Ipsos study
-
‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటు
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్నీ అప్పుల భారం వెన్నాడుతోంది. దాంతో దేశ అప్పుల భారాన్ని తగ్గించే నేతకు అమెరికా ఓటర్లు జై కొడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేసి అమెరికా రుణ భారాన్ని తగ్గిస్తానన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశ అప్పు ఏకంగా 35 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది. పన్నులు పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పాత అప్పులను తీర్చుతుందనే భావనతో ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతన్నారని సర్వే పేర్కొంది. ‘‘ఎగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తానని, చైనా ఉత్పత్తులపై 60 శాతం దిగుమతి పన్ను విధిస్తానని హామీ ఇచి్చన ట్రంప్‌కు 56 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఈ విషయంలో హారిస్ వైపు నిల్చున్న ఓటర్లు కేవలం 41 శాతం’’ అని సర్వే పేర్కొంది. పలు సర్వేల్లో హారిస్ ఆధిక్యతలో ఉన్నా ఏడు స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయని సర్వే అభిప్రాయపడింది. -
ఒలింపిక్స్‌పై ఆసక్తి చూపని ప్రపంచం.. తాజా సర్వేలో వెల్లడి
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడల కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితోపాటు హైప్రొఫైల్ అథ్లెట్లు(గోల్ఫ్ మాజీ నంబర్ వన్ ఆడమ్ స్కాట్, ఫుట్‌బాల్ స్టార్ నెయ్మార్, టెన్నిస్ స్టార్లు ఫెదరర్, నదాల్, సెరెనా విలియమ్స్ తదితరులు) ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉండటంతో.. టోక్యో వేదికగా జరగనున్న ఈ క్రీడలపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో నిర్వహించిన సర్వేలో కేవలం 46 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తేలింది. ఇక విశ్వక్రీడలకు వేదిక అయిన జపాన్‌లో అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తేలడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఈ గేమ్స్‌కు ప్రేక్షకులెవరినీ అనుమతించడం లేదు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన అథ్లెట్లు టోక్యో చేరుకోగా, వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది. -
84శాతం మంది ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారు
భారతదేశంలో 84 శాతం మంది కరోనా మహమ్మారిని నివారించడానికి ఇళ్లకే పరిమితమాయ్యరని ఇప్సోస్ పోల్ తన సర్వేలో స్పష్టం చేసింది. మొత్తం భారత్‌తో సహా 14 దేశాల్లో ప్రతీ 5 మందిలో నలుగురు ఇంట్లో ఉండడానికే ఇష్ట పడుతున్నారని ఇప్సోస్ ఇండియా పేర్కొంది. అయితే ప్రపంచంలో అధిక భాగంలో దేశాలు స్వచ్చందంగా లాక్డౌన్ పాటిస్తున్నాయని తెలిపింది. కాగా రష్యా, వియత్నాం, ఆస్ట్రేలియా ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారని సర్వేలో వెల్లడించింది. ఇక దేశాల వారిగా చూస్తే స్పెయిన్ 95 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తరువాతి స్థానాల్లో వియత్నాం(94శాతం), ఫ్రాన్స్(90 శాతం), బ్రెజిల్(89 శాతం), మెక్సికో( 88 శాతం), రష్యా(85 శాతం)లు ఉన్నాయి. కాగా భారత్ ఈ జాబితాలో అమెరికాతో సంయుక్తంగా 84 శాతంతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. అంతేగాక 15 దేశాల్లో దాదాపు 14 దేశాల ప్రజలు హోమ్ క్వారంటైన్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని , ఇంట్లో ఉంటేనే కరోనా బారీ నుంచి రక్షించుకోగలమని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి 4 వరకు 28వేల మంది సెల్ఫ్ ఐసోలేషన్‌కు ప్రాధాన్యమిచ్చారని, ఇందులో జపాన్ నుంచి తక్కువ సంఖ్యలో ఉన్నారని తేలింది. 'ఇది చాలా అపూర్వమైన కాలం. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచంలోని మిగతా దేశాలకు వేగంగా విస్తరిస్తూ మహమ్మారిగా మారింది. కరోనా దూకుడును అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి. మెజారిటీ భారతీయులు ఇంట్లో ఉండడం ద్వారా లాక్డౌన్ ఆంక్షలను పూర్తిగా పాటిస్తున్నారంటూ' ఇప్సోస్ ఇండియా సీఈవో అమిత్ అదార్కర్ తెలిపారు. (ఏపీలో 363కు కరోనా పాజిటివ్ కేసులు) -
నిరుద్యోగమే పెద్ద సమస్య
న్యూఢిల్లీ: నిరుద్యోగమొక్కటే తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని దేశంలోని నగరాల యువతలో సగం మంది అభిప్రాయపడుతున్నారు. దేశం సరైన దారిలోనే వెళ్తోందని నగర యువతలో 69 శాతం మంది తెలిపినట్లు ఇప్సోస్ అనే సంస్థ తెలిపింది. ‘వాట్ వర్రీస్ ద వరల్డ్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమతౌల్యత, వాతావరణ మార్పులు వంటి సమస్యలపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇప్సోస్ తెలిపింది. ‘పట్టణాల్లో ఉన్న వారిని అక్టోబరులో ప్రశ్నించినప్పుడు సుమారు 46 శాతం మంది నిరుద్యోగం లేదా ఉపాధి లేకపోవడమన్నది అతిపెద్ద సమస్యగా చెప్పుకొచ్చారు. నవంబరులో ఈ సంఖ్య మరో మూడు శాతం పెరిగింది’అని సర్వే తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో పౌరులు అతిపెద్ద సమస్యలుగా పేదరికం, సామాజిక అసమతౌల్యతగా గుర్తించారని, తరువాతి స్థానాల్లో నిరుద్యో గం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి, ఆరోగ్యం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. -
ఆన్లైన్ కొనుగోళ్లలో ‘మొబైల్’ జోరు...
ముంబై: మొబైల్ ఫోన్ వాడకందారుల్లో 88 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు, చెల్లింపులను చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ‘ఎంకామర్స్ రిపోర్ట్’ పేరిట పేపాల్, ఐపీఎస్‌ఓఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ సగటు 77 శాతంగా ఉంటే, ఇంతకుమించి భారతీయులు మొబైల్ ఫోన్లను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారని తేలింది. ఇందులోనూ, ఏకంగా 98 శాతం మంది యాప్‌ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఇక వచ్చే 12 నెలల్లో మొబైల్ ఆప్టిమైజేషన్‌కు ప్రాధాన్యతను ఇవ్వనున్నామని 45 శాతం మంది వ్యాపారులు చెప్పినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లోని 22,000 మంది వినియోగదారులు(18–74 ఏళ్ల మధ్య వయస్సువారు), 4,000 మంది వ్యాపారులను సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. -
కాషాయ ప్రభంజనమే!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ అనంతరం సోమవారం పలు మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. గెలిచే సంఖ్యలో కొద్ది తేడాలున్నా గెలుపైతే ఖాయమేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్ సెంచరీ సాధిస్తుందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్, ఏబీపీ– సీ ఓటరు పోల్స్ తేల్చాయి. బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడానికి 3 స్థానాల దూరంలో ఆగిపోయిందని న్యూస్ 18– ఐపీఎస్ఓఎస్ పేర్కొంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ సగటును పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ శివసేన కూటమికి 211, కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి 64 సీట్లు వస్తాయని తేలింది. హరియాణాలో కూడా బీజేపీ విజయం లాంఛనమేనని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 90 స్థానాల అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నాయి. టైమ్స్ నౌ పోల్ బీజేపీ 71, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చింది. న్యూస్ ఎక్స్ 77 సీట్లు బీజేపీవేనంది. టీవీ9 భారత్‌వర్‡్ష ఎగ్జిట్ పోల్ మాత్రం బీజేపీ మెజారిటీ కన్నా ఒక స్థానం ఎక్కువగా 47 సీట్లు గెలుస్తుందంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి 46.4 శాతం వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి 47.2 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి 38.3% ఓట్లు పొందగా, ఈ సారి 36.9% ఓట్లు వస్తాయని ఐఏఎన్ఎస్– సీఓటర్ సర్వే తెలిపింది. -
రిలయన్స్ జియో మరో సంచలనం
సాక్షి, ముంబై : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో రికార్డును సొంతం చేసుకుంది. జియో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో రెండవ స్థానాన్ని పొందింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ ఘనతను సాధించింది జియో. ఐపోసిస్ 2019 సర్వే లెక్కల ప్రకారం మరో టెలికాం దిగ్గజం, జియో ప్రధాన పోటీదారు భారతి ఎయిర్టెల్ ఎనిమిదవ స్థానం సంపాదించింది. గత ఏడాది సర్వేలో భారత్‌లోని మోస్ట్ పాపులర్ బ్రాండ్ జాబితాలో తొలి రెండు స్థానాల్లో గూగుల్, ఫేస్బుక్ నిలవగా రిలయన్స్ జియో మూడో స్థానంలో నిలిచింది. 2016 టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. 30 కోట్లకు పైగా యూజర్లతో జియో సంచలనం సృష్టించగా, తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా టాప్ టెన్‌లో టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు నిలవడ మరో విశేషం. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం మూడవ స్థానం, మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్బుక్ నాలుగు, జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ ఐదవ స్థానం దక్కించుకున్నాయి. లోకల్ బ్రాండ్స్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషమని ఐపోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా (బిజినెస్ హెడ్, ముంబై) చెప్పారు. ఇక టాప్ 5లో గ్లోబల్ బ్రాండ్స్ తో పోటీపడి దేశీయ బ్రాండ్స్ తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే టాప్ 10లో నాలుగు దేశీయ బ్రాండ్స్ నిలిచాయి. రిలయన్స్ జియో, పేటీఎంలతో పాటు ఎయిర్టెల్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. శాంసంగ్ 6వ స్థానంలో, బిల్‌గేట్స్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో, యాపిల్ ఐఫోన్ 9వ స్థానంలో నిలిచాయి. ఎయిర్టెల్ 8వ స్థానంలో, ఫ్లిప్‌కార్ట్ 10వ స్థానంలో ఉన్నాయి. -
తిండి కలిగినా... కండలేదోయ్!
‘తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్’గురజాడ మాట. ‘కండరాలకు ఈ తిండి చాలదోయ్.. దానికి దండిగా ప్రొటీన్లతో పొత్తు కలవాలోయ్’అని కొనసాగింపు వ్యాక్యాలుంటే నేటికి సరిగ్గా నప్పుతాయేమో! శరీర నిర్మాణానికి మాంసకృత్తులు అత్యంత అవసరం. వాటి లోపం శారీరక పెరుగుదల, మేధో వికాసాన్ని మందగింప చేయడం సహా పలు రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతటి కీలకమైన మాంసకృత్తులు భారతీయుల ఆహారంలో లోపిస్తున్నాయి. ఇప్సోస్– ఇన్‌బాడీ అనే దక్షిణ కొరియా సంస్థ ఇటీవల హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లోని 30– 55 వయస్కులపై జరిపిన అధ్యయనం ప్రకారం 68 శాతం మంది భారతీయులు మాంసకృత్తుల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి వారి సంఖ్య 75 శాతం మంది కన్నా ఎక్కువే. ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంఆర్బీ) గతేడాది విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని తేల్చింది. దీని ప్రకారం.. దేశంలో 73 శాతం మందిలో మాంసకృత్తులు లోపించాయి. 84 మంది భారతీయ శాకాహారులు, 65 శాతం మాంసాహారులు తగిన మేరకు ప్రొటీన్లు తీసుకోవడం లేదు. 93 శాతం మందికి ప్రొటీన్లు ఎంత మేరకు తీసుకోవాలో కూడా తెలియదు. 71% మందికి కండరాల అనారోగ్యం ఇప్సోస్– ఇన్‌బాడీ అధ్యయనం ప్రకారం.. దేశంలో 71% మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదు. భారతీయుల కండరాలు బలంగా లేకపోవడానికి ప్రొటీన్ల లోపమే కారణమంటున్నారు. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలోని పిల్లల్లో 36% మంది తక్కువ బరువుతో ఉన్నారు. 21% మంది ఎత్తుకు తగినంత బరువు లేరు. 38% మంది ఎదుగుదల లోపంతో గిడసబారిపోతున్నారు. గుడ్ల పెంకులు.. పోషకాల గనులు ఇటీవల బెంగళూరులో ఓ పరిశోధక బృందం.. శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి తయారు చేసిన గుడ్ల పెంకు పొడిని గోధుమ పిండితో కలిపి చపాతీలు, బిస్కట్లు తయారు చేయడమెలాగో ప్రదర్శనపూర్వకంగా వివరించింది. పరిశోధకుల్లో ఒకరైన హెచ్‌బీ శివశీల.. గుడ్డు పెంకు ఇచ్చే ఒక స్పూను పొడిలో 750– 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ గుడ్ల పెంకుల పొడిని ఆహారంలో భాగం చేయడం వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించింది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం తినాలి?... పాల సంబంధిత ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం, గింజలు, పప్పులు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుళ్లు, వేరుశనగలు, ముదురాకుపచ్చ కూరల్లో మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వృక్ష సంబంధిత మాంసకృత్తులతో పోల్చుకుంటే, జంతు సంబంధమైన మాంసకృత్తులు శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లను తగిన మేరకు అందించగలవని, గుడ్లలో ఉత్తమ కోవకు చెందిన ప్రొటీన్లు ఉంటాయని, వీటిని మొత్తంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల అమినో యాసిడ్లూ లభిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. -
2018; మాకు అత్యంత సానుకూలం.. !
కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కేలండర్లో సంవత్సరం, తేదీలు, వారాలు మారటమే కాదు.. గత కాలపు చేదు స్మృతులు, అనుభవాలను తొలగిస్తుందనే ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టే సందర్భం. ఏంటీ 2018లోకి ప్రవేశించి ఇప్పటికే సుమారు నెల కావస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసేసుకున్నాం కదా.. మళ్లీ ఈ ప్రస్తావన ఎందుకని ఆలోచిస్తున్నారా.. అదేనండీ మీలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం గురించి ఎంతమంది, ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకునేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ ఇప్సాసిస్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలేమిటో ఓ సారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో సర్వే నిర్వహించగా మొత్తంగా 76 శాతం మంది ప్రజలు 2017తో పోలిస్తే ఈ ఏడాది తమకు సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిలో ముఖ్యంగా యువత 2018ని అత్యంత ఆశావహ సంవత్సరంగా పేర్కొన్నారు. లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియా, పెరూలో 93శాతం మంది సానుకూలంగా స్పందించారు. 88శాతం మంది చైనీయులు 2018కే ఓటు వేశారు. ఇక మన దేశంలో 87శాతం మంది 2018 పట్ల ఆశావహంగానే ఉన్నారు. అమెరికన్లకు గతేడాది అధ్యక్ష ఎన్నికలతో ఎంతో నాటకీయంగా గడిచిపోయింది. డొనాల్డ్ ట్రంప్ పట్ల చాలామంది బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు. 80శాతం మంది అమెరికన్లు కనీసం ఈ ఏడాదైనా మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక యూరప్ దేశాల విషయానికొస్తే... జర్మనీలో 67శాతం, బ్రిటన్‌లో 67శాతం, ఫ్రాన్స్‌లో కేవలం 55శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. ఈ సర్వేలో 44శాతం మందితో జపాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. -
భారత్‌లో ఆర్థిక విశ్వాసం ఎక్కువే: ఇప్సాస్
న్యూఢిల్లీ: ఆర్థిక విశ్వాసం గణనీయంగా ఉన్న ప్రపంచదేశాల్లో భారత్‌కి ఏడో స్థానం దక్కింది. వ్యవసాయోత్పత్తి మెరుగుపడటం, కరెంటు ఖాతా లోటు క్రమంగా తగ్గుతుండటం తదితర సానుకూల అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఇప్సాస్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత నెలలో భారత ఆర్థిక విశ్వాసం.. క్రితం నెలతో పోలిస్తే 11 పాయింట్లు పెరిగి 51 శాతానికి చేరింది. ఆర్థిక విశ్వాసం అత్యధికంగా ఉన్న దేశాల్లో సౌదీ అరేబియా (85 శాతం) అగ్రస్థానం దక్కించుకుంది. జర్మనీ, స్వీడన్, కెనడా, చైనా, ఆస్ట్రేలియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 24 దేశాల్లో 18,083 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వ్యక్తిగత ఆర్థిక అంశాలను స్థానిక ఎకానమీ ప్రభావితం చేస్తుందని, దీంతో తమ పరిస్థితి మెరుగ్గా ఉందని ప్రతి పది మందిలో ముగ్గురు భారతీయులు (32 శాతం) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల కాలంలో తమ స్థానిక ఎకానమీ మరింత పటిష్టంగా ఉంటుందని ప్రతి పది మందిలో నలుగురు ధీమాగా ఉన్నారు. అలాగే భవిష్యత్‌లో స్థిరత్వం, వృద్ధిపైనా భారతీయులు చాలా ఆశావహంగా ఉన్నారు. భారత ఎకానమీకి గడ్డుకాలం ముగిసిందని.. ఇక ఇక్కణ్నుంచి సానుకూల వృద్ధి సాధించగలదని ఇప్సాస్ భారత విభాగం సీఈవో మిక్ గోర్డన్ తెలిపారు. క్యాడ్ తగ్గుతుండటం, ఎగుమతులు..తయారీ రంగం.. ఇన్వెస్టర్ల విశ్వాసం మెరుగుపడుతుండటం ఇందుకు దోహదపడతాయని ఆయన వివరించారు. వర్షపాతం బాగుండటంతో పంట దిగుబడులు పెరిగాయని, ఫలితంగా గ్రామీణప్రాంతాల్లో ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఇది తయారీ రంగం వృద్ధికి ఉపయోగపడిందన్నారు.