బరువు తగ్గాలి.. సాయం చేయరూ!
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... ఒక్కో దేశంలో ఒక్కోరకమైన సమస్య... తినడానికి తిండి లేదు, ఆకలితో చచ్చిపోతున్నాం... సాయం చేయండి అనేది ఒకరకమైన అర్థింపు. దీని గురించి మనకు బాగా తెలుసు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమైన భారతదేశంలో ఇది చాలా సహజమైన అర్థింపు. మనకు ఇదే పెద్ద సమస్య. మరి తినడానికి పుష్టిగా తిండి ఉన్నా... ఇలాంటి అర్థింపు సమస్యలెన్నో ఉంటాయి! అవేమిటో అభివృద్ధి చెందిన దేశాల్లోని మనుషుల జీవనశైలిని పరిశీలిస్తే అర్థం అవుతుంది.
ఉదాహరణకు క్రిస్టియనా బ్రిగ్స్(26) అనే ఈ బ్రిటన్ మహిళ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యను చూడండి.... ఊభకాయం ఇబ్బందిగా మొదలై ఇప్పుడు క్రిస్టియానాను తీవ్రంగా బాధపెడుతోంది. ఇప్పుడు క్రిస్టియానా బరువు తగ్గే ప్రయత్నంలో ఉంది. అందుకు ట్రీట్‌మెంట్ ఏమిటి? అంటే... ఆహార నియంత్రణ పాటించడం.
నియంత్రణ అంటే తినడం మానేయడం కాదు... మంచి ఆహారం తీసుకోవాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం కాకుండా.. శరీరంలో కొవ్వును కరిగించే ఆహారం తీసుకోవాలి. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, తనకు ఈ విషయంలో ప్రభుత్వమే సాయం చేయాలని మీడియాకు తన దీనగాథను వివరించి ప్రభుత్వం నుంచి సహాయం కోరుకొంటోంది. పోషకాహారం తిని ఊబకాయాన్ని నిరోధించుకోవడానికి అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేస్తోంది. నిరుద్యోగి అయిన క్రిస్టియానాకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. రెండుసార్లు విడాకులూ అయ్యాయి.
ఒక్కో వివాహ ఫలితంగా ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలతో కలిసి ఉండే ఆమెకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఏడాదికి 20వేల పౌండ్ల భృతి అందుతోంది. ఇది సరిపోవడం లేదు. తక్కువ కొవ్వు పదార్థాలుండే ఆహారం ధర చాలా ఎక్కువ ఉంది... అందుకోసం సాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆమె బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొంటోంది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో!