Government aid
-
ప్రభుత్వ సాయం అందలేదని బాధితుల ధర్నా
భవానీపురం (విజయవాడపశ్చిమ): బుడమేరు వరద ముంపునకు గురైన తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదని కృష్ణానదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గురువారం రాత్రి రోడ్డు మీదకు ధర్నా చేశారు. వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన తమ ఇళ్లలోని వస్తువులను వదిలేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడక్కడా తల దాచుకుంటున్న తాము గత నాలుగు రోజుల నుంచి తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరక్క నానా అవస్థలు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులందరికీ సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ బాధితులకు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించడంతో వారంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూసుకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న మరో ఇద్దరు పోలీసులు అతన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. బాధితుల్లో కొందరు భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ ఉన్నవారు ‘మీ ప్రాంతం రెడ్ జోన్లో లేదు’ అని చెప్పటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కృష్ణానదీ తీర ప్రాంత ప్రజలు ధర్నా చేస్తున్నారని తెలిసి విజయవాడ పశ్చిమ తహసీల్దార్ వచ్చి బాధితులతో మాట్లాడారు. రెడ్ జోన్ విషయంపై ఆయన్ని నిలదీయగా.. అటువంటిదేమీ లేదని, అయితే ఈ ప్రాంతం జాబితాలో లేకపోవడంతో సమస్య ఏర్పడిందని సముదాయించారు. ఉదయమే వచ్చి నష్టపోయిన వారి జాబితా సిద్ధం చేసి సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మంత్రి
ములుగు మండలం పందికుంట గ్రామంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం మంత్రి చందూలాల్ పరిశీలించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పంట నష్టపోయిన వారికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం అంద జేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిర్చి, మొక్కజొన్న, అరటి తోటలను పరిశీలించారు. -
కన్నతల్లికి ఎంత కష్టం
* కుమారుడి చికిత్సకు సాయం కోసం * ఏపీ సీఎం కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌పై పడిగాపులు * సాక్షి కథనాలతో కదిలిన ఎన్టీఆర్ ఆరోగ్య సేవా సిబ్బంది సాక్షి, విజయవాడ బ్యూరో: కంటినిండా ఏడవడానికి చుక్క కన్నీరు లేదు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి సత్తువంతా నీరుగారిపోయింది. ఉన్నదల్లా ఒకటే మార్గం... ప్రభుత్వ సాయం. కానీ, అక్కడా ఆమెకు అవమానమే మిగిలింది. చేసేదేమీలేక తనయుడితో పాటు తానూ మూగగా రోదిస్తూ రోడ్డు పక్కనే కూర్చుంది.ఈ హృదయ విదారక సంఘటన వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బి.మధుసూదనరెడ్డికి గత జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ విరిగి పోయాయి. వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చివరకు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. అయితే, పూర్తిగా నయం కావడానికి మరో శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో తల్లి బాసం జయలక్ష్మి శస్త్రచికిత్స కోసం సాయమందించాలని ఏపీ సీఎం కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయం వద్ద పడిగాపులు కాసింది. రెండోసారి చికిత్సకు వెంటనే అనుమతి ఇవ్వలేమని ఆరోగ్యసేవ అధికారులు తేల్చిచెప్పడంతో శస్త్రచికిత్స చేసే వరకైనా తామిద్దరినీ ఆస్పత్రిలోనే ఉంచాలని, ఊరికి వెళ్లేందుకు డబ్బులు కూడా లేవంటూ తనయుడ్ని ఫుట్‌పాత్‌పై పడుకోబెట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దీనిపై ‘సాక్షి టీవీ’లో వచ్చిన కథనాలకు స్పందించిన ఎన్టీఆర్ ఆరోగ్య సేవా సిబ్బంది పొద్దుపోయాక మధుసూదనరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. -
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం
ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం అందింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలో 2013-2015 కాలంలో అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడిన 9 మంది రైతుల కుటుంబాలకు మంజూరైన రూ.1.50 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, నిడమనూరు, అనుముల మండలాల రైతు కుటుంబాలకు ఈ సాయం అందింది. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆర్డీవో కిషన్‌రావు, తహశీల్దార్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
బరువు తగ్గాలి.. సాయం చేయరూ!
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... ఒక్కో దేశంలో ఒక్కోరకమైన సమస్య... తినడానికి తిండి లేదు, ఆకలితో చచ్చిపోతున్నాం... సాయం చేయండి అనేది ఒకరకమైన అర్థింపు. దీని గురించి మనకు బాగా తెలుసు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమైన భారతదేశంలో ఇది చాలా సహజమైన అర్థింపు. మనకు ఇదే పెద్ద సమస్య. మరి తినడానికి పుష్టిగా తిండి ఉన్నా... ఇలాంటి అర్థింపు సమస్యలెన్నో ఉంటాయి! అవేమిటో అభివృద్ధి చెందిన దేశాల్లోని మనుషుల జీవనశైలిని పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఉదాహరణకు క్రిస్టియనా బ్రిగ్స్(26) అనే ఈ బ్రిటన్ మహిళ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను చూడండి.... ఊభకాయం ఇబ్బందిగా మొదలై ఇప్పుడు క్రిస్టియానాను తీవ్రంగా బాధపెడుతోంది. ఇప్పుడు క్రిస్టియానా బరువు తగ్గే ప్రయత్నంలో ఉంది. అందుకు ట్రీట్మెంట్ ఏమిటి? అంటే... ఆహార నియంత్రణ పాటించడం. నియంత్రణ అంటే తినడం మానేయడం కాదు... మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం కాకుండా.. శరీరంలో కొవ్వును కరిగించే ఆహారం తీసుకోవాలి. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, తనకు ఈ విషయంలో ప్రభుత్వమే సాయం చేయాలని మీడియాకు తన దీనగాథను వివరించి ప్రభుత్వం నుంచి సహాయం కోరుకొంటోంది. పోషకాహారం తిని ఊబకాయాన్ని నిరోధించుకోవడానికి అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తోంది. నిరుద్యోగి అయిన క్రిస్టియానాకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. రెండుసార్లు విడాకులూ అయ్యాయి. ఒక్కో వివాహ ఫలితంగా ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలతో కలిసి ఉండే ఆమెకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏడాదికి 20వేల పౌండ్ల భృతి అందుతోంది. ఇది సరిపోవడం లేదు. తక్కువ కొవ్వు పదార్థాలుండే ఆహారం ధర చాలా ఎక్కువ ఉంది... అందుకోసం సాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆమె బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొంటోంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో!