తిండి కలిగినా... కండలేదోయ్‌! | Body eats muscles when not given enough protein | Sakshi
Sakshi News home page

తిండి కలిగినా... కండలేదోయ్‌!

Published Sun, Dec 9 2018 5:00 AM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

Body eats muscles when not given enough protein - Sakshi

‘తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌’గురజాడ మాట. ‘కండరాలకు ఈ తిండి చాలదోయ్‌.. దానికి దండిగా ప్రొటీన్లతో పొత్తు కలవాలోయ్‌’అని కొనసాగింపు వ్యాక్యాలుంటే నేటికి సరిగ్గా నప్పుతాయేమో! శరీర నిర్మాణానికి మాంసకృత్తులు అత్యంత అవసరం. వాటి లోపం శారీరక పెరుగుదల, మేధో వికాసాన్ని మందగింప చేయడం సహా పలు రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతటి కీలకమైన మాంసకృత్తులు భారతీయుల ఆహారంలో లోపిస్తున్నాయి.

ఇప్సోస్‌– ఇన్‌బాడీ అనే దక్షిణ కొరియా సంస్థ ఇటీవల హైదరాబాద్‌ సహా ఎనిమిది నగరాల్లోని 30– 55 వయస్కులపై జరిపిన అధ్యయనం ప్రకారం 68 శాతం మంది భారతీయులు మాంసకృత్తుల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి వారి సంఖ్య 75 శాతం మంది కన్నా ఎక్కువే. ఇండియన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ బ్యూరో (ఐఎంఆర్‌బీ) గతేడాది విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని తేల్చింది. దీని ప్రకారం.. దేశంలో 73 శాతం మందిలో మాంసకృత్తులు లోపించాయి. 84 మంది భారతీయ శాకాహారులు, 65 శాతం మాంసాహారులు తగిన మేరకు ప్రొటీన్లు తీసుకోవడం లేదు. 93 శాతం మందికి ప్రొటీన్లు ఎంత మేరకు తీసుకోవాలో కూడా తెలియదు.

71% మందికి కండరాల అనారోగ్యం
ఇప్సోస్‌– ఇన్‌బాడీ అధ్యయనం ప్రకారం.. దేశంలో 71% మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదు. భారతీయుల కండరాలు బలంగా లేకపోవడానికి ప్రొటీన్ల లోపమే కారణమంటున్నారు. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలోని పిల్లల్లో 36% మంది తక్కువ బరువుతో ఉన్నారు. 21% మంది ఎత్తుకు తగినంత బరువు లేరు. 38% మంది ఎదుగుదల లోపంతో గిడసబారిపోతున్నారు.

గుడ్ల పెంకులు.. పోషకాల గనులు
ఇటీవల బెంగళూరులో ఓ పరిశోధక బృందం.. శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్‌ చేసి తయారు చేసిన గుడ్ల పెంకు పొడిని గోధుమ పిండితో కలిపి చపాతీలు, బిస్కట్లు తయారు చేయడమెలాగో ప్రదర్శనపూర్వకంగా వివరించింది. పరిశోధకుల్లో ఒకరైన హెచ్‌బీ శివశీల.. గుడ్డు పెంకు ఇచ్చే ఒక స్పూను పొడిలో 750– 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ గుడ్ల పెంకుల పొడిని ఆహారంలో భాగం చేయడం వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించింది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏం తినాలి?...
పాల సంబంధిత ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం, గింజలు, పప్పులు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుళ్లు, వేరుశనగలు, ముదురాకుపచ్చ కూరల్లో మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వృక్ష సంబంధిత మాంసకృత్తులతో పోల్చుకుంటే, జంతు సంబంధమైన మాంసకృత్తులు శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లను తగిన మేరకు అందించగలవని, గుడ్లలో ఉత్తమ కోవకు చెందిన ప్రొటీన్లు ఉంటాయని, వీటిని మొత్తంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల అమినో యాసిడ్లూ లభిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement