protein foods
-
హై ప్రోటీన్.. వాడటం మంచిది కాదు
ఇన్స్టంట్.. ఈ మాట వినగానే ఏదో కొత్త ఊపు వచ్చేస్తుంది మనకు...ఏ పనైనా త్వరగా పూర్తవ్వడమే ఇందులోని ప్రత్యేకత.. రకరకాల అడ్వరై్టజ్మెంట్ల ప్రేరణతో.. మనం దీనికి బాగానే అలవాటుపడిపోయాం.. అయితే ఇప్పుడీ అలవాటే కొంపముంచుతోంది.. ఆహారానికే కాదు.. దాని నుంచి అందే ప్రొటీన్లు ఇన్‌స్టంట్‌గా తీసుకోవాలనుకోవడం.. ఇన్‌స్టంట్‌గా కండలు పెంచేయాలనుకోవడం పొరపాటే అంటున్నారు నిపుణులు.. సప్లిమెంట్లు, అధిక ప్రొటీన్ వినియోగం ప్రయోజనాల కంటే ప్రమాదాలను ఎక్కువ కలిగిస్తుందని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) స్పష్టం చేసింది. దీని వల్ల కండరాల క్షీణత సహా అనేక రకాల అనారోగ్యాలు తప్పవని తేలి్చంది. దీనిపై ఒక పరిశోధన ఆధారిత నివేదికను ఇటీవలే విడుదల చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... ఒకప్పుడు విపరీతమైన శ్రమ చేసే క్రీడాకారులు లేదా సిక్స్‌ప్యాక్ వంటివి సాధన చేసే వ్యాయామ ప్రియులకు మాత్రమే పరిచయమున్న ప్రొటీన్ సప్లిమెంట్స్ నగరంలో ప్రతి ఒక్కరికీ చిరపరిచితంగా మారాయి. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే ప్రొటీన్ సప్లిమెంట్ల వినియోగంపై నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తాజాగా నిర్వహించిన పరిశోధన ఆశ్చర్యాన్ని కలిగింది.. అందులోని కొన్ని అంశాలు.. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు.ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రోటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు.👉అదనంగా జత చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీట్నర్లతో పాటు ప్రొటీన్ పౌడర్లలో సాధారణంగా ఉండే ఫ్లేవర్ల ప్రొటీన్ పౌడర్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం హానికరం. 👉ఈ సప్లిమెంట్లలో సాధారణ ముడిపదార్థమైన వే ప్రొటీన్, బ్రాంచ్డ్–చైన్ అమైనో ఆమ్లాలను (బీసీఎఎఎస్) అధికంగా కలిగి ఉంటుంది. అధిక బీసీఎఎఎస్లు నాన్–కమ్యూనికబుల్ (అంటువ్యాధులు కాని) వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 👉 సప్లిమెంట్లను తీసుకోవడం కండరాల బలాన్ని పెంచదు. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు దీర్ఘకాలిక కఠిన వ్యాయామ సమయంలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంటేషన్ కండర పరిమాణాన్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది. 👉 రోజుకు 1.6 గ్రా కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం ఏ విధమైన అదనపు ప్రయోజనాలను అందించదు. 👉 మన శరీరానికి ప్రొటీన్ అవసరాలు మనం అంచనా వేసుకున్నంత ఎక్కువగా ఉండవు. 👉 క్రీడాకారులు సైతం సప్లిమెంట్లపైనే ఆధారపడకుండా ఆహారం నుంచి తగిన మొత్తంలో ప్రొటీన్ పొందడం మేలు. 👉దీర్ఘకాలం పెద్ద మొత్తంలో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఎముక, కణజాలానికి నష్టం కలిగించవచ్చు. అలాగే మూత్రపిండాల సమస్యకు దారితీసే అవకాశం ఉంది. 👉 శాకాహారం లేదా మాంసాహారం నుంచి ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలను సులభంగా అందుకోవచ్చు. 👉 తృణధాన్యాలు, పప్పుధాన్యాలను 3:1 నిష్పత్తిలో లేదా 30 గ్రాముల వరకూ పప్పులతోనో, రోజుకు 80గ్రా మాంసంతోనో ప్రొటీన్ స్థాయిల్ని భర్తీ చేయవచ్చు. ఇది సాధారణ వ్యక్తుల ప్రొటీన్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. 👉కేవలం ప్రొటీన్ వినియోగం మాత్రమే కండరాల నిర్మాణంలో ఉపకరిస్తుందనేది అపోహ మాత్రమే. ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రొటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు. ఆహారపు అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లు) ద్వారా కండర శ్రేణి నిర్మాణానికి శరీరంలో అమైనో–యాసిడ్ సంబంధిత విధులకు కార్బోహైడ్రేట్లు కొవ్వుల నుంచి కూడా తగినంత శక్తి అందాల్సిన అవసరం ఉంది. 👉 తగినంత శారీరక శ్రమ లేకుండా, కండరాల నిర్మాణానికి ప్రొటీన్లు ఉపకరించవు. సహజ ప్రొటీన్లతో మేలు..మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్డు, పాలు ప్రొటీన్లు శరీరంలో కొత్త ప్రొటీన్లను తయారు చేయడానికి అవసరమైన ఇరవై అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. పప్పులు, పచ్చి శెనగలు, గుర్రపు శెనగలు, నల్ల శనగలు, చిక్పీస్, సోయాబీన్, పచ్చి బఠానీలు వంటి పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్లు, హాజెల్‌నట్‌లు, సోయా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు గణనీయమైన పరిమాణంలో ప్రొటీన్లను కలిగి ఉంటాయి. పప్పులను తృణ ధాన్యాలతో కలిపి లేదా తృణధాన్యాలు మాంసం ఆహారం, గుడ్లు/ పాలతో కలిపి తిన్నప్పుడు ఆహారంలో ప్రొటీన్ నాణ్యత మెరుగుపడుతుంది. తక్కువ కొవ్వు అధిక ఫైబర్ కలిగిన పప్పులు ఇనుము, పొటాషియం, జింక్, మెగ్నషియంవంటి ముఖ్యమైన విటమిన్లు, ఇతర ఖనిజాలను కలిగి ఉంటాయి. శాఖాహార ఆహారాలు 70%–85% వరకూ ప్రొటీన్‌ను జీర్ణం చేస్తాయి. మితిమీరితే యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం... తీసుకున్న ఆహారం ద్వారా గానీ, ఇతరత్రా గానీ శరీర బరువు కిలోకి 1.5 గ్రాముల్ని మించి ప్రొటీన్ తీసుకోకూడదు. అతిగా ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ సమస్యలతో పాటు యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదాలున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే సప్లిమెంట్స్‌లో కొన్నింటిలో స్టెరాయిడ్స్ కలుస్తున్నాయని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంట్స్ వినియోగించాలి. –డా.కిషోర్‌రెడ్డి, అమోర్ హాస్పిటల్స్ -
దేశంలో తృణధాన్యాల వినియోగం తగ్గుదల
సాక్షి, అమరావతి: ప్రజలు తమ ఆదాయం పెరుగుతున్న కొద్ది ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటూ వెళుతున్నారు. పాలు, మాంసం, గుడ్లు వంటి ఇతర ప్రొటీన్ ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తృణధాన్యాల వినియోగం తగ్గుతోంది. గృహవినియోగ వ్యయ సర్వే 2022–23లో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1999–2000 నుంచి 2022–23 మధ్య తృణధాన్యాల తలసరి వినియోగం క్రమంగా క్షీణించింది. 1999–2000లో నెలవారీ తలసరి తృణధాన్యాల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 12.72, పట్టణ ప్రాంతాల్లో 10.42 కిలోలుగా ఉండేది. ఇది 2022–23లో గ్రామాల్లో 9.61, పట్టణాల్లో 8.05 కిలోలకు పడిపోయింది. పశ్చిమబెంగాల్లో అధికంరాష్ట్రాల వారీగా తృణధాన్యాల వినియోగం పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 11.23 కిలోలతో పశ్చిమబెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఒడిశా 11.21 కిలోలు, బీహార్ 11.14 కిలోలు, ఛత్తీస్‌గఢ్ 10.27 కిలోలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లో వినియోగం బిహార్‌లో 10.45 కిలోలు, ఛత్తీస్‌గఢ్‌లో 10.43, జార్ఖండ్‌లో 9.59 కిలోలు. గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 9.30 కిలోలు, తెలంగాణలో 10.11, పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8.29, తెలంగాణలో 8.77 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. బియ్యానిదే పైచేయిమొత్తం తృణధాన్యాల వినియోగంలో బియ్యం వాటా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామాల్లో 9.61 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 55.35 శాతం బియ్యం, 40.93 శాతం గోధుమ, 3.48 శాతం ముతక, 0.22 శాతం ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. పట్టణాల్లో 8.05 కిలోల నెలవారీ తలసరి వినియోగంలో 53.20 శాతం బియ్యం, 44.53 శాతం గోధుమ, 2.09 శాతం ముతక, 0.19 ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. ఏపీలోని వినియోగిస్తున్న మొత్తం తృణధాన్యాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 92.22 శాతం, పట్టణాల్లో 90.55 శాతం బియ్యం వాటా నమోదైంది. -
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
-
Seaweed: సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం! ఇక గ్రేసిలేరియా అయితే..
Organic Seaweed- Amazing Health Benefits: సీవీడ్స్.. అంటే సముద్రపు నీటిలో పెరిగే నాచు వంటి మొక్కలు. వాటి విలువ తెలియని కాలంలో ‘వీడ్స్’ అని పిలిచి ఉంటారు. పౌష్టిక విలువేమిటో తెలిసిన తర్వాత ఇప్పుడు ‘సీ ప్లాంట్స్’ అని, ‘సీ వెజిటబుల్స్’ అంటూ నెత్తినపెట్టుకుంటున్నారు. ఆకుపచ్చగా ఉండే ఉల్వా రకం సీవీడ్‌ను ‘సముద్రపు పాలకూర’ అని కూడా పిలుస్తున్నారు. చైనా, జపాన్ తదితర ఆసియా దేశాల్లో తరతరాలుగా వీటిని సముద్రం నీటిలో సహజసిద్ధంగా పెరిగే సీవీడ్స్‌ను సేకరించి తినే అలవాటుంది. అమెరికా, కెనడాల్లో కొన్ని కంపెనీలు చెరువుల్లో పెంచటం ప్రారంభించాయి. ఇజ్రాయిల్ కంపెనీ మరో ముందడుగేసింది. సేంద్రియ సీ వెజిటబుల్స్ సాగు చేసే ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆహారోత్పత్తులకు అదనపు పోషకాలు జోడించడానికి, ఔషధాల తయారీలో సీవీడ్స్‌ను విరివిగా వాడుతున్నారు. సేంద్రియ సీ వీడ్స్ సాగు అంటే ఏమిటి? సీ వీడ్స్ సాధారణంగా సముద్రపు నీటిలో సహజసిద్ధంగా పెరుగుతూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులును బట్టి కొన్ని సీజన్లలోనే అందుబాటులో ఉంటాయి. కాలక్రమంలో వీటిని తీరం వెంబడి సముద్రపు నీటిలో కేజెస్లలో సాగు చేయటం ప్రారంభమైంది. తీరప్రాంతాల్లో నేలపై నిర్మించిన కృత్రిమ చెరువుల్లో సముద్రపు నీటిని తోడి సాగు చేయటం అమెరికా, కెనడా దేశాల్లోని తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు ప్రారంభించాయి. ఇప్పుడు ఇజ్రేల్‌కు చెందిన ‘సీకురా’ అనే కంపెనీ మరో ముందుకు వేసి సేంద్రియ సీ వీడ్స్ సాగు చేయనారంభించటం విశేషం. సాధారణ సముద్ర జలాల్లో భారఖనిజాలు, ఇతర కాలుష్యాలు అంటకుండా సముద్ర గర్భం నుంచి శుద్ధమైన నీటిని తోడి తెచ్చి తీరానికి దగ్గర్లో నేలపై కృత్రిమ ఉప్పునీటి చెరువుల్లో సాగు చేసే విధానమే ‘సేంద్రియ సీవీడ్స్ సాగు’ పద్ధతి అని ఈ సంస్థ చెబుతోంది. నీటి ఉష్ణోగ్రతను, కాంతిని నియంత్రించడం ద్వారా ఏడాది పొడవునా సేంద్రియ సీవీడ్స్ సాగును నిరంతరాయంగా చేపట్టవచ్చని ఈ సంస్థ చెబుతోంది. పెరుగుతున్న జనాభాకు పౌష్టిక విలువలున్న ఆహారోత్పత్తులను అందించడానికి తగినంత పరిమాణంలో స్థిరమైన దిగుబడి పొందడానికి తమ సాంకేతికత ఉపకరిస్తుందని ఈ కంపెనీ చెప్తోంది. సీవీడ్స్ సాగులో 3 దశలు సేంద్రియ సీవీడ్స్ సాగుకు సముద్రగర్భం నుంచి తోడిన నీటిని భారఖనిజాలు, ఇతర కలుషితాలు లేకుండా శుద్ధి చేసిన నీటిని వాడుతారు. సీవీడ్ల ముక్కలు వేస్తే కొద్ది రోజుల్లో అవి పెరుగుతాయి. పెరుగుదల క్రమంలో వయసును బట్టి 3 దశలుంటాయి. ఒక్కో దశకు వేర్వేరు చెరువుల వ్యవస్థను డిజైన్ చేశారు. సముద్రపు నీటిలోని సహజ పోషకాలు, బాక్టీరియా ఆధారంగా సీవీడ్స్ వేగంగా పెరుగుతాయి. సాగు పూర్తయి సీవీడ్స్‌ను పట్టుబడి చేసిన తర్వాత నీటిని ఆక్వా సాగుకు వాడొచ్చు లేదా తిరిగి సముద్రంలోకి వదిలేయవచ్చు. కాలుష్యం అనే మాటే ఉండదు అని నిపుణులు చెబుతున్నారు. ‘బీచ్‌లో కాళ్ళకు చుట్టుకొని చికాకుపెట్టే వాటిగానే సీవీడ్స్‌ను ఇజ్రేల్ ప్రజలు భావించేవారు. తినడానికి పనికొచ్చేదని మొన్నటి వరకూ తెలీదు. ఇప్పుడు అది ఎంత ఆరోగ్యకరమైనదో, ఎంత రుచిగా ఉంటుందో గ్రహించారు అంటున్నారు ఓజ్. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ రెండు రకాల సీవీడ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఓజ్ అంటున్నారు. సేంద్రియ సీవీడ్ సాగుపై మన శాస్త్రవేత్తలు దృష్టిపెడితే.. రొయ్యలు, చేపలు, స్పిరులినా మాదిరిగా చెరువుల్లో సీవీడ్స్ సేంద్రియ సాగు చేసి అమెరికా, కెనడా తదితర దేశాల్లో మార్కెట్లను భారత్ చేజిక్కించుకునే పరిస్థితులొస్తాయని ఆశించవచ్చు. సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం సీ వీడ్స్ రకాలు వేలాదిగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఎక్కువగా కలిగి ఉండే రెండు రకాలను ఎంపిక చేసుకొని తాము సాగు చేస్తున్నామని సీకురా సీఈఓ ఓజ్ చెప్పారు. మాంసం (25 గ్రా.), చికెన్ (21.7 గ్రా.), కోడిగుడ్డు (12 గ్రా.)తో పోలిస్తే తాము సాగు చేసే ఉల్వా, గ్రేసిలేరియా రకాల సీవీడ్స్‌లో 32 గ్రాముల ప్రోటీన్ ఉంటుందన్నారు. ఉల్వా రకం పచ్చని ఆకుల మాదిరిగా ఆకుపచ్చని రంగులో ఉంటుంది. అందుకే దీన్ని ‘సముద్రపు పాలకూర’ అని కూడా పిలుస్తారు. రెండోది గ్రేసిలేరియా ఇది ముదురు ఎరుపు రంగు సున్నితమైన కాడలతో కూడిన మొక్క మాదిరిగా ఉంటుంది. వీటిని ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు వీటిల్లో ఏ మేరకున్నాయో నిర్ధారించడానికి కంపెనీ జన్యు పరీక్షలు నిర్వహించింది. ఇతర సూపర్ ఫుడ్స్‌లో కన్నా మిన్నగానే డైటరీ ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ముఖ్యంగా అధిక అయోడిన్ వీటిల్లో కాలే, చియా, స్పిరులినా వంటి ఇతర సూపర్ ఫుడ్స్‌లో కన్నా మిన్నగానే ఉన్నాయి. అయోడిన్ లోపం నేడు ప్రపంచంలోని ప్రధాన పోషకాహార లోపాల్లో ఒకటి. గాయిటర్, గర్భధారణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యల నివారణలో అధిక పోషకాలున్న ఉల్వా, గ్రేసిలేరియా సీవీడ్స్ సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఉంది. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ చదవండి: Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే -
గాల్లోంచి.. మంచినీటి చుక్క, మాంసం ముక్క
ఎక్కడో ఎడారి నడి మధ్యలో ఉన్నారు.. చెట్లూ చేమలు ఏమీ లేవు.. నీటి జాడ అసలే లేదు.. అయినా తినడానికి మాంచి మటన్ లాంటి ఫుడ్డు, కావల్సినన్ని నీళ్లు రెడీ. బయట ఎక్కడి నుంచో తేలేదు.. అక్కడే, ఆ ఎడారిలోనే అబ్రకదబ్ర అన్నట్టు గాలిలోంచి తయారైపోయాయ్. శాస్త్రవేత్తలు నిజంగానే గాల్లోంచి ప్రోటీన్ ఫుడ్‌ను, నీళ్లను తయారు చేసే టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలివి.. నిరంతరాయంగా నీళ్లొస్తాయి ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల నీటికి కటకటే. ఎడారుల్లో మాత్రమే కాదు.. కొండలు, గుట్టల వంటిచోట కూడా తాగునీటికి తీవ్ర ఇబ్బందే. అలాంటి ప్రాంతాల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా గాలి నుంచి నీటిని తీసే పరికరాన్ని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్ (తానంతట తానే చల్లబర్చుకుంటూ.. గాలిలోని నీటి ఆవిరిని సంగ్రహించే)’సాంకేతికతతో ఈ పరికరం పనిచేస్తుంది. నిజానికి గాలిలోంచి నీటిని సంగ్రహించగల పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటికి విద్యుత్ అవసరం, ఉత్పత్తి అయ్యే నీళ్లు కూడా చాలా తక్కువ. కానీ తాము తయారు చేసిన పరికరానికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం లేదని.. పైగా రోజులో 24 గంటలూ నీటిని పొందవచ్చని ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలా పనిచేస్తుంది? గాలిలోంచి నీటిని సంగ్రహించేందుకు ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్’చేయగల ప్రత్యేక గ్లాస్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. పాలిమర్, వెండి పొరలతో కూడిన ఈగ్లాస్ సూర్యరశ్మిని పూర్తిస్థాయిలో ప్రతిఫలింపజేస్తూ.. బాగా చల్లబడుతుంది. ఈ గ్లాస్ దిగువభాగాన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత కంటే.. ఏకంగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ల మేర తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో గాలిలో ఉన్న నీటి ఆవిరి గ్లాస్ దిగువ భాగాన నీటి చుక్కలుగా పేరుకుంటూ..దిగువన ఉన్న కంటైనర్‌లో కి చేరుతుంది. ఈ విధానంలో పూర్తి స్వచ్ఛమైన నీరు వస్తుందని.. పది చదరపు మీటర్ల పరిమాణమున్న పరికరంతో రోజుకు 12.7 లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఇవాన్ హెక్లర్ తెలిపారు. మాంసమూ ఊడి పడుతుంది! మటన్, చికెన్, ఫిష్.. ఇలా ఏ మాంసం ఏదైనా జనం లొట్టలేస్తూ లాగించేస్తుంటారు. మరోవైపు ఇది జీవ హింస అనే వాదనలు. ఈ మధ్య మొక్కల ఆధారిత (ప్లాంట్ బేస్డ్) మాంసం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇవేమీ లేకుండా నేరుగా గాలిలోంచే మాంసం తయారు చేయగలిగితే.. ఇంకా బెటర్ కదా. ఎయిర్ ప్రోటీన్ అనే సంస్థ దీనిని నిజం చేసింది. మొదట అంతరిక్ష యాత్ర కోసమని.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గాలిలోని వాయువులు, రసాయనాల నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంపై సుమారు 50 ఏళ్ల కిందే ప్రయోగాలు మొదలుపెట్టారు. అంగారకుడు, ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణం నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయగలిగితే.. వ్యోమగాములకు ఆహారం సమస్య తీరుతుందనేది దీని ఉద్దేశం. ఈ పరిశోధనలను ఎయిర్ ప్రోటీన్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు లీసా డైసన్, జాన్ రీడ్ తదితరులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎయిర్ ప్రోటీన్‌ను తీసి.. వివిధ పద్ధతుల్లో గాలిలోని వాయువులు, మూలకాలను సేకరించి, అవసరమైన మేర సమ్మిళితం చేసి.. ‘ఎయిర్ ప్రోటీన్’ను రూపొందించారు. దానిని శుద్ధిచేసి, పూర్తిగా ఆరబెట్టి.. ఒక పిండి వంటి పదార్థంగా తయారు చేశారు. ఈ ‘ఎయిర్ ప్రోటీన్’పిండితో.. చికెన్, మటన్, ఫిష్ వంటి వివిధ రకాల మాంసం తరహాలో తయారు చేశారు. తమ ‘ఎయిర్ ప్రొటీన్’రుచి, పోషకాల విషయంలో సాధారణ మాంసంతో సమానమని.. యాంటీ బయాటిక్స్, పురుగు మందుల అవశేషాలూ ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలిలోని కార్బన వాయువులను తగ్గించడం వల్ల పర్యావరణానికీ మేలు అని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎదిగే పిల్లలకు ఈ పోషకాహారం ఇస్తున్నారా? పాలు, గుడ్డు, పాలకూర..
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అవసరం. అలాగని ఏది పడితే అది తినిపించడమూ మంచిది కాదు. ముఖ్యంగా వాళ్లు ఇష్టంగా తింటున్నారు కదా అని జంక్ ఫుడ్ తినిపిస్తే ఆరోగ్యంగా ఎదగకపోగా ఊబకాయం వస్తుంది. ముందు ముందు అది మరెన్నో సమస్యలకు దారి తీయవచ్చు. అందువల్ల ఏ ఆహారంలో ఏముంటుందో తెలుసుకుని, వాటినే వారు తినేలా చూడగలిగితే పిల్లలు ఆరోగ్యంగా పెరగడంతోపాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది. ►పాలు: బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్ధంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యకరమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రంగా జీర్ణం అయ్యే ఆహారం.తల్లి పాల తర్వాత ప్రోటీనులూ, విటమిన్లు, ఖనిజాలు గల పాలు ఆవుపాలు. పిల్లలకు ఆవుపాలు తాగించడం వల్ల వారిలో ధారణ శక్తి కలుగుతుంది. ఆవుపాలు శ్వాస సంబంధిత వ్యాధులను తొలగించడంతోపాటు. శరీరానికి కాంతిని, ఇంద్రియాలకు నిర్మలత్వాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. అందువల్ల పిల్లలకు ఆవుపాలు తాగించడం మంచిది. ►విటమిన్ ఎ: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం జున్ను, క్యారెట్, పాలూ, గుడ్లూ ఇవ్వాలి. ►బి కాంప్లెక్స్ విటమిన్లు: శరీర పనితీరు బాగుండాలంటే బీ కాంప్లెక్స్ అత్యవసరం. మాంసం, చేపలూ, సోయా బీన్స్ వంటివి ఇవ్వడం వల్ల బి కాంప్లెక్స్ అందుతుంది. ►కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్ సి చాలా అవసరం. టొమాటో, తాజా కూరలూ, పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. ►ఎముక బలానికి: ఎదిగే పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్ డి తప్పనిసరి. ఇందుకోసం పాలూ, పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి. ►ఐరన్ లోపం లేకుండా: ఐరన్ రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి ఇవ్వాలి. ►గుడ్డు: గుడ్డు ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. రోజుకో గుడ్డు ఇవ్వడం వల్ల మాంసకృత్తులు సమృద్ధిగా అందు తాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి దోహదం చేస్తుంది. గుడ్లు చవకైన పోషకాహారమే కాదు. ఎప్పుడంటే అప్పుడు తినటానికి వీలుగా ఉంటాయి కూడా. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు దండిగా ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో విటమిన్ డి దండిగా ఉంటుంది. అందువల్ల గుడ్లను పిల్లల ఆహారంలో చేర్చటం మంచిది. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరకశ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. ►మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారు చేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయ వ్యాధి, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ►ఉదయాన్నే అల్పాహారంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఉప్మాలు, బ్రెడ్ల వంటి అల్పాహారాలకు బదులు గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్ స్థాయులు మెరుగుపడతాయి. ట్రై గ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. ఏ పాలు..? ఎన్ని పాళ్లు ..? పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్ మిల్క్ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే తాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను తాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు తాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాగి (వేడి చేసి) కాచిన తర్వాతనే తాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్ మిల్క్‌ను కనీసం పదినిముషాలయినా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తాగించాలి. చల్లారిన, నిల్వ ఉన్న పాలను తాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి తాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు తాగించాలన్నదీ తెలుసుకోవడం మంచిది. చదవండి: Dairy Rich Diet: గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు ఇవే... -
అధిక ప్రొటీన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు రావొచ్చు
సాక్షి, హైదరాబాద్: అధిక ప్రొటీన్లు, తక్కువ ఫైబర్ తీసుకోవడం ద్వారా జీర్ణకోశ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. కోవిడ్ సోకిన సమయంలో వైద్యంతో పాటు సూచిస్తున్న ఆహారం, పోషకాల్లోని వ్యత్యాసాల వల్ల పలువురికి ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు. సమతుల ఆహారంతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని వారు సూచిస్తున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అనేక మందిలో మలబద్ధకం, కడుపులో ఇబ్బందులు సర్వసాధారణంగా మారాయని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోని యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.ఆనంద్ పేర్కొన్నారు. దీనిద్వారా మలద్వారం దగ్గర పగుళ్లు, రక్తస్రావం వంటి సమస్యలతో కొందరు తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఇతరత్రా తీవ్రమైన సమస్యలేవీ లేకుండా మలబద్ధకం మాత్రమే ఉంటే వంటింటి వైద్యం ద్వారా ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. తాత్కాలిక ఉపశమనం సంగతెలా ఉన్నా ఆహారంలో మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు. లిక్విడ్ డైట్, వాకింగ్ బెస్ట్.. ఆహారం ద్వారా ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మలబద్ధకం సమస్యలు రావడం సాధారణమే. దీనికి విరుగుడుగా ఫైబర్, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు, శారీరక శ్రమ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. – జి.సుష్మ, సీనియర్ క్లినికల్ డైటీషియన్, కేర్ హాస్పిటల్స్ ఎక్కువైతే ముప్పే.. శరీరం సక్రమంగా తన విధులు నిర్వర్తించడానికి, వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరుకు రోజుకు ఒక వ్యక్తి తన శరీరం బరువులో ఒక కిలోకు 0.66 గ్రాముల ప్రొటీన్ అవసరం. అత్యధికంగా అది ఒక్క గ్రాము దాటకూడదు. రోజుకు 15 శాతం శక్తి (కేలరీలు)నిచ్చే హై ప్రొటీన్ ఆహారం సాధారణ పరిస్థితుల్లో వైద్యులు సూచించరు. అయితే కోవిడ్ చికిత్స సమయంలో తక్కువ ఫైబర్, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం చాలా మంది తీసుకున్నారు. దీంతో బాధాకరమైన మలవిసర్జన, పగుళ్లకు కారణమవుతుంది. ఎక్కువ రోజుల పాటు ఇలాగే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడొచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ డైరెక్టర్ ఆర్.హేమలత పేర్కొన్నారు. సమతుల ఆహారం క్షేమం ఎక్కువ ప్రోటీన్ కారణంగా వచి్చన సమస్యలను అధిగమించడానికి తగినంత ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్ సైతం ఆకలి పెరిగేందుకు కారణమవుతాయని పేర్కొంటున్నారు. దీంతో కోవిడ్ చికి త్స తర్వాత అధికంగా ఆహారం తీసుకునే అవకాశం లేకపోలేదు. అయితే ప్రొటీన్ ఎక్కువగా ఉన్నవి కాకుండా ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాం టీఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు తగినంత ఫైబర్ ఆహారం కూడా ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణమే.. ఏ రకమైన ఔషధం వల్లనైనా ఎసిడిటీ, అజీర్తి తదితర జీర్ణకోశ సంబంధ సమస్యలు అత్యంత సాధారణ దుష్ప్రభావాలు. జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీని ఎదుర్కోవటానికి తాము సాధారణంగా యాంటీయాసిడ్స్ సూచిస్తామని వైద్యులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో లేదా ఆహారం తర్వాత మందులు తీసుకోవాలా అనే విషయంలో రోగులకు స్పష్టత ఉండాలంటున్నారు. ఆకుకూరలు, పండ్లు, సలా డ్స్, మొలకలు, చిక్కుళ్లు వంటివి అధికమైన పీచు పదార్ధాలను తినాలని ఉంటాయి. అలాగే తృణ/చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు ద్వారా కూడా ఫైబర్‌ను పొందవచ్చు. పీచు తగినంత ఉండేలా చూసుకుంటే మలబద్ధకాన్ని నివారించడానికి, హృద్రోగ, డయాబెటిస్, పెద్ద ప్రేగు కేన్సర్లను అడ్డుకుంటుంది. -
గర్బిణీలు,బాలింతలకు వైఎస్ఆర్ అమృత హస్తం
-
తిండి కలిగినా... కండలేదోయ్!
‘తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్’గురజాడ మాట. ‘కండరాలకు ఈ తిండి చాలదోయ్.. దానికి దండిగా ప్రొటీన్లతో పొత్తు కలవాలోయ్’అని కొనసాగింపు వ్యాక్యాలుంటే నేటికి సరిగ్గా నప్పుతాయేమో! శరీర నిర్మాణానికి మాంసకృత్తులు అత్యంత అవసరం. వాటి లోపం శారీరక పెరుగుదల, మేధో వికాసాన్ని మందగింప చేయడం సహా పలు రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతటి కీలకమైన మాంసకృత్తులు భారతీయుల ఆహారంలో లోపిస్తున్నాయి. ఇప్సోస్– ఇన్‌బాడీ అనే దక్షిణ కొరియా సంస్థ ఇటీవల హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లోని 30– 55 వయస్కులపై జరిపిన అధ్యయనం ప్రకారం 68 శాతం మంది భారతీయులు మాంసకృత్తుల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి వారి సంఖ్య 75 శాతం మంది కన్నా ఎక్కువే. ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంఆర్బీ) గతేడాది విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని తేల్చింది. దీని ప్రకారం.. దేశంలో 73 శాతం మందిలో మాంసకృత్తులు లోపించాయి. 84 మంది భారతీయ శాకాహారులు, 65 శాతం మాంసాహారులు తగిన మేరకు ప్రొటీన్లు తీసుకోవడం లేదు. 93 శాతం మందికి ప్రొటీన్లు ఎంత మేరకు తీసుకోవాలో కూడా తెలియదు. 71% మందికి కండరాల అనారోగ్యం ఇప్సోస్– ఇన్‌బాడీ అధ్యయనం ప్రకారం.. దేశంలో 71% మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదు. భారతీయుల కండరాలు బలంగా లేకపోవడానికి ప్రొటీన్ల లోపమే కారణమంటున్నారు. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలోని పిల్లల్లో 36% మంది తక్కువ బరువుతో ఉన్నారు. 21% మంది ఎత్తుకు తగినంత బరువు లేరు. 38% మంది ఎదుగుదల లోపంతో గిడసబారిపోతున్నారు. గుడ్ల పెంకులు.. పోషకాల గనులు ఇటీవల బెంగళూరులో ఓ పరిశోధక బృందం.. శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి తయారు చేసిన గుడ్ల పెంకు పొడిని గోధుమ పిండితో కలిపి చపాతీలు, బిస్కట్లు తయారు చేయడమెలాగో ప్రదర్శనపూర్వకంగా వివరించింది. పరిశోధకుల్లో ఒకరైన హెచ్‌బీ శివశీల.. గుడ్డు పెంకు ఇచ్చే ఒక స్పూను పొడిలో 750– 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ గుడ్ల పెంకుల పొడిని ఆహారంలో భాగం చేయడం వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించింది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం తినాలి?... పాల సంబంధిత ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం, గింజలు, పప్పులు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుళ్లు, వేరుశనగలు, ముదురాకుపచ్చ కూరల్లో మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వృక్ష సంబంధిత మాంసకృత్తులతో పోల్చుకుంటే, జంతు సంబంధమైన మాంసకృత్తులు శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లను తగిన మేరకు అందించగలవని, గుడ్లలో ఉత్తమ కోవకు చెందిన ప్రొటీన్లు ఉంటాయని, వీటిని మొత్తంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల అమినో యాసిడ్లూ లభిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. -
ప్రొటీన్‌తో గుండె పదిలం
లండన్ : ప్రొటీన్ అధికంగ ఉండే ఆహారం తీసుకునేవారిలో గుండె వైఫల్యం ముప్పు 50 శాతం తక్కువగా ఉంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. 2000 మందికి పైగా వారు తీసుకునే ప్రొటీన్ స్ధాయి, వారి గుండె ఆరోగ్యాన్ని అథ్యయనంలో భాగంగా పరిశీలించారు. తక్కువ ప్రొటీన్ తీసుకునే వారు అధికంగా ప్రొటీన్‌ను తీసుకునే వారితో పోలిస్తే మృత్యువాతన పడే ముప్పు 46 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రోజుకు 70 గ్రాములు ప్రొటీన్ తీసుకుంటే అకాల మరణం నుంచి 50 శాతం మేర తప్పించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ప్రొటీన్‌తో శరీరంలో కండరాలు పటిష్టమై గుండె పదికాలాలు దృఢంగా ఉండేలా చేస్తుందని భావిస్తున్నారు. నట్స్, గుడ్లు, మాంసంలో ప్రొటీన్ అధికంగా లభ్యమవుతుంది. యూనివర్సిటీ మెడికల్ సెంటర్ గ్రొనిజెన్ చేపట్టిన ఈ పరిధశోధనను వియత్నాంలో హృదయవైఫల్యంపై జరిగిన వరల్డ్ కాంగ్రెస్‌లో సమర్పించారు. -
మహిళలూ.. ప్రొటీన్లు మరవొద్దు!
పురుషుల కంటే 13 శాతం తక్కువగా తీసుకుంటున్నారు l హెల్దీఫై మీటర్ అధ్యయనం వెల్లడి ఆహారం తగ్గిస్తే బరువు తగ్గలేరు.. ఇతర సమస్యలూ వస్తాయని హెచ్చరిక బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలని ఆశపడని వారు ఉండరు. అందులోనూ మహిళలైతే ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా బరువు తగ్గకపోవడమూ చూస్తుంటాం. అలాంటి వారు తమ ఆహారంలో మాంసకృతులు (ప్రొటీన్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని.. లేకపోతే అనేక సమస్యల బారిన పడతారని పరిశోధకులు హెచ్చరిస్తు న్నారు. భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపు 13% తక్కువగా మాంసకృతులను తీసుకుంటున్నారని ఇటీవల హెల్దీఫైమీ అనే సంస్థ అధ్యయనంలో గుర్తించారు. ‘హెల్దీఫై మీటర్ జెండర్ వాచ్– 2017’పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది నుంచి సమాచారం సేకరించి.. ‘హెల్దీఫైమీ’అనే యాప్‌తో దాదాపు ఆరు కోట్ల ఆహార సంబంధిత రికార్డులను పరిశీలించి.. ఈ నిర్ధారణకు వచ్చి నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషులతో పోలిస్తే మహి ళలు కార్బోహైడ్రేట్లు , కొవ్వులను కొంత ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక మహిళలు చిరుతిళ్ల విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉన్నారని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్ ఆరోగ్యానికి అన్ని పోషకాలూ అవసరం ఆరోగ్యంగా ఉండేందుకు మన ఆహారంలో ఇరవై శాతం ప్రొటీన్లు, 30 శాతం కొవ్వులు, 50 శాతం కార్బోహైడ్రేట్లు ఉండాలని పోషకాహార సంస్థలు చెబుతున్నాయి. కానీ మన దేశంలో చాలా మందికి అవసరానికన్నా తక్కువగా ప్రొటీన్లు అందుతున్నాయి. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలు మరో 13 శాతం తక్కువగా ప్రొటీన్లు తీసుకుంటున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ అంతరం బాగా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటోంది. ఆహారం తగ్గించినా.. ప్రొటీన్లు ఉండాలి శరీరానికి తగు మోతాదులో ప్రొటీన్లు అందకపోతే జీవక్రియలు మందగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఆహారం తీసుకోవడం తగ్గించినా బరువు తగ్గలేరు. అంతేకాకుండా నిత్యం అలసిపోయినట్టుగా ఉండటం, ఏ విషయంపైనా దృష్టి పెట్టలేకపోవడం, చిన్న విషయాలకే అతిగా స్పందించడం లేదా నిరాసక్తంగా ఉండటం వంటి లక్షణాలూ ఉంటాయి. తీసుకునే ఆహారం శాతం తగ్గించినా... ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్లు తగినంతగా అందకపోతే కండరాల పటుత్వం తగ్గిపోతుందని, వయసు పెరిగేకొద్దీ ఎముకలు పెళుసుబారుతాయని మెడాంటా ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అంబరీష్ మిట్టల్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాము ‘హర్హెల్త్ఫస్ట్’పేరిట ఈ అంశంపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని.. ఈ నెల 6 నుంచి 9వ తేదీల మధ్య మహిళలకు ఉచిత ఆహార సూచనలు అందజేస్తామని పేర్కొన్నారు.