High Demand For Cereals Tiffins In Nalgonda, Know Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

Cereals Tiffins: సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?

Published Sun, Dec 12 2021 8:45 PM | Last Updated on Mon, Dec 13 2021 9:14 AM

Nalgonda: Full demand for Cereals Tiffins, Do You Know This Food Items - Sakshi

Benefits of millets and their role in increasing immunity: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మన పూర్వీకులు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు లేకుండా జీవించారని చెబుతుంటారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ‘ఇమ్యూనిటీ పవర్‌’ పెంచుకునేందుకు బలవర్ధక ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ  నేపథ్యంలో ప్రజలు మళ్లీ సంప్రదాయ ఆహారం వైపు మళ్లుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా నల్లగొండలో చిరు ధాన్యాల టిఫిన్‌ సెంటర్లు వెలిశాయి. ఈ  సెంటర్లలో పట్టణవాసులు బారులు దీరుతున్నారు. 
– రామగిరి (నల్లగొండ) 


చిరు ధాన్యాలతో చేసిన అల్పాహారం తింటున్న ప్రజలు

మారిన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంతో చాలామంది మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మనుషుల ఆరోగ్యం అలవాట్లతో పాటు, తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే, చిరు ధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు చిరు ధాన్యాల ఆహారం తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
చదవండి: బిగ్‌బాస్‌ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు

చిరు ధాన్యాలు అంటే..?
పూర్వ కాలంలో మెట్ట పంటలైన చిరు ధాన్యాలను ఎక్కువగా సాగు చేసేవారు. వీటినే అప్పటి వారు ప్రధాన ఆహారపు అలవాటుగా చేసుకున్నారు. చిరు ధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, అరికలు, అండు కొర్రలు, ఊదలు, అవిసెలు, సామలు మొదలైనవి. 
చదవండి: తరుముతున్న థర్డ్‌వేవ్‌: ‘ఫిబ్రవరి వద్దు.. డిసెంబర్‌లోనే కానివ్వండి పంతులు గారూ’


 

చిరు ధాన్యాల టిఫిన్లు 
చిరు ధాన్యాలు (తృణ ధాన్యాలను) ఉపయోగించి పలు రకాల టిఫిన్లను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా దోశలు, ఇడ్లీలు, పొంగల్, బిస్మిల్లాబాత్, పులిహోర, రాగి సంకటి, రాగి జావ లాంటివి ప్రత్యేకం. వీటితోపాటు నువ్వుల లడ్డు, అవిస గింజల లడ్డు, బీట్‌రూట్‌ లడ్డులను తయారు చేసి అమ్ముతున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్‌ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారితో పాటు ఇతర వ్యాధులు ఉన్న వారి వీటిని రోజూ అల్పాహారంగా తీసుకుంటున్నారు. 
చదవండి: వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్‌ శిలాజాలు


బిస్మిల్లా బాత్‌ 

సామలు
సామలను ఆహారంగా తీసుకోవ డం వల్ల అనేక గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. అతి­సారం, అజీర్ణం, సుఖ వ్యాధులు, శుక్ర­కణాల వృద్ధికి, ఆడవారిలో రుతు సమస్య లకు మంచి ఔషధంగా పని చేస్తాయని న్యూట్రీషన్లు సూచి­­స్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్‌ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయని చెబుతు­న్నారు. కీళ్ల నొప్పులు, ఊబ­కాయం, గుండె జబ్బుల నివారణకు ఇది మంచి ఆహారం. 
చదవండి: ఆ ఇంటి నిండా మొక్కలే!... ఉద్యానవనాన్ని తలపించే గృహవనం!!


రాగి ఇడ్లీ

కొర్రలు
కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియంతో పాటు విటమిన్స్‌ ఉండడంతో ఉదర సంబంధ వ్యాధి గ్రస్తులకు మంచిగా పనిచేసాయంటున్నారు. మూత్రంలో మంట, కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయని, కాలిన గాయాలు, రక్తహీనత, ఊబకాయం, రక్తస్రావం, కీళ్లవాతం, గుండెజబ్బుల నుంచి త్వరగా కోలు కోవడానికి కొర్రలు మంచిగా పనిచేస్తాని చెబుతున్నారు. 


బీట్‌రూట్‌ లడ్డు

అండు కొర్రలు
పూర్వపు పంటల్లో అండు కొర్రలు ఒకటి. వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతనే వండుకోవాలి. కంటి సంబంధ, బీపీ, థైరాయిడ్, జీర్ణాశయం, ఊబకాయం లాంటి సమస్యల నివారణకు బాగా పని చేస్తాయి. అంతే కాకుండా అర్షమొలలు, అల్సర్, ఎముకలు, ఉదర, పేగు, చర్మ సంబంధ కాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయంటున్నారు.


మిక్స్‌డ్‌ పొంగలి

ఊదలు
ఊదలు దేహంలో శరీర ఉష్ణొగ్రతలను సమస్థితిలో ఉంచడానికి ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.  ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవారికి శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారమని, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మలబద్ధకం, మధు మేహానికి మంచిగా పనిచేస్తాయని చెబుతున్నారు.


కొర్ర దోశ

అరికెలు
అరికెలలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. రక్తంలో కోలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. 


నువ్వుల లడ్డు

ఆన్‌లైన్‌ సౌకర్యం కూడా..
చిరు ధాన్యాల టిఫిన్స్‌­ను ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ తీసుకుని ఇంటికి చేరవేస్తాం. టేస్ట్‌ బాగుండడంతో ఆర్డర్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం జొమాటో ద్వారా ఆర్డర్‌ తీసుకుని సరఫరా చేస్తున్నాం. ఇక్కడికి రాలేనివారు యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకుంటున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం. 
– ఎస్‌.నరేష్, జొమాటో బాయ్‌ 


జొన్న సంకటి

షుగర్‌ తగ్గింది
నెల రోజుల నుంచి చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్‌ చేస్తున్నాను. నాకు షుగర్‌ ఉంది. మందులు వాడినా తగ్గకపోయేది. చాలా రోజులుగా చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్‌ చేస్తుండడంతో షుగర్‌ తగ్గినట్లు వైద్యులు చెప్పారు. 
– బి.యాదగిరి 

పార్సిల్‌ తీసుకెళ్తా
నేను చిరుధాన్యాల టిఫిన్‌ సెంటర్‌ నుంచి పార్సిల్‌ తీసుకెళ్తా. ఇంట్లో అందరం చిరు ధాన్యా­లతో తయారు చేసిన టిఫినే తింటాం. ఇంట్లో ఇవన్నీ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకని రోజుకో రకం టిఫిన్‌ తీసుకెళ్తాను. ఇవి తిన్నప్పటి నుంచి ఆరోగ్యం మంచిగా ఉంది. 
– అజారుద్దీన్‌ 

ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా
చిరు ధాన్యాలతో టిఫిన్‌ చేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో ఇలాంటి హోటళ్లు ఎక్కువగా ఉండేవి. నల్లగొండలో ఈ ఆహారం అందించాలనే ఉద్దేశంతో శివసాయి చిరు ధాన్యాల పేరుతో టిఫిన్‌ సెంటర్‌ పెట్టాను. ఇక్కడ నేను మరో నలుగురికి శిక్షణ కూడా ఇస్తున్నా. షుగర్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్‌ పేషంట్లు టిఫిన్‌ సెంటర్‌కు బాగా వస్తున్నారు. 
– రాజునాయక్, నిర్వాహకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement