విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్‌లో పెద్దఎత్తున స్థానికుల నిరసన
ఆహారం, నీరు లేక అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదని ఆవేదన
రెడ్ జోన్‌లో మీ ప్రాంతం లేదని సుజనా మనుషులు చెప్పడంతో తీవ్ర ఆగ్రహం
ధర్నా చేస్తున్న ప్రజలను సముదాయించిన తహసీల్దార్
భవానీపురం (విజయవాడపశ్చిమ): బుడమేరు వరద ముంపునకు గురైన తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదని కృష్ణానదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గురువారం రాత్రి రోడ్డు మీదకు ధర్నా చేశారు. వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన తమ ఇళ్లలోని వస్తువులను వదిలేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడక్కడా తల దాచుకుంటున్న తాము గత నాలుగు రోజుల నుంచి తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరక్క నానా అవస్థలు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులందరికీ సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ బాధితులకు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించడంతో వారంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూసుకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న మరో ఇద్దరు పోలీసులు అతన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. బాధితుల్లో కొందరు భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ ఉన్నవారు ‘మీ ప్రాంతం రెడ్ జోన్‌లో లేదు’ అని చెప్పటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కృష్ణానదీ తీర ప్రాంత ప్రజలు ధర్నా చేస్తున్నారని తెలిసి విజయవాడ పశ్చిమ తహసీల్దార్ వచ్చి బాధితులతో మాట్లాడారు. రెడ్ జోన్ విషయంపై ఆయన్ని నిలదీయగా.. అటువంటిదేమీ లేదని, అయితే ఈ ప్రాంతం జాబితాలో లేకపోవడంతో సమస్య ఏర్పడిందని సముదాయించారు. ఉదయమే వచ్చి నష్టపోయిన వారి జాబితా సిద్ధం చేసి సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment