దోసెకు పేదలిక దూరమేనా?
► కుతకుతలాడుతున్న కందిపప్పు
► చుక్కలు తాకుతున్న మినపపప్పు
► ఘాటెక్కిన మిర్చి, కొండెక్కిన చింతపండు
► దోసె, ఇడ్లీ మర్చిపోవాల్సిందేనంటున్న మధ్యతరగతి
► పచ్చడన్నం కూడా భారమవుతుందన్న పేదలు
► పచ్చళ్లు పెట్టుకోవడం కూడా కష్టమే
హైదరాబాద్: దోసె, ఇడ్లీలకు పేదలు, సామాన్య ప్రజలు దూరం కావాల్సిందేనా? నాలుకను కట్టేసుకోవాల్సిందేనా? మండుతున్న ఎండలను మించిపోయేలా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను చూస్తే తప్పదనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు కుతకుతలాడుతోంది. మినపపప్పు ధర చుక్కలంటుతోంది. పల్లీల రేట్లూ పెరిగిపోయాయి. పంట చేతికొస్తున్న దశలోనే చింతపండు ధర కొండెక్కి కూర్చొంది. కిలో పచ్చి మిర్చి ఏకంగా రూ.వంద పలుకుతోంది. ఎండుమిర్చి మరింత ఘాటెక్కింది.
విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు వింటేనే సామాన్యుల గుండె దడదడలాడుతోంది. గత నెల రోజుల్లోనే పప్పుల ధరలు భారీగా పెరిగాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చితే ప్రస్తుతం చాలా నిత్యావసర సరుకుల ధరలు రెండు రెట్లు అధికమయ్యాయి. ఈ రేట్లతో సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటే జేబులు తడుముకొని వాయిదా వేసుకోవాల్సి వస్తోందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట రూ.125 ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ. 180కి చేరింది. మినప పప్పు ధర రూ.130 నుంచి రూ.190 - 200కు ఎగబాకింది. కిలో పల్లీల రేటు రూ. 90 నుంచి రూ. 140కి చేరింది. ఇలా ఏ నిత్యావసర సరుకు తీసుకున్నా విపరీతంగా ధర పెరిగిపోవడం సామాన్య, దిగువ మధ్యతరగతి, చిరు వేతన జీవులను ఆర్థికంగా కుంగదీస్తోంది.
పచ్చడన్నం తినాలన్నా భారమే..
కందిపప్పు ధర భారీగా పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న హోటళ్లలో సాంబారు, పప్పుకు కందిపప్పు బదులు పెసర పప్పు వాడుతున్నారు. మినపపప్పు రేటు విపరీతంగా పెరిగినందున ఇడ్లీ, దోసెలకు స్వస్తి చెప్పాల్సి వస్తోందని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అంటున్నాయి. ఇడ్లీలు, దోసెలు చేసుకోవడం దాదాపు మర్చిపోయామని కడపకు చెందిన ప్రేమలత అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు తెలిపారు. పప్పుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిని కొనలేక పచ్చడన్నంతో సరిపెట్టుకుందామన్నా అదీ భారంగా ఉందని పేదలు కంట తడిపెట్టుకుంటున్నారు.
పచ్చడికి అవసరమైన చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీల ధరలు నింగినంటుతుండటమే ఇందుకు కారణం. చింతపండు కిలో ధర రూ. 70 నుంచి రూ.120కి పెరిగింది. ఎండు మిర్చి రూ. వంద నుంచి 170కి ఎగబాకింది. పచ్చిమిర్చి కిలో రూ. 90 నుంచి రూ. 100 వరకూ పలుకుతోంది. నువ్వుల మాట ఇక చెప్పనక్కరలేదు. ప్రత్యామ్నాయంగా పల్లీలు తీసుకోవాలన్నా కిలో రూ. 140 పైనే ఉండటం సామాన్యులకు భారంగా మారింది. పెరిగిన ధరలతో పచ్చడి మెతుకులు సమకూర్చుకోవడం కూడా భారంగా ఉందని పేదలు వాపోతున్నారు.
ఈ ఏడాది పచ్చళ్లూ కష్టమే...
మామిడి కాయలు మార్కెట్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఏడాది పొడవున అత్యవసరాలకు వాడుకునేందుకు పచ్చళ్లు పెట్టాలనుకునేవారు సైతం పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. ఎండు మిర్చి కిలో రూ. 170 నుంచి 190 పలుకుతుండటం ఇందుకు ఒక కారణం. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి నువ్వుల నూనె మంచిది. నాణ్యమైన నువ్వుల నూనె లీటరు రూ.160పైనే పలుకుతోంది. నాణ్యమైన మిర్చిపొడి కిలో రూ.250 పైనే ఉంది. పచ్చళ్లలో తప్పకుండా వాడాల్సిన ఆవాలు ధర కూడా చాలా పెరిగిపోయింది. మామిడి కాయ ఒక్కోటి సైజును బట్టి రూ.15 నుంచి రూ. 22 వరకూ ధర ఉంది. ముక్కలు కోసినందుకు ఒక్కో కాయకు ఏకంగా రూ. 4 వసూలు చేస్తున్నారు. దీంతో పచ్చళ్లు కూడా చాలా తక్కువ మోతాదులో పెట్టుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు.
ధరల పెరుగుదల తీరు ఇదీ....
సరుకు 2014 2015 2016
కందిపప్పు 70 115 180
మినపపప్పు 75 130 200
ఎండుమిర్చి 82 110 170
చింతపండు 70 105 120
పచ్చిమిర్చి 50 70 100