భారీ వర్షాలకు ఒకేసారి ఉప్పొంగిన కృష్ణా, బుడమేరు
చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికే బుడమేరు వరద మళ్లింపు
ప్రజలకు సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ లాకులన్నీ ఎత్తివేత
దాంతో విజయవాడను ముంచెత్తిన 60 వేల క్యూసెక్కులకుపైగా వరద
బెజవాడకు బుడమేరు ముప్పు లేకుండా 2008లో వైఎస్ బృహత్ ప్రణాళిక
డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని పెంచేందుకు 2008 ఆగస్టులో వైఎస్ గ్రీన్ సిగ్నల్
ఈ ఛానల్ ఆధునికీకరణకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ తొలగించాలి
రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడానికి ఆధునికీకరణ పనులు చేపట్టని గత టీడీపీ సర్కారు
ఈ పనుల కోసం 2021 జనవరి 6న ఎన్వోసీని రద్దు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఆ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న రాధాకృష్ణ
సాక్షి, అమరావతి/జి.కొండూరు: కృష్ణా, బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ) ఒకేసారి ఉప్పొంగాయి. ఉండవల్లి కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ సౌధాన్ని వరద చుట్టుముట్టే ప్రమాదం వచ్చింది. ఆ అక్రమ బంగ్లాను ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు అర్ధరాత్రి కుట్ర పన్నారు. బుడమేరు వరదను శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత (తెల్లవారుజామున) మళ్లించేశారు. ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా వెలగలేరు రెగ్యులేటర్ 11 గేట్లు ఒకేసారి ఎత్తేయడంతో 60 వేల క్యూసెక్కుల బుడమేరు వరద విజయవాడ నగరంపై పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చేసింది.
ఇదే విజయవాడలో జలప్రళయానికి, భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పురుడుపోసుకునే బుడమేరు.. ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లాల్లో పలు వాగులను కలుపుకుని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, విజయవాడ శివారులోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ మీదుగా ప్రవహించి కైకలూరు మండలం ఇళ్లపర్రు వద్ద కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు పరివాహక ప్రాంతం 1,321 చదరపు కిలోమీటర్లు. బుడమేరు వరదల వల్ల గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడ ముంపునకు గురయ్యేవి. అందుకే బుడమేరును బెజవాడ దుఃఖదాయిని అంటారు.
బీడీఎస్‌పై రాధాకృష్ణకు పవర్ ప్లాంటు
విజయవాడ, కృష్ణా జిల్లాలకు బుడమేరు ముంపు ముప్పు నుంచి తప్పించడానికి 1960లో వెలగలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీఎస్) తవ్వి కృష్ణా నదిలో కలిపారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్) నుంచి 2 వేల క్యూసెక్కుల వేడి నీటిని కూడా బీడీఎస్‌లో కలిపేలా 1979లో మరో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీఎస్‌లో రోజూ కనీసం 2 వేల క్యూసెక్కులు నీరు ఉంటుంది.
దాంతో బీడీఎస్‌పై 1400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్‌కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే, 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్లు సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్‌కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 1999 ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చారు.
ముంపు శాశ్వతంగా తప్పించడానికి
బుడమేరుకు 2005లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ ముంపునకు గురైంది. దాంతో బుడమేరు ముంపు ముప్పు నుంచి విజయవాడను శాశ్వతంగా తప్పించడంపై అధ్యయనానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు వెలగలేరుపై జి.కొండూరు మండలం కుంటముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి 20 వేల క్యూసెక్కులను కృష్ణా నదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకం, బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళిక రూపొందించారు.
రూ.241.45 కోట్ల ఖర్చుతో ఈ పనులు చేపట్టేందుకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈలోగా కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఎనికేపాడు నుంచి కొల్లేరులో కలిసే బుడమేరును అభివృద్ధి చేశారు. బీడీసీని ఆధునికీకరిస్తే రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌ను తొలగించాలి. ఇందుకోసం 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ని రద్దు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో బీడీసీ ఆధునికీకరణ పనులు ముందుకు కదల్లేదు.
ఇది బాబు చేసిన తప్పే
బుడమేరు వరద శనివారం గంటగంటకు పెరుగుతుండడంతో స్థానిక ఏఈ ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. వారు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ వచ్చారు. శనివారం మధ్యాహ్నం కలువూరు వద్ద హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తివేయాల్సిన అవసరం వస్తుందని కూడా ప్రభుత్వాధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వం అనుమతితోనే శనివారం రాత్రి లాకులు పూర్తిగా ఎత్తివేశారు.
ఇలా ముందుగానే ప్రభుత్వానికి తెలిసినా విజయవాడ నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకపోవడం వెనుక సందేహాలు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా హెడ్ రెగ్యులేటర్ వద్ద నిల్వ ఉన్న వేలాది క్యూసెక్కుల వరద కిందకు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీడీసీ ఆధునికీకరణను పట్టించుకోని టీడీపీ సర్కార్
రాష్ట్ర విభజనకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు కొన్ని షరతులతో ఎన్వోసీని పునరుద్ధరించింది. విభజన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునికీకరణను అటకెక్కించేసింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్వోసీ రద్దుపై హైకోర్టు స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.
వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దుష్ప్రచారం
చంద్రబాబు తప్పిదం వల్లే విజయవాడలో జలప్రళయం చోటుచేసుకుంది. అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో సీఎం చంద్రబాబు నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వరకూ ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైకి నెట్టేందుకు పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. బీడీసీ ఆధునికీకరణ పనులు 2014–19 మధ్య తాము చేపట్టామని, మిగిలిన పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్లే భారీ వరదకు బీడీసీ కరకట్టకు గండ్లు పడి విజయవాడలో జలవిలయం చోటుచేసుకుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
అర్ధరాత్రి వరద మళ్లించారు
వరద వస్తుందన్న విషయం మాకు చెప్పలేదు. అర్ధరాత్రి బుడమేరు నుంచి వరద వదిలారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో ఇళ్లు నీటమునిగాయి. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
రోజానమ్మ, బాధితురాలు, సుందరయ్యనగర్ కట్ట
ముందుగా హెచ్చరించలేదు
ఎటువంటి హెచ్చరికలు లేకుండా బుడమేరు వరద మాపైకి వదిలారు. వరద ఉధృతికి ఇళ్లు నీటమునిగాయి. వరద వచ్చిన నాటి నుంచి నేటి వరకు కంటిమీద కునుకు లేదు. తిందామంటే తిండిలేదు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం.
నల్లూరి లక్ష్మి, లక్ష్మీనగర్, 62వ డివిజన్
Comments
Please login to add a commentAdd a comment