మహిళలూ.. ప్రొటీన్లు మరవొద్దు!
పురుషుల కంటే 13 శాతం తక్కువగా తీసుకుంటున్నారు l
హెల్దీఫై మీటర్ అధ్యయనం వెల్లడి
ఆహారం తగ్గిస్తే బరువు తగ్గలేరు.. ఇతర సమస్యలూ వస్తాయని హెచ్చరిక
బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలని ఆశపడని వారు ఉండరు. అందులోనూ మహిళలైతే ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా బరువు తగ్గకపోవడమూ చూస్తుంటాం. అలాంటి వారు తమ ఆహారంలో మాంసకృతులు (ప్రొటీన్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని..
లేకపోతే అనేక సమస్యల బారిన పడతారని పరిశోధకులు హెచ్చరిస్తు న్నారు. భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపు 13% తక్కువగా మాంసకృతులను తీసుకుంటున్నారని ఇటీవల హెల్దీఫైమీ అనే సంస్థ అధ్యయనంలో గుర్తించారు. ‘హెల్దీఫై మీటర్ జెండర్ వాచ్– 2017’పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది నుంచి సమాచారం సేకరించి.. ‘హెల్దీఫైమీ’అనే యాప్‌తో దాదాపు ఆరు కోట్ల ఆహార సంబంధిత రికార్డులను పరిశీలించి.. ఈ నిర్ధారణకు వచ్చి నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషులతో పోలిస్తే మహి ళలు కార్బోహైడ్రేట్లు , కొవ్వులను కొంత ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇక మహిళలు చిరుతిళ్ల విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉన్నారని పేర్కొంది.
– సాక్షి, హైదరాబాద్
ఆరోగ్యానికి అన్ని పోషకాలూ అవసరం
ఆరోగ్యంగా ఉండేందుకు మన ఆహారంలో ఇరవై శాతం ప్రొటీన్లు, 30 శాతం కొవ్వులు, 50 శాతం కార్బోహైడ్రేట్లు ఉండాలని పోషకాహార సంస్థలు చెబుతున్నాయి. కానీ మన దేశంలో చాలా మందికి అవసరానికన్నా తక్కువగా ప్రొటీన్లు అందుతున్నాయి. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలు మరో 13 శాతం తక్కువగా ప్రొటీన్లు తీసుకుంటున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ అంతరం బాగా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటోంది.
ఆహారం తగ్గించినా.. ప్రొటీన్లు ఉండాలి
శరీరానికి తగు మోతాదులో ప్రొటీన్లు అందకపోతే జీవక్రియలు మందగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఆహారం తీసుకోవడం తగ్గించినా బరువు తగ్గలేరు. అంతేకాకుండా నిత్యం అలసిపోయినట్టుగా ఉండటం, ఏ విషయంపైనా దృష్టి పెట్టలేకపోవడం, చిన్న విషయాలకే అతిగా స్పందించడం లేదా నిరాసక్తంగా ఉండటం వంటి లక్షణాలూ ఉంటాయి. తీసుకునే ఆహారం శాతం తగ్గించినా... ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్లు తగినంతగా అందకపోతే కండరాల పటుత్వం తగ్గిపోతుందని, వయసు పెరిగేకొద్దీ ఎముకలు పెళుసుబారుతాయని మెడాంటా ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అంబరీష్ మిట్టల్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాము ‘హర్‌హెల్త్‌ఫస్ట్’పేరిట ఈ అంశంపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని..
ఈ నెల 6 నుంచి 9వ తేదీల మధ్య మహిళలకు ఉచిత ఆహార సూచనలు అందజేస్తామని పేర్కొన్నారు.