ఇన్‌స్టంట్.. ఈ మాట వినగానే ఏదో కొత్త ఊపు వచ్చేస్తుంది మనకు...ఏ పనైనా త్వరగా పూర్తవ్వడమే ఇందులోని ప్రత్యేకత.. రకరకాల అడ్వరై్టజ్‌మెంట్ల ప్రేరణతో.. మనం దీనికి బాగానే అలవాటుపడిపోయాం.. అయితే ఇప్పుడీ అలవాటే కొంపముంచుతోంది.. ఆహారానికే కాదు.. దాని నుంచి అందే ప్రొటీన్లు ఇన్‌స్టంట్‌గా తీసుకోవాలనుకోవడం.. ఇన్‌స్టంట్‌గా కండలు పెంచేయాలనుకోవడం పొరపాటే అంటున్నారు నిపుణులు.. సప్లిమెంట్లు, అధిక ప్రొటీన్ వినియోగం ప్రయోజనాల కంటే ప్రమాదాలను ఎక్కువ కలిగిస్తుందని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్) స్పష్టం చేసింది. దీని వల్ల కండరాల క్షీణత సహా అనేక రకాల అనారోగ్యాలు తప్పవని తేలి్చంది. దీనిపై ఒక పరిశోధన ఆధారిత నివేదికను ఇటీవలే విడుదల చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం...
ఒకప్పుడు విపరీతమైన శ్రమ చేసే క్రీడాకారులు లేదా సిక్స్‌ప్యాక్ వంటివి సాధన చేసే వ్యాయామ ప్రియులకు మాత్రమే పరిచయమున్న ప్రొటీన్ సప్లిమెంట్స్ నగరంలో ప్రతి ఒక్కరికీ చిరపరిచితంగా మారాయి. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే ప్రొటీన్ సప్లిమెంట్ల వినియోగంపై నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) తాజాగా నిర్వహించిన పరిశోధన ఆశ్చర్యాన్ని కలిగింది.. అందులోని కొన్ని అంశాలు..
ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు.
ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రోటీన్‌లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు.
👉అదనంగా జత చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీట్నర్‌లతో పాటు ప్రొటీన్ పౌడర్లలో సాధారణంగా ఉండే ఫ్లేవర్‌ల ప్రొటీన్ పౌడర్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం హానికరం.
👉ఈ సప్లిమెంట్లలో సాధారణ ముడిపదార్థమైన వే ప్రొటీన్, బ్రాంచ్‌డ్–చైన్ అమైనో ఆమ్లాలను (బీసీఎఎఎస్) అధికంగా కలిగి ఉంటుంది. అధిక బీసీఎఎఎస్‌లు నాన్–కమ్యూనికబుల్ (అంటువ్యాధులు కాని) వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
👉 సప్లిమెంట్లను తీసుకోవడం కండరాల బలాన్ని పెంచదు. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు దీర్ఘకాలిక కఠిన వ్యాయామ సమయంలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంటేషన్ కండర పరిమాణాన్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది.
👉 రోజుకు 1.6 గ్రా కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం ఏ విధమైన అదనపు ప్రయోజనాలను అందించదు.
👉 మన శరీరానికి ప్రొటీన్ అవసరాలు మనం అంచనా వేసుకున్నంత ఎక్కువగా ఉండవు.
👉 క్రీడాకారులు సైతం సప్లిమెంట్లపైనే ఆధారపడకుండా ఆహారం నుంచి తగిన మొత్తంలో ప్రొటీన్ పొందడం మేలు.
👉దీర్ఘకాలం పెద్ద మొత్తంలో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఎముక, కణజాలానికి నష్టం కలిగించవచ్చు. అలాగే మూత్రపిండాల సమస్యకు దారితీసే అవకాశం ఉంది.
👉 శాకాహారం లేదా మాంసాహారం నుంచి ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలను సులభంగా అందుకోవచ్చు.
👉 తృణధాన్యాలు, పప్పుధాన్యాలను 3:1 నిష్పత్తిలో లేదా 30 గ్రాముల వరకూ పప్పులతోనో, రోజుకు 80గ్రా మాంసంతోనో ప్రొటీన్ స్థాయిల్ని భర్తీ చేయవచ్చు. ఇది సాధారణ వ్యక్తుల ప్రొటీన్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది.
👉కేవలం ప్రొటీన్ వినియోగం మాత్రమే కండరాల నిర్మాణంలో ఉపకరిస్తుందనేది అపోహ మాత్రమే. ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రొటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు. ఆహారపు అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లు) ద్వారా కండర శ్రేణి నిర్మాణానికి శరీరంలో అమైనో–యాసిడ్ సంబంధిత విధులకు కార్బోహైడ్రేట్లు కొవ్వుల నుంచి కూడా తగినంత శక్తి అందాల్సిన అవసరం ఉంది.
👉 తగినంత శారీరక శ్రమ లేకుండా, కండరాల నిర్మాణానికి ప్రొటీన్లు ఉపకరించవు.
సహజ ప్రొటీన్‌లతో మేలు..
మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్డు, పాలు ప్రొటీన్లు శరీరంలో కొత్త ప్రొటీన్లను తయారు చేయడానికి అవసరమైన ఇరవై అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. పప్పులు, పచ్చి శెనగలు, గుర్రపు శెనగలు, నల్ల శనగలు, చిక్‌పీస్, సోయాబీన్, పచ్చి బఠానీలు వంటి పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్‌నట్‌లు, హాజెల్‌నట్‌లు, సోయా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు గణనీయమైన పరిమాణంలో ప్రొటీన్‌లను కలిగి ఉంటాయి.
పప్పులను తృణ ధాన్యాలతో కలిపి లేదా తృణధాన్యాలు మాంసం ఆహారం, గుడ్లు/ పాలతో కలిపి తిన్నప్పుడు ఆహారంలో ప్రొటీన్ నాణ్యత మెరుగుపడుతుంది. తక్కువ కొవ్వు అధిక ఫైబర్ కలిగిన పప్పులు ఇనుము, పొటాషియం, జింక్, మెగ్నషియంవంటి ముఖ్యమైన విటమిన్లు, ఇతర ఖనిజాలను కలిగి ఉంటాయి. శాఖాహార ఆహారాలు 70%–85% వరకూ ప్రొటీన్‌ను జీర్ణం చేస్తాయి.
మితిమీరితే యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం...
తీసుకున్న ఆహారం ద్వారా గానీ, ఇతరత్రా గానీ శరీర బరువు కిలోకి 1.5 గ్రాముల్ని మించి ప్రొటీన్ తీసుకోకూడదు. అతిగా ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ సమస్యలతో పాటు యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదాలున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే సప్లిమెంట్స్‌లో కొన్నింటిలో స్టెరాయిడ్స్ కలుస్తున్నాయని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంట్స్ వినియోగించాలి.
–డా.కిషోర్‌రెడ్డి, అమోర్ హాస్పిటల్స్
Comments
Please login to add a commentAdd a comment