కన్నతల్లికి ఎంత కష్టం
* కుమారుడి చికిత్సకు సాయం కోసం
* ఏపీ సీఎం కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌పై పడిగాపులు
* సాక్షి కథనాలతో కదిలిన ఎన్టీఆర్ ఆరోగ్య సేవా సిబ్బంది
సాక్షి, విజయవాడ బ్యూరో: కంటినిండా ఏడవడానికి చుక్క కన్నీరు లేదు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి సత్తువంతా నీరుగారిపోయింది. ఉన్నదల్లా ఒకటే మార్గం... ప్రభుత్వ సాయం. కానీ, అక్కడా ఆమెకు అవమానమే మిగిలింది. చేసేదేమీలేక తనయుడితో పాటు తానూ మూగగా రోదిస్తూ రోడ్డు పక్కనే కూర్చుంది.ఈ హృదయ విదారక సంఘటన వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బి.మధుసూదనరెడ్డికి గత జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ విరిగి పోయాయి.
వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చివరకు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. అయితే, పూర్తిగా నయం కావడానికి మరో శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో తల్లి బాసం జయలక్ష్మి శస్త్రచికిత్స కోసం సాయమందించాలని ఏపీ సీఎం కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయం వద్ద పడిగాపులు కాసింది.
రెండోసారి చికిత్సకు వెంటనే అనుమతి ఇవ్వలేమని ఆరోగ్యసేవ అధికారులు తేల్చిచెప్పడంతో శస్త్రచికిత్స చేసే వరకైనా తామిద్దరినీ ఆస్పత్రిలోనే ఉంచాలని, ఊరికి వెళ్లేందుకు డబ్బులు కూడా లేవంటూ తనయుడ్ని ఫుట్‌పాత్‌పై పడుకోబెట్టి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దీనిపై ‘సాక్షి టీవీ’లో వచ్చిన కథనాలకు స్పందించిన ఎన్టీఆర్ ఆరోగ్య సేవా సిబ్బంది పొద్దుపోయాక మధుసూదనరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.