సాయంతో ఒడ్డుకు చేర్చింది. అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తరలించారు.
ఇలా ఎవరూ గుర్తించని మృతదేహాలు ఆ వరదలో ఇంకా చాలానే ఉన్నాయి. ముంపు కాస్త తగ్గుముఖం పట్టడంతో అవన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అంతిమ యాత్రకు కూడా నోచుకోకుండా, కనీసం బయటకుతీసేవారు లేక చాలా వరకూ కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిధిలోని మునేరులో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన తోట శ్రీనివాసరావు(40)గా గుర్తించారు.
అయ్యా.. ఈయన (ఫొటో చూపుతూ) ఇక్కడున్నాడేమో కొంచెం చూసి చెప్పండి.. ఇంట్లోంచి బయట పడదామని వెళ్తూ మా కళ్లెదుటే వరదలో కొట్టుకుపోయాడు. ఏమయ్యాడో ఏమో.. ఇక్కడ ఉండకూడదని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఓ వృద్ధురాలు విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద ఉన్న వారితో అంటున్న మాటలు అక్కడున్న వారందరికీ కంట నీరు తెప్పించాయి. ఇలాంటి వాళ్లు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రికి ఇదే పనిపై వచ్చి వెళ్లడం దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో చిక్కుకు పోయిన వారు, గుడిసెల్లో ఉన్న వారు ఏమై ఉంటారోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
మనిషిని బట్టి బోటు రేటు
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు షేక్ అమీనా. ఈమెది విజయవాడ పాయకాపురం ఏరియాలోని పాకిస్థాన్ కాలనీ. ఆమె ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. పీకల్లోతు నీటిలోనే నాలుగు రోజులు గడిపారు. కాస్త వరద తగ్గడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరు కిలోమీటర్లు నడిచి బయటకు వచ్చారు. వరదలో చిక్కుకున్న తమను ఎవరూ పట్టించుకోలేదని అమీనా తెలిపారు. ఓట్ల కోసం మా ఇంటి ముందుకు వచ్చిన నాయకులు... ఇప్పుడు కనీసం మేం ఎలా ఉన్నామో అని చూసేందుకు కూడా రాలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమ ప్రాంతంలో ఒకటి, రెండు బోట్లు తిరుగుతున్నాయని, డబ్బులున్న వాళ్ల వద్దకే అవి వెళుతున్నాయని తెలిపారు. మనిషిని చూసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, రూ.300 తక్కువ ఇస్తే తీసుకువెళ్లలేమని తెగేసి చెప్పారని వాపోయారు. ఇక చేసేదేమీ లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆరు కిలోమీటర్లు నీటిలో నడిచి బయటకొచ్చామని, ప్రాణాలతో బయటపడతాం అనుకోలేదని అమీనా కన్నీటి పర్యంతమయ్యారు.
జీవనోపాధిని దెబ్బతీసింది
వరద ముంపు జీవనోపాధిని దెబ్బతీసింది. రూపాయి.. రూపాయి కూడబెట్టుకుని కిరాణా దుకాణం పెట్టుకున్నాం. వరద కారణంగా మా కష్టార్జితం మొత్తం పోయింది. షాపులోకి 5 అడుగుల నీరు వచ్చి మొత్తం నాశనం చేసింది. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ముంపు నష్టం నుంచి తేరుకోవాలంటే ఎంతకాలం పడుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– వాసంతి కేఎల్‌రావునగర్
Comments
Please login to add a commentAdd a comment