పరిహారం అందలేదని ఆవేదన
లోనికి అనుమతించని పోలీసులతో వాగ్వాదం
వారి ఆగ్రహం తీవ్రం కావడంతో లోపలికి అనుమతి..
బాధితుల నుంచి దరఖాస్తులు తీసుకున్న కలెక్టరేట్ సిబ్బంది
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమ పేర్లు ప్రభుత్వం సహాయం ప్రకటించిన జాబితాల్లో లేవంటూ వరద బాధితులు శనివారం పెద్ద సంఖ్యలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా కలెక్టరేట్‌కు చేరుకున్న బాధితులంతా తమ గోడు పట్టించుకోండంటూ నిరసనకు దిగారు. పూర్తిగా నష్టపోయిన తమ పేర్లు నమోదు చేయలేదని, సచివాలయాలకు వెళితే సమాధానం చెప్పే వాళ్లే లేరని వాపోయారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్లు నమోదు చేశారని ఇంకొందరు తెలిపారు. బైక్‌కు మాత్రమే పరిహారం వచ్చి0దని, ఇంటికి ఇవ్వలేదని మరికొందరు తెలిపారు. నెల రోజులుగా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరదల్లో మునిగిపోయి నెల రోజులవుతోందని, అసలు తమకు పరిహారం ఇస్తారో లేదో తెలియడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సర్వే టీం వచ్చి వివరాలు తీసుకున్నారని, జాబితాలో మాత్రం తమ పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని వచ్చామని తెలిపారు. పోలీసులు బాధితులను గేటు వద్దే నిలిపివేయడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. తమను లోపలికి అనుమతించాలని, అధికారులకు తమ ఆవేదన చెప్పుకొంటామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుల ఆగ్రహం తీవ్రం కావడంతో చివరికి బాధితులను లోపలికి అనుమతించారు. కలెక్టరేట్ సిబ్బంది వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
జాబితాలో పేరు ఉంది.. పరిహారం రాలేదు
‘పన్నెండు రోజుల పాటు మా ఇల్లు వరద నీటిలోనే ఉంది. ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా పాడైపోయాయి. బండి మునిగిపోయింది. సర్వే వాళ్లు వచ్చి పేర్లు రాసుకున్నారు. సచివాలయానికి వెళ్లి చూస్తే పేరయితే ఉంది.. కానీ ఇంత వరకు మాకు ప్రభుత్వ సాయం అందలేదు’ అని న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన సులోచన ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి: సీపీఎం
కలెక్టరేట్ వద్దకు వరద బాధితులు వచ్చారన్న సమాచారంతో సీపీఎం నేతలు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికైనా బాధితుల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఎన్యూమరేషన్‌లో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సచివాలయాల ద్వారా తిరిగి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అందరికీ న్యాయం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment