తిండికి కటకటలాడుతూ ఓడలో ధాన్యం వస్తేనే దేశం ఆకలి తీరే పరిస్థితుల్లో హరిత విప్లవ సాంకేతికత (జిఆర్‌టి)ల అమలు మన దేశంలో 1960వ దశకంలో ప్రాంరంభమైంది. అధిక దిగుబడినిచ్చే వరి/గోధుమ ఆధునిక వంగడాలు తయారుచేసుకొని వాడుతున్నాం.. నీటి పారుదల, రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పంటలు పండిస్తున్నాం.. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తెల్ల బియ్యం, గోధుమలు అందిస్తున్నది. ఏభయ్యేళు గడచిపోయాక.. వెనక్కి చూస్తే జనం కడుపు నిండుతోంది. కానీ, పోషకలోపం వెంటాడుతోంది. ముందెన్నడూ లేనట్లుగా రోగాలు ముసురుకుంటున్నాయి. దీనికి మూలకారణం ఏమిటో ఓ తాజా అధ్యయనం విడమర్చి చెబుతోంది.
ప్రసిద్ధ వంగడాలపైనే అధ్యయనం
వరి, గోధుమల్లో పోషకాల స్థాయిని తెలుసుకునేందుకు ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న నేలల నిపుణుడు డా. సోవన్ దేబనాద్, మరో 11 మంది శాస్త్రవేత్తలతో కలసి విస్తృత పరిశోధనలు చేశారు. డా. సోవన్ ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసిఎఆర్– సెంట్రల్ ఆగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త. పశ్చిమబెంగాల్‌లోని ఐసిఎఆర్– బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ, హైదరాబాద్‌లోని ఐసిఎంఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన మరో 11 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
1960వ దశకం నుంచి ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు 1,199 వరి, 448 గోధుమ, 417 మొక్కజొన్న, 223 జొన్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన (50 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువగా సాగైన) వంగడాల్లో నుంచి ఒక్కో దశాబ్దానికి 2–4 రకాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా పండించి మరీ అధ్యయనం చేశారు.
జయ నుంచి స్వర్ణ సబ్ 1 వరకు..
ఈ విధంగా ఎంపికచేసిన 16 వరి, 18 గోధుమ రకాలను 2018–2020 మధ్యకాలంలో మూడేళ్ల పాటు సాగు చేశారు. ఎంపికైన వరి రకాల్లో 1960ల నాటి జయ, పంకజ్, 1970ల నాటి ఐఆర్8, స్వర్ణ, రాశి, 1980ల నాటి ఐఆర్ 36, క్షితిశ్, సాంబ మసూరి, లలత్, 1990ల నాటి ఐఆర్ 64, ఖందగిరి, రంజిత్, త్రిగుణ, 2000ల నాటి నవీన్, ప్రతిక్ష్య, స్వర్ణ సబ్ 1 వున్నాయి.
గోధుమ రకాల్లో 1960ల నాటి సొనాలిక నుంచి 2010లలో విడుదలైన హెచ్‌డి–3059 రకాలను ఎంపిక చేశారు. 2009లో విడుదలైన స్వర్ణ సబ్ 1 తర్వాత 5 లక్షల హెక్టార్లకు పైగా సాగైన లాండ్‌మార్క్ వరి వంగడాలు లేక΄ోవటం వల్ల 2010లలో విడుదలైన ఏ వరి వంగడాన్నీ అధ్యయనం చేయలేదని డా. సోవన్ తెలి΄ారు. వరి విత్తనాలను కటక్‌లోని ఎన్‌ఆర్‌ఆర్‌ఐ నుంచి, గోధుమ విత్తనాలను కర్నల్‌లోని ఐఐడబ్లు్యబిఆర్‌ల నుంచి సేకరించారు. వీటన్నిటినీ ఒకే రకమైన మట్టి మిశ్రమంతో కూడిన ప్రత్యేక కుండీల్లో సాగు చేశారు. అలా పండించిన తెల్ల బియ్యం, గోధుమ పిండిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో సరిపోల్చి విశ్లేషించటం ఈ అధ్యయనం లక్ష్యం.
45శాతం తగ్గి పోయిన పోషకాలు
మన దేశంలో ప్రజలు రోజువారీ ప్రధాన ఆహారంగా తినే వరి బియ్యం లేదా గోధుమల ద్వారానే రోజుకు అవసరమైన శక్తిలో 50%కి పైగా సమకూరుతుంది. ఈ రెండు ధాన్యాలు గత 50 ఏళ్లలో 45% పోషక విలువలను కోల్పోయినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గత 50 ఏళ్లలో, వరి బియ్యంలో అత్యవసరమైన పోషకాలైన జింక్ 33%, ఇనుము 27% తగ్గిపోయాయి.
గోధుమలో జింక్ 30%, ఇనుము 19% తగ్గిపోయాయి. ఈ సమస్యను ఇప్పటికైనా సరిచేయకపోతే 2040 నాటికి వరి బియ్యం, గోధుమలు తినటానికి పనికిరానంతగా పోషకాలన్నిటినీ కోల్పోతాయని డా. సోవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాలు బాగా తగ్గి΄ోవటంతో పాటు మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ ధాన్యాల్లో విషతుల్య పదార్థాలు చాలా పెద్ద ఎత్తున పోగుపడటం. ఆర్సెనిక్ (పాషాణం) ఏకంగా 1,493 శాతం మేరకు పెరిగిపోయింది.
భార ఖనిజాలతో జబ్బులు
ఈ అధ్యయనం మనకు తెలియజెప్తున్నదేమిటంటే.. రోజువారీగా ప్రధాన ఆహారంగా మనం తింటున్న తెల్ల అన్నం, గోధుమ రొట్టెల్లో పోషకాలు సగానికి తగ్గటంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే భార ఖనిజాలు మెండుగా చేరాయన్న మాట. షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఊబకాయం, కేన్సర్ వంటి అసాంక్రమిక వ్యాధులు పెచ్చుమీరిపోవడానికి వరి, గోధుమల్లో ΄ోషకాలు లోపించటంతో పాటు భార ఖనిజాలు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
ఫాస్ఫరస్, కాల్షియం, సిలికాన్, వనాడియం వంటి పోషకాలు ఎముకల అభివృద్ధికి దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తి, పునరుత్పాదక శక్తికి, నరాల బలానికి జింక్ కీలకం. రక్తవృద్ధికి ఇనుము చాలా ముఖ్యం. రోజూ ఎక్కువ మొత్తంలో తినే ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే నరాల బలహీనత, సంతానలేమి, కండరాలు, ఎముకల క్షీణతకు దారితీస్తుందని నేచర్ పత్రికలో ప్రచురితమైన వ్యాసాల్లో నిపుణులు చెబుతున్నారు.
ఆర్సెనిక్, క్రోమియం, బేరియం, స్ట్రాంటియమ్ వంటి విషతుల్య భార ఖనిజాలు ఊపిరితిత్తుల కేన్సర్లు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, హైపర్‌కెరటోసిస్, కిడ్నీల సమస్యలు, ఎముకల్లో కాల్షియం లోపించటం వంటి జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వం మాదిరిగా జొన్న తదితర చిరుధాన్యాలు తినటం తగ్గిపోవటం, వరి, గోధుమల వినియోగం బాగా పెరిగి΄ోవటం వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. 1990–2016 మధ్యకాలంలో అసాంక్రమిక వ్యాధులు 25% పెరిగి΄ోయాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) నివేదికలు చెబుతున్నాయి.
బయోఫోర్టిఫైడ్ వంగడాలతో సమస్య తీరేనా?
ధాన్యాల్లో పోషకాల లేమిని అధిగమించేందుకు ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొదించటంపై ఐసిఏఆర్ పదేళ్ల క్రితం నుంచే పని ప్రారంభించింది. ఇప్పటికి 142 బయోఫోర్టిఫైడ్ వంగడాలను రూపొందించింది. ఇందులో 124 ధాన్యపు పంటలు. వీటిలో 10 వరి, 43 గోధుమ, 20 మొక్కజొన్న, 13 రకాల కొర్ర వంటి చిన్న చిరుధాన్యాలు, 11 సజ్జ రకాలు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాల లోపాన్ని కొంతమేరకు అధిగమించవచ్చన్నది శాస్త్రవేత్తల మాట. దేశవ్యాప్తంగా 6% సాగు భూమిలో ఈ వంగడాలు సాగవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సాగు భూమిలో పోషకాలు తగ్గిపోయాయి కాబట్టి ఆహారంలో పోషకాలు తగ్గి పోతున్నాయని ఇన్నాళ్లూ అనుకున్నాం. అయితే, వరి, గోధుమ మొక్కలకు నేలలో ఉన్న పోషకాలను తీసుకునే శక్తి కూడా తగ్గిపోయిందని ఇప్పుడు రూఢి అయ్యింది.
ఇంతకన్నా ఆందోళన కలిగించే మరో విషయాన్ని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. నేలలో భార ఖనిజాలు వంటి విషతుల్య పదార్థాలను కంకుల్లోని ధాన్యాలకు చేరకుండా ఆపి వేసే సహజసిద్ధమైన విచక్షణా జ్ఞానం మొక్కలకు ఉంటుంది. అయితే, అధిక దిగుబడుల కోసం తయారు చేసిన ఆధునిక వరి, గోధుమ విత్తనాల బ్రీడింగ్ ప్రక్రియల్లో గత ఏభయ్యేళ్లలో చేసిన కీలక మార్పుల వల్ల ఈ పంటల్లో ఆ తెలివి లోపించింది. అందువల్లే ఇప్పుడు వరి బియ్యం, గోధుమల్లోకి ప్రాణాంతక భార ఖనిజాలు అధిక పాళ్లలో చేరుతున్నాయి. వీటిని తిన్న మనుషులకు పోషకాలు లోపించటం వల్ల మాత్రమే కాదు, భార ఖనిజాల వల్ల కూడా రకరకాల జబ్బులొస్తున్నాయని తేలింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, భారతీయ వైద్య పరిశోధనా మండలి సమన్వయంతో అత్యంత కీలకమైన ఈ అధ్యయనం చేయటం విశేషం. గత నవంబర్‌లో ‘నేచర్’ లో ఈ అధ్యయన పత్రం అచ్చయ్యింది. ఇందులోని వివరాలు సంక్షిప్తంగా..
► గత ఏభయ్యేళ్లలో 45% మేరకు పోషకాలు కోల్పోయిన వరి, గోధుమలు..
►2040 నాటికి పూర్తిగా తగ్గే ప్రమాదం..
►అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల్లో దశాబ్దానికి ఒకటి, రెండు ప్రాచుర్యం ΄పొందిన రకాలపై ఐసిఏఆర్, ఐసిఎంఆర్ సంయుక్త అధ్యయనం
►సాంబ మసూరి, స్వర్ణ సబ్ 1 తదితర 16 రకాల వరి, 18 రకాల
►గోధుమ అధిక దిగుబడి వంగడాలపై అధ్యయనం
►భారఖనిజాల శాతం పెరగటంతో ప్రజారోగ్యానికి ముప్పు
►బయోఫోర్టిఫైడ్ వంగడాలు మేలంటున్న శాస్త్రవేత్తలు
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment