tiffins
-
సర్కారు బడుల్లో అల్పాహారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విజయదశమి కానుక ముందుగానే ప్రకటించింది. ఉదయం వేళ విద్యార్థులకు అల్పాహారం అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉదయంపూట విద్యార్థులు ఖాళీ కడుపుతో వస్తుండడంతో చదువుపై ధ్యాస తగ్గుతోందని విద్యాశాఖ వర్గాల పరిశీలనలో తేలింది. దీనిని అధిగమించడంతోపాటు పిల్లలను శారీరకంగా మరింత పటిష్టంగా తయారు చేసే దిశగా సీఎం కేసీఆర్ అల్పాహార పథకం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తుండగా, అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే కాకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఈ పథకం అమలు చేస్తారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 27 జారీ చేశారు. వచ్చే నెల 24 నుంచి అమల్లోకి... ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలుకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాల్సి ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులను డీటైల్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తమిళనాడులో అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రణాళిక తయారు చేయాలని స్పష్టం చేసింది. ఈ పథకం కేవలం పాఠశాలల పనిదినాల్లోనే అమలులో ఉంటుంది. మొత్తంగా దసరా కానుకగా అక్టోబర్ 24 తేదీన ఈ పథకం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. బడిపిల్లలకు వరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా పేదపిల్లలే. వారికి మధ్యాహ్న భోజన పథకం ఎంతో ఉపయోగపడుతోంది. ఇక అల్పాహార పథకం వారికి సీఎం ఇస్తున్న వరంగానే చెప్పొచ్చు. ఈ పథకం అమలుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. – రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని స్వాగతిస్తున్నాం. బడికి వచ్చే పేదవిద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఆలోచనతో పథకాన్ని తీసుకురావడం శుభసూచకం. దీనిని శాశ్వతంగా అమలు చేయాలి. కార్యాచరణ ప్రణాళిక పకడ్భందీగా రూపొందించాలి. – కె.జంగయ్య, చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభుత్వ మానవీయకోణం సీఎం కేసీఆర్ మానవీయకోణంలో తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతం. సీఎం నిర్ణయం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. – జూలూరు గౌరీశంకర్, చైర్మన్, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఇది కూడా చదవండి: ముగిసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష -
ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు.. చదువు, చావు!
ఆరోజు ఆమె ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి చదువు, రెండవది చావు. చదువుకన్నా ముందు ‘చావు’కు సంబంధించిన ఆలోచనలు పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన నేహాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘ఇక ఈలోకంలో నేను ఉండలేను’ అనుకుంది ఆమె గట్టిగా. అదే సమయంలో తన బాల్యంలోని కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. ‘మీ అమ్మాయి తెలివైనది. బాగా చదివించండి’ అని టీచర్లు తన తల్లిదండ్రులతో చెప్పేవాళ్లు. లాయర్ కావాలనేది తన కల. అయితే చిన్న వయసులోనే నేహకు పెళ్లి కావడంతో ఆ కల చెదిరిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత భర్త వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ తనను ఒంటరి చేశాడు. అత్తవారి నుంచి కూడా తనకు మద్దతు కరువైంది. పైగా సూటిపోటి మాటలు. పుట్టింటికి వెళదామా అంటే... పాపం వారి పరిస్థితి అంతంత మాత్రమే. వారికి తాను భారంగా ఉండదల్చుకోలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల్లోకి వెళ్లింది. అయితే ఈ ప్రతికూల ఆలోచనలు కొద్దిసేపే. ‘నాకో కల ఉంది. ఆ కలను నెరవేర్చుకోవడానికి బతకాలి’ అని గట్టిగా అనుకుంది నేహ చిన్నాచితకా పనులు చేస్తూ ఆగిపోయిన చదువును కొనసాగించింది. దూరవిద్యా విధానంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత... ఎల్ఎల్బీలో అడ్మిషన్ పొందింది. ఆరోజు తన జీవితంలో మరిచిపోలేని రోజు. ఎంత సంతోషించిందో! అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక కంపెనీలో ఉద్యోగం చేసేది నేహ. అయితే కోవిడ్ వేవ్‌లో ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. వేరే కంపెనీలో ఉద్యోగం వెదుక్కోవడానికి కాలికి బలపం కట్టుకొని తిరిగింది. (క్లిక్: జీవితాన్ని మలుపు తిప్పిన కెమెరా: మాయ ముక్తై) ‘ఉన్న ఉద్యోగులనే వద్దంటున్నాం. కొత్త ఉద్యోగాలు ఎక్కడివి’ అనే మాటలు వినిపించాయి. ఒకవైపు తాను చదువుకోవాలి, దానికి ముందు తాను బతకాలి! ఒకరోజు తనకు ఒక మార్గం తోచింది. బజ్జీ, దోసె, పరోటా... ఇలా రకరకాల టిఫిన్లు తయారుచేసి అమ్మాలని నిర్ణయించుకుంది. నిజానికి వాటి తయారీ, రుచుల గురించి తనకు పెద్దగా తెలియదు. తెలిసిన వారి దగ్గరకు వెళ్లి ఓపిగ్గా నేర్చుకుంది. జలంధర్‌లోని ఒక ఆస్పత్రికి సమీపంలో చిన్నగా టిఫిన్ స్టాల్ మొదలుపెట్టింది. ఉల్లిగడ్డలు తరగడం నుంచి పాత్రలు తోమడం వరకు అన్నీ తానే చేసేది. కొద్దిరోజులలోనే టిఫిన్ సెంటర్ పాపులర్ అయింది. ఇప్పుడు తాను ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగంతో వచ్చే జీతం కంటే ఇప్పుడే ఆదాయం ఎక్కువగా వస్తుంది. ‘లా’ పూర్తి చేసి మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకోవాలనేది నేహ ఆశయం. ‘స్త్రీలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి లాయర్‌గా అండగా నిలవాలనుకుంటున్నాను’ అంటుంది నేహ. -
సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?
Benefits of millets and their role in increasing immunity: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మన పూర్వీకులు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు లేకుండా జీవించారని చెబుతుంటారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ‘ఇమ్యూనిటీ పవర్’ పెంచుకునేందుకు బలవర్ధక ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ సంప్రదాయ ఆహారం వైపు మళ్లుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా నల్లగొండలో చిరు ధాన్యాల టిఫిన్ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లలో పట్టణవాసులు బారులు దీరుతున్నారు. – రామగిరి (నల్లగొండ) చిరు ధాన్యాలతో చేసిన అల్పాహారం తింటున్న ప్రజలు మారిన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంతో చాలామంది మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మనుషుల ఆరోగ్యం అలవాట్లతో పాటు, తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అయితే, చిరు ధాన్యాల ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు చిరు ధాన్యాల ఆహారం తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. చదవండి: బిగ్‌బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు చిరు ధాన్యాలు అంటే..? పూర్వ కాలంలో మెట్ట పంటలైన చిరు ధాన్యాలను ఎక్కువగా సాగు చేసేవారు. వీటినే అప్పటి వారు ప్రధాన ఆహారపు అలవాటుగా చేసుకున్నారు. చిరు ధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, అరికలు, అండు కొర్రలు, ఊదలు, అవిసెలు, సామలు మొదలైనవి. చదవండి: తరుముతున్న థర్డ్‌వేవ్: ‘ఫిబ్రవరి వద్దు.. డిసెంబర్లోనే కానివ్వండి పంతులు గారూ’ చిరు ధాన్యాల టిఫిన్లు చిరు ధాన్యాలు (తృణ ధాన్యాలను) ఉపయోగించి పలు రకాల టిఫిన్లను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా దోశలు, ఇడ్లీలు, పొంగల్, బిస్మిల్లాబాత్, పులిహోర, రాగి సంకటి, రాగి జావ లాంటివి ప్రత్యేకం. వీటితోపాటు నువ్వుల లడ్డు, అవిస గింజల లడ్డు, బీట్రూట్ లడ్డులను తయారు చేసి అమ్ముతున్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారితో పాటు ఇతర వ్యాధులు ఉన్న వారి వీటిని రోజూ అల్పాహారంగా తీసుకుంటున్నారు. చదవండి: వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు బిస్మిల్లా బాత్ సామలు సామలను ఆహారంగా తీసుకోవ డం వల్ల అనేక గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అతిసారం, అజీర్ణం, సుఖ వ్యాధులు, శుక్రకణాల వృద్ధికి, ఆడవారిలో రుతు సమస్య లకు మంచి ఔషధంగా పని చేస్తాయని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బుల నివారణకు ఇది మంచి ఆహారం. చదవండి: ఆ ఇంటి నిండా మొక్కలే!... ఉద్యానవనాన్ని తలపించే గృహవనం!! రాగి ఇడ్లీ కొర్రలు కొర్రలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి ఆహారం. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రలలో అధిక పీచు, మాంసకృత్తులు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియంతో పాటు విటమిన్స్ ఉండడంతో ఉదర సంబంధ వ్యాధి గ్రస్తులకు మంచిగా పనిచేసాయంటున్నారు. మూత్రంలో మంట, కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయని, కాలిన గాయాలు, రక్తహీనత, ఊబకాయం, రక్తస్రావం, కీళ్లవాతం, గుండెజబ్బుల నుంచి త్వరగా కోలు కోవడానికి కొర్రలు మంచిగా పనిచేస్తాని చెబుతున్నారు. బీట్రూట్ లడ్డు అండు కొర్రలు పూర్వపు పంటల్లో అండు కొర్రలు ఒకటి. వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతనే వండుకోవాలి. కంటి సంబంధ, బీపీ, థైరాయిడ్, జీర్ణాశయం, ఊబకాయం లాంటి సమస్యల నివారణకు బాగా పని చేస్తాయి. అంతే కాకుండా అర్షమొలలు, అల్సర్, ఎముకలు, ఉదర, పేగు, చర్మ సంబంధ కాన్సర్ల చికిత్సకు బాగా ఉపయోగపడతాయంటున్నారు. మిక్స్డ్ పొంగలి ఊదలు ఊదలు దేహంలో శరీర ఉష్ణొగ్రతలను సమస్థితిలో ఉంచడానికి ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవారికి శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారమని, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మలబద్ధకం, మధు మేహానికి మంచిగా పనిచేస్తాయని చెబుతున్నారు. కొర్ర దోశ అరికెలు అరికెలలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. రక్తంలో కోలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. నువ్వుల లడ్డు ఆన్లైన్ సౌకర్యం కూడా.. చిరు ధాన్యాల టిఫిన్స్‌ను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ తీసుకుని ఇంటికి చేరవేస్తాం. టేస్ట్ బాగుండడంతో ఆర్డర్లు బాగా పెరిగాయి. ప్రస్తుతం జొమాటో ద్వారా ఆర్డర్ తీసుకుని సరఫరా చేస్తున్నాం. ఇక్కడికి రాలేనివారు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం. – ఎస్.నరేష్, జొమాటో బాయ్ జొన్న సంకటి షుగర్ తగ్గింది నెల రోజుల నుంచి చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్ చేస్తున్నాను. నాకు షుగర్ ఉంది. మందులు వాడినా తగ్గకపోయేది. చాలా రోజులుగా చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫిన్ చేస్తుండడంతో షుగర్ తగ్గినట్లు వైద్యులు చెప్పారు. – బి.యాదగిరి పార్సిల్ తీసుకెళ్తా నేను చిరుధాన్యాల టిఫిన్ సెంటర్ నుంచి పార్సిల్ తీసుకెళ్తా. ఇంట్లో అందరం చిరు ధాన్యాలతో తయారు చేసిన టిఫినే తింటాం. ఇంట్లో ఇవన్నీ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకని రోజుకో రకం టిఫిన్ తీసుకెళ్తాను. ఇవి తిన్నప్పటి నుంచి ఆరోగ్యం మంచిగా ఉంది. – అజారుద్దీన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా చిరు ధాన్యాలతో టిఫిన్ చేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో ఇలాంటి హోటళ్లు ఎక్కువగా ఉండేవి. నల్లగొండలో ఈ ఆహారం అందించాలనే ఉద్దేశంతో శివసాయి చిరు ధాన్యాల పేరుతో టిఫిన్ సెంటర్ పెట్టాను. ఇక్కడ నేను మరో నలుగురికి శిక్షణ కూడా ఇస్తున్నా. షుగర్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ పేషంట్లు టిఫిన్ సెంటర్‌కు బాగా వస్తున్నారు. – రాజునాయక్, నిర్వాహకుడు -
అమ్మకు నో అడ్మిషన్
‘మమ్మీ.. హండ్రెడ్ రుపీస్.. ప్లీజ్’ మమ్మీ దగ్గర డబ్బులు తీసుకోవడం.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి బైక్ కిక్ కొట్టడం!! జాబ్ చేసే అబ్బాయిలు కూడా.. బయట తిన్నాకే.. ఇంటికి వెళ్లడం! తినకుండా వస్తే.. బయటి నుంచే తెప్పించుకోవడం! ఇంట్లో తినేవాళ్లా.. వద్దంటే వినేవాళ్లా! ఇప్పుడు సీన్ మారుతోంది. యూట్యూబ్ చూసి ఇంట్లోనే.. స్టౌ వెలిగిస్తున్నారు మగపిల్లలు! అమ్మను కూడా వంటింట్లోకి రానివ్వకుండా.. ఇంటికే రెస్టారెంట్ లుక్ తెస్తున్నారు! ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు ఇదివరకటంత ఉద్ధృతంగా లేవు. బయటి నుంచి తెప్పించుకునేవారు బాగా తగ్గిపోయారు. కారణం తెలిసిందే. కరోనా. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న మగపిల్లలు ఇంటినే రెస్టారెంట్‌గా మార్చేస్తున్నారు! ఇంట్లోవాళ్లని ఆశ్చర్యపరిచేలా రకరకాల వంటకాలను అందంగా అలంకరించి మరీ సిద్ధం చేస్తున్నారు. ‘నీకు నువ్వు తయారు చేసుకో’ అనే ఒక ఆరోగ్యకరమైన పద్ధతిని పాటిస్తున్నారు. కొత్త కొత్త వంటకాల కోసం యూ ట్యూబ్‌ను గాలిస్తున్నారు. వీళ్ల కోసమే అన్నట్లు రుచికరంగా వండే విధానాలను చెప్పే సైట్లు ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాంటి సైట్లలో ‘దివ’ రెస్టారెంట్ చెఫ్ రితు దాల్మియా నిర్వహిస్తున్న ‘డిఐవై–డు ఇట్ యువర్సెల్ఫ్’ ఒకటి. ‘‘కొన్ని వంటకాలను ఇంటి దగ్గర తయారు చేయటం అందరికీ సాధ్యపడదు. అందుకే నేను వాటి తయారీ విధానాన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఉదాహరణకు చైనీస్, థాయి వంటకాలు తయారు చేయాలంటే.. కొద్దిగా నీళ్లు లేదా కొబ్బరి పాలు కలపాలి. అప్పుడు తాజాగా తయారవుతాయి. అవి డైనింగ్ టేబుల్ మీదకు వచ్చేసరికి రెస్టారెంట్లో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. మంచి చెఫ్లమన్న తృప్తీ మిగులుతుంది’’ అంటారు దల్మియా. ఆ మాట నిజమే. ఒకప్పుడు పెద్దవాళ్ల దగ్గర వంటలు నేర్చుకునేవారు. ఇప్పుడు యూట్యూబ్ ఇంటింటి పెద్దగా మారింది. ఆడవాళ్లే కాకుండా.. ప్రతి ఇంటా నలభీములు తయారవుతున్నారు. పానీపూరీ, వడపావ్, బిసబేళబాత్, పనీర్బటర్ మసాలా.. ఒకటేమిటి.. అన్ని దేశాల, రాష్ట్రాల వంటకాలను యూ ట్యూబ్‌లో చూస్తూ తయారుచేస్తున్నారు. పిల్లల వంటకాలు రుచి చూసిన తల్లులు వారిని ప్రశంసల్లో ముంచేస్తున్నారు. ఇంట్లోని వారిని మరింత ఆనందింపజేసేందుకు, ఆశ్చర్యపరిచేందుకు యూత్ అంతా ఇంట్లోనే బార్బిక్యూ అనుభూతి చెందేలా సెట్టింగ్స్ కూడా వేస్తున్నారు. మొఘలాయ్, తండూరీ, షావర్మ వంటి వెరైటీలు చేసి అవురావురుమనిపించేలా వడ్డిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని ఒత్తిడి నుంచి కాసేపు రిలాక్స్ అవ్వటానికి కూడా వంట మంచి సాధనంగా పనిచేస్తోంది. ‘అమ్మా.. ఆకలి’ అని ఎప్పుడూ ఇంట్లో అమ్మ మీదే ఆధారపడకుండా అమ్మకూ చేసిపెట్టే యువతరాన్ని గత ఏడు నెలలుగా చూస్తున్నాం. కరోనా మన యువతరానికి శుభ్రతను మాత్రమే కాదు, వంటనూ నేర్పిందనే అనుకోవాలి. అమ్మకు విశ్రాంతి రకరకాల వంటకాలు చేయడటం వల్ల వంటలో నైపుణ్యం సాధిస్తున్నాను. బయటవారు ఎలా చేస్తారో తెలియదు కనుక, మన చేత్తో మనం చేసుకోవటం బెస్ట్ అనిపిస్తోంది. ఇన్ని రోజులూ తెలిసో తెలియకో బయట నుంచి తెచ్చుకున్నాం. ఈ విపత్కర సమయంలో స్వయంగా వండుకుని తినటం అలవాటైపోయింది కనుక ఇక ఎవరి మీదా ఆధారపడక్కర్లేదు. ఇంట్లో అమ్మ నిరంతరం పనిచేస్తుంటుంది. అమ్మకి విశ్రాంతి ఇవ్వాలి. అమ్మతో ఎక్కువ గడపాలి. అమ్మకు çసహాయపడాలి. – శివతేజ, సాఫ్ట్వేర్ ఉద్యోగి, విజయవాడ అందమైన అనుభూతి లిటిల్ థింగ్స్ బ్రింగ్ మోర్ హ్యాపీనెస్. అమ్మనాన్నలకి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. వాళ్లకు స్వయంగా నేనే వండి పెట్టడం ఒక అందమైన అనుభూతి. ఇంట్లో వాళ్లందరం కలిసి కూర్చుని తినటం కూడా ఆనందంగా అనిపిస్తోంది. ఆఫీస్‌లో పనిని ఉద్యోగులు పంచుకుంటారు. అలాగే ఇంట్లో మేం కూడా ఒకరు కూరలు తరగటం, ఒకరు వండటం, ఒకరు మసాలాలు చూడటం.. ఇలా విభజించుకుంటున్నాం. అందరం తలో చెయ్యి వేయడటం వల్ల రుచికరమైన డిష్ త్వరగా సిద్ధమవుతోంది. – శ్రీవాత్సవ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, హైదరాబాద్ – వైజయంతి పురాణపండ -
‘టిఫిన్’ తినేదెట్లా?
సిటీలో అల్పాహారం తినడం ఇక కష్టమే. ఇడ్లీ, దోసె, వడ, మైసూర్ బజ్జీ, పూరీ లాంటి టిఫిన్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కరోనా లాక్డౌన్ కారణంగా కొద్దిరోజులుగా మూతపడిన టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రోడ్డు వెంబడి బండ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ ఐటమ్స్ రేట్లు మాత్రం విపరీతంగా పెంచేశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సాక్షి, హైదరాబాద్: టిఫిన్ సెంటర్ లేదా హోటల్‌కు వెళ్లి ప్లేట్ ఇడ్లీ తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కుటుంబంతో కలిసి హోటల్‌కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ ఇచ్చే ముందు పర్స్ చెక్ చేసుకోవాల్సి వస్తోంది. ఇంట్లో టిఫిన్ రెడీ చేయకపోతే టిఫిన్ సెంటర్‌కు వెళ్లి రూ.వంద ఇస్తే నలుగురికి సరిపడా టిఫిన్ వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అన్ని ధరలతో పాటు టిఫిన్ ఐటమ్స్ రేట్లూ పెరిగిపోయాయి. దీంతో చాలా మంది టిఫిన్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లో ఏది ఉంటే అది తినేందుకు సిద్ధపడుతున్నారు. కరోనా ప్రభావం గ్రేటర్లో కాస్త తగ్గుతున్న నేపథ్యంలో గ్రేటర్ ప్రజలు ఇప్పడుడిప్పుడే బయటి ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో హోటల్ వ్యాపారం కాస్త పుంజుకుంటుంది. అయితే ధరలు మాత్రం విపరీతంగా పెంచారు. గత ఐదు నెలలుగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్ సైడ్ బండ్లు సైతం నడవక తీవ్ర నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడంతోపాటు ప్రస్తుతం నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో అల్పాహారం రేట్లు పెంచాల్సి వస్తోందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇడ్లీ, వడ, దోసె, పూరీ, మైసూర్ బోండా ధరలు గతం కంటే 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. స్పెషల్ టిఫిన్ల ధరలు ఇంకా భారీ స్థాయిలోనే పెరిగాయి. కరోనా సంక్షోభానికి ముందు ఇడ్లీ ప్లేట్ రూ.15 నుంచి రూ.20 ఉండగా, ఇప్పుడు దాదాపు రెట్టింపు ధర పెట్టాల్సి వస్తోంది. కొన్ని టిఫిన్ సెంటర్లలో ధర అంతగా పెంచకపోయినా, పరిమాణం మాత్రం బాగా తగ్గించారు. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లపై ప్లేట్‌కు నాలుగు ఇడ్లీలు ఇస్తుండగా, పెద్ద టిఫిన్ సెంటర్లలో రెండు మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం వీటి ధర కొన్ని టిఫిన్ సెంటర్లలో రూ.30 నుంచి రూ. 50 వరకు చేరుకుంది. స్పెషల్ సాంబార్ ఇడ్లీ రూ.50 నుంచి రూ.70 వరకు బిల్ వేస్తున్నారు. గతంలో రూ.20 ఉన్న సాదా దోసె ఇప్పుడు రూ.30కి పెరిగింది. మసాల దోసె, ఆనియన్ దోశ, ఆమ్లెట్, ఉప్మా దోసె రూ.50 నుంచి రూ.70 వరకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల స్పెషల్ దోశలకు రూ.100 కూడా ఇవ్వాల్సి వస్తోంది. మైసూరు బజ్జీ ప్లేట్ గతంలో రూ.25 ఉండగా, ఇప్పుడు కొన్ని చోట్ల రూ.50 వరకు తీసుకుంటున్నారు. ఇక వడ రూ.50 నుంచి రూ.60 పెడితే కాని తినలేని పరిస్థితి. పూరీ, చపాతీల ధరలూ పెరిగిపోయాయి. సరుకుల ధరలు పెరగడంతోనే... కరోనా అనంతరం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో టిఫిన్ల ధరలూ పెంచినట్లు వ్యాపారులు చెబుతున్నారు. లాక్డౌన్ తరువాత నిత్యావసర సరుకుల ధరలు దాదాపు 30 నుంచి 40 శాతం పెరిగాయి. ప్రస్తుతం కిలో మినపప్పు రూ.120 నుంచి రూ. 140, పల్లీలు రూ.100 నుంచి రూ.120, పుట్నాలు రూ.40 నుంచి రూ. 60, నువ్వులు కిలో రెండు వందలపైనే లభిస్తున్నాయి. ఇక వంటనూనెల ధరలు కూడా కిలోకు రూ.20 వరకు పెరిగాయి. సరుకుల ధరతో పాటు కూరగాయాల ధరలు కూడా పెరిగాయి. టమాట బెండకాయ, క్యాప్సికం, పందిరి బీర, క్యారెట్ తదితర కూరగాయల ధరలు మండుతున్నాయి. సిబ్బంది జీతాల భారం కరోనాతో చాలా మంది పనివాళ్లు ఊళ్లకు వెళ్లారు. దీంతో లేబర్ సమస్య కూడా ఏర్పడింది. టిఫిన్ సెంటర్లలో మాస్టర్లు, ఇతర సిబ్బంది జీతాలు కూడా పెరిగాయి. గతంలో మాస్టర్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు పనిచేస్తే రూ.300 నుంచి రూ.600 వరకు చెల్లించే వారు. ఇప్పుడు రూ.600 నుంచి రూ. వెయ్యి ఇస్తే కానీ మాస్టర్లు దొరకడం లేదు. ఇతర సిబ్బంది జీతాలు కూడా రెట్టింపు స్థాయిలో పెరిగిపోయాయి. -
స్ప్రౌటెడ్ మిలెట్ దోసె, ఇడ్లీ విత్ జింజర్ చట్నీ
పిండి కోసం కావలసినవి: స్ప్రౌట్స్ – ఒక కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు); ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. చట్నీ కోసం కావలసినవి: ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క; వెల్లుల్లి రెబ్బలు – 3 (లేకపోయినా పరవాలేదు); మెంతులు – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 12; కరివేపాకు – పావు కప్పు; ఇంగువ – అర టీ స్పూను; చింతపండు – పావు కప్పు కంటె ఎక్కువ; బెల్లం పొడి – పావు కేజీ పిండి తయారీ: ఉప్పు మినహా పిండి కోసం చెప్పిన మిగతా పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, నానబెట్టిన వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాక, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙సుమారు ఎనిమిది గంటలపాటు ఈ పిండిని నానబెట్టాలి ∙ఈ పిండితో దోసెలు, ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు ∙అల్లం చట్నీతో అందించాలి ∙ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లం చట్నీ తయారీ: చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ధనియాలు, పచ్చి సెనగ పప్పు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, అల్లం ముక్క వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙నానబెట్టిన చింతపండు, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ∙దోసె, ఇడ్లీలతో అందించాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన వంటకాలను బామ్మలు, అమ్మమ్మలు మాత్రమే చెప్తారు. ఇందులో నూనె ఎక్కువగా వాడలేదు. మినుముకు విరుగుడైన అల్లం చట్నీతో తినడం వల్ల శరీరం గట్టి పడుతుంది. -
ఫైవ్ స్టార్ హోటల్‌ను తలదన్నేలా..
సాక్షి, అశ్వారావుపేట( ఖమ్మం) : అది ఐదు నక్షత్రాల (ఫైవ్ స్టార్) హోటల్ కాదు. కనిపించీ కనిపించని లైటింగ్ ఉండదు. యూనిఫాం వేసుకుని వడ్డించే వారు అక్కడ కనిపించరు. కానీ, ప్లేట్లో ఉండే ఐటెమ్‌లు మాత్రం ఫైవ్ స్టార్ హోటల్‌ను తలదన్నేలా ఉంటాయి. అక్కడి రుచి అలాంటి హోటళ్లను మైమరిపిస్తాయి. 20 రకాల కూరలతో భోజనం, 20 రకాల ఐటెంలతో టిఫిన్ ఆరగిస్తూ అక్కడి ప్రజలు నూతన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా అశ్వారావుపేటకు చెందిన, చేయి తిరిగిన చెఫ్ మున్నా చేస్తున్న అద్భుతం. తొలుత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి తీసేసి, ప్రస్తుతం కేటరింగ్ మారి సక్సెస్ సాధించాడు. ప్లేట్ భోజనం రూ.250 అయినప్పటికీ అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే అతడి చేయి నుంచి వచ్చిన వంటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అశ్వారావుపేటకు చెందిన చెఫ్ మున్నా తొలుత విశాఖపట్టణంలో హోటల్లో వంటలకు సంబంధించిన కోర్సు చేశాడు. అనంతరం వంటల్లో ప్రావీణ్యం సంపాదించాడు. స్వగ్రామమైన అశ్వారావుపేటలో హోటల్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను నిర్వహించాడు. అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో వ్యాపారం ముందుకు సాగక దానిని నిలిపివేశాడు. కానీ, మున్నా వంటకాలకు అలవాటు పడిన సన్నిహితులు, బంధుమిత్రులు తమ ఇంట్లో జరిగే వేడుకలకు మున్నాను సలహాలు, సూచనలతో మెనూ సిద్ధం చేసేవారు. అలా అలా పలు శుభకార్యాలకు మున్నా మార్క్ చూపించాడు. దీంతో పలు సమావేశాలకు వీఐపీ భోజనం కావాలంటే అశ్వారావుపేటలో మున్నాను ఆశ్రయించాల్సిందేననే పేరు సంపాదించాడు. వంటను ఓ ప్రవృత్తిగా భావించి ఐదేళ్లపాటు ఎలాంటి ఫీజు లేకుండా వంటలు చేసిన మున్నా మిత్రుల కోరిక మేరకు క్యాటరింగ్ రంగంలోకి బలవంతంగా అడుగుపెట్టాడు. ఒక్కో తలకు భోజనం వెల రూ.250 మాత్రమే. అంత ఖరీదైన భోజనం.. అదీ అశ్వారావుపేటలో అంటే కొందరు ముక్కున వేలు వేసుకున్నారు. కానీ, అందులోని భిన్న రకాల కూరలు తెలుసుకున్నాక ఆ ధర సరైనదేనని ప్రజలు భావించారు. చూస్తే నోరూరాల్సిందే మున్నా మెనూను చూడగానే కడుపు నిండుతుందని భోజన ప్రియులంటున్నారు. వెజ్ స్టార్టర్స్, ఫ్రూట్స్ స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఒకే ప్లేట్లో వడ్డించడం మున్నా ప్రత్యేకత. వంకాయ, పెరుగు చట్నీ, కొబ్బరి అన్నం, ఉలవచారు చికెన్, ఉలవచారు ఎగ్, గోంగూర బోటీ, పుష్కా, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి దోశ, జొన్న దోశ, రాగి సంగటి, జొన్న సంటి, నాటుకోడి, ఇంకా ఫ్రూట్‌జ్యూస్‌లు ఇలా అతడు చేసే ఏ వంటకమైనా అదిరిపోవాల్సిందే. 20 రకాల వంటకాలతో టిఫిన్, 20 రకాల ఐటమ్స్‌తో భోజనం, 10 రకాల పండ్లతో స్టార్టర్స్.. ఇలా రంగురంగుల పండ్లతో కళ్లు జిగేల్ మనిపిస్తుంటాడు. ఓసారి మున్నా మెనూ వింటే ఎంతయినా తినాలనిపిస్తుందని పలువురు చెబుతున్నారు. అశ్వారావుపేటకు అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే కొందరు ప్రముఖులు మున్నా మెనూకు ముగ్ధులవుతుంటారు. హైదరాబాద్ వచ్చేయమని కోరుతుంటారు. కానీ, మున్నా సున్నితంగా తిరస్కరిస్తాడు. మున్నా తల్లి భారతికుమారి ఐసీడీఎస్‌లో సీడీపీఓగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పోషకాలతో కూడిన వంటకాలపై ఆమెకున్న పట్టు మున్నాకు వారసత్వంగా వచ్చింది. తల్లి ఆశీస్సులతో తల్లి సమక్షంలోనే నాణ్యమైన వంటలు అందిస్తానంటున్నాడు మున్నా. చాలా ఖరీదైన మెనూ కాబట్టి అశ్వారావుపేట వంటి గ్రామీణ ప్రాంతంలో కొనసాగడం గొప్ప విషయమే. అయితే, మున్నా మెనూ టేస్ట్ చేయాలంటే అశ్వారావుపేట వచ్చి ముందుగా 99856 61117 నంబర్‌కు ఆర్డర్ ఇవ్వాలి. ఎందుకంటే హోటల్‌లా నిత్యం సమయానికి వండి సిద్ధంగా ఉంచరు కదా. -
ఇడ్లీ రూ. 10.. ఇన్నోవా అద్దె రూ. 2,640
సాక్షి, సిటీబ్యూరో: టీ/ కాఫీ రూ. 6 ఇడ్లీ (2) రూ. 10, వడ (2) రూ.15, నీళ్లసీసా 500మి.లీ రూ.10 వెజ్ బిర్యానీ రూ.80, చికెన్‌బిర్యాని రూ.120, టాటా ఇండికా (ఏసీ) అద్దె రోజుకు రూ.1,440, క్వాలిస్ (ఏసీ)అద్దె రోజుకు రూ. 2,160, ఇన్నోవా (ఏసీ ) అద్దె రోజుకు :రూ. 2,640, బస్సు (30 సీట్లు) రూ.3,600, సుమో నాన్ ఏసీ రూ.1,440 డ్రైవర్ బత్తా రోజుకు రూ. 240.. ఏమిటీ ధరలు అనుకుంటున్నారా..? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులకు సంబంధించి ప్రతిపాదించిన ధరలు. వ్యయానికి సంబంధించి ఆయా అంశాలకు జిల్లా ఎన్నికల అధికారులు ప్రతిపాదించినవాటిలో ఆహార పదార్థాల ధరలు తక్కువగా ఉండటంతో వాటికి ఓకే అన్న రాజకీయపార్టీల ప్రతినిధులు హోర్డింగులు, లౌడ్స్పీకర్లు, వాహనాల అద్దెల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలని కోరారు. ఎన్నికల్లో ప్రచార సామగ్రి తదితర అంశాల ఖర్చును నిర్ధారించేందుకు సోమవారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వాహనాలు, ప్రచార సామగ్రి ధరలు మార్కెట్ రేటు కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని టీడీపీ ప్రతినిధి వనం రమేశ్, బీజేపీ ప్రతినిధి పొన్న వెంకటరమణ, తదితరులు డిమాండ్ చేశారు. అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ. 28 లక్షలకు మించకూడదు కనుక, ఎక్కువ ధరలుంటే.. ఎక్కువ వ్యయం నమోదు కానుండటంతో ప్రచార సామాగ్రి ధరలు తగ్గించాలని కోరారు. దాదాపు రూ. 1600 వ్యయమయ్యే పోడియం ఖర్చు రూ8640గా చూపారన్నారు. ఫ్లెక్సీల ధరలు, వాహనాలు, లౌడ్‌స్పీకర్ల అద్దెధరలు ఎక్కువగా చూపారని, వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. అన్నీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఒకే ఇంట్లో భారీసంఖ్యలో ఉన్న ఓట్లకు సంబంధించి ఫిర్యాదుదారులతో కలిసి అధికారులు పరిశీలనకు వెళ్లాలని రాజకీయపార్టీల ప్రతినిధులు సూచించారు. ముఖ్యంగా పాతబస్తీలో స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. బోగస్ ఓట్లు తొలగించాం: దానకిశోర్ నగరంలో బోగస్ ఓట్ల గురించి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తొలగించినట్టు దానకిశోర్ తెలిపారు. కొన్ని కోర్టు కేసులో ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి సభలు, సమావేశాలు, పాదయాత్రలకు తప్పనిసరిగా ఇ–సువిధ ఆన్లైన్ ద్వారానే అనుమతులను పొందాలని స్పష్టం చేశారు. అనుమతులకు దరఖాస్తు చేసిన 48 గంటల్లోగా అనుమతి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ 24గంటల్లోనే ఇవ్వాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు. -
దోసెకు పేదలిక దూరమేనా?
► కుతకుతలాడుతున్న కందిపప్పు ► చుక్కలు తాకుతున్న మినపపప్పు ► ఘాటెక్కిన మిర్చి, కొండెక్కిన చింతపండు ► దోసె, ఇడ్లీ మర్చిపోవాల్సిందేనంటున్న మధ్యతరగతి ► పచ్చడన్నం కూడా భారమవుతుందన్న పేదలు ► పచ్చళ్లు పెట్టుకోవడం కూడా కష్టమే హైదరాబాద్: దోసె, ఇడ్లీలకు పేదలు, సామాన్య ప్రజలు దూరం కావాల్సిందేనా? నాలుకను కట్టేసుకోవాల్సిందేనా? మండుతున్న ఎండలను మించిపోయేలా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను చూస్తే తప్పదనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు కుతకుతలాడుతోంది. మినపపప్పు ధర చుక్కలంటుతోంది. పల్లీల రేట్లూ పెరిగిపోయాయి. పంట చేతికొస్తున్న దశలోనే చింతపండు ధర కొండెక్కి కూర్చొంది. కిలో పచ్చి మిర్చి ఏకంగా రూ.వంద పలుకుతోంది. ఎండుమిర్చి మరింత ఘాటెక్కింది. విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు వింటేనే సామాన్యుల గుండె దడదడలాడుతోంది. గత నెల రోజుల్లోనే పప్పుల ధరలు భారీగా పెరిగాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చితే ప్రస్తుతం చాలా నిత్యావసర సరుకుల ధరలు రెండు రెట్లు అధికమయ్యాయి. ఈ రేట్లతో సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటే జేబులు తడుముకొని వాయిదా వేసుకోవాల్సి వస్తోందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట రూ.125 ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ. 180కి చేరింది. మినప పప్పు ధర రూ.130 నుంచి రూ.190 - 200కు ఎగబాకింది. కిలో పల్లీల రేటు రూ. 90 నుంచి రూ. 140కి చేరింది. ఇలా ఏ నిత్యావసర సరుకు తీసుకున్నా విపరీతంగా ధర పెరిగిపోవడం సామాన్య, దిగువ మధ్యతరగతి, చిరు వేతన జీవులను ఆర్థికంగా కుంగదీస్తోంది. పచ్చడన్నం తినాలన్నా భారమే.. కందిపప్పు ధర భారీగా పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న హోటళ్లలో సాంబారు, పప్పుకు కందిపప్పు బదులు పెసర పప్పు వాడుతున్నారు. మినపపప్పు రేటు విపరీతంగా పెరిగినందున ఇడ్లీ, దోసెలకు స్వస్తి చెప్పాల్సి వస్తోందని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అంటున్నాయి. ఇడ్లీలు, దోసెలు చేసుకోవడం దాదాపు మర్చిపోయామని కడపకు చెందిన ప్రేమలత అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు తెలిపారు. పప్పుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిని కొనలేక పచ్చడన్నంతో సరిపెట్టుకుందామన్నా అదీ భారంగా ఉందని పేదలు కంట తడిపెట్టుకుంటున్నారు. పచ్చడికి అవసరమైన చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీల ధరలు నింగినంటుతుండటమే ఇందుకు కారణం. చింతపండు కిలో ధర రూ. 70 నుంచి రూ.120కి పెరిగింది. ఎండు మిర్చి రూ. వంద నుంచి 170కి ఎగబాకింది. పచ్చిమిర్చి కిలో రూ. 90 నుంచి రూ. 100 వరకూ పలుకుతోంది. నువ్వుల మాట ఇక చెప్పనక్కరలేదు. ప్రత్యామ్నాయంగా పల్లీలు తీసుకోవాలన్నా కిలో రూ. 140 పైనే ఉండటం సామాన్యులకు భారంగా మారింది. పెరిగిన ధరలతో పచ్చడి మెతుకులు సమకూర్చుకోవడం కూడా భారంగా ఉందని పేదలు వాపోతున్నారు. ఈ ఏడాది పచ్చళ్లూ కష్టమే... మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో ఏడాది పొడవున అత్యవసరాలకు వాడుకునేందుకు పచ్చళ్లు పెట్టాలనుకునేవారు సైతం పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. ఎండు మిర్చి కిలో రూ. 170 నుంచి 190 పలుకుతుండటం ఇందుకు ఒక కారణం. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి నువ్వుల నూనె మంచిది. నాణ్యమైన నువ్వుల నూనె లీటరు రూ.160పైనే పలుకుతోంది. నాణ్యమైన మిర్చిపొడి కిలో రూ.250 పైనే ఉంది. పచ్చళ్లలో తప్పకుండా వాడాల్సిన ఆవాలు ధర కూడా చాలా పెరిగిపోయింది. మామిడి కాయ ఒక్కోటి సైజును బట్టి రూ.15 నుంచి రూ. 22 వరకూ ధర ఉంది. ముక్కలు కోసినందుకు ఒక్కో కాయకు ఏకంగా రూ. 4 వసూలు చేస్తున్నారు. దీంతో పచ్చళ్లు కూడా చాలా తక్కువ మోతాదులో పెట్టుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు. ధరల పెరుగుదల తీరు ఇదీ.... సరుకు 2014 2015 2016 కందిపప్పు 70 115 180 మినపపప్పు 75 130 200 ఎండుమిర్చి 82 110 170 చింతపండు 70 105 120 పచ్చిమిర్చి 50 70 100